breaking news
Parishad
-
12 వస్తోంది... 16 ఏం చెబుతుంది?
- ఐదురోజుల వ్యవధిలో... మూడు ఫలితాలు - వరుసగా మున్సిపల్, పరిషత్, సార్వత్రిక రిజల్ట్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు సాక్షి, ఖమ్మం ఎన్నికల జాతర ముగిసింది. ఇక ఫలితాల కోసమే అందరి ఎదురుచూపులు. ఐదు రోజుల వ్యవధిలో మూడు ఫలితాలు వెలువడనుండడంతో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. గెలుపుధీమాలో ఉన్నవారు మెజారిటీ లెక్కలు వేసుకుంటుంటే....పోటాపోటీగా ఉన్న చోట గట్టెక్కుతామా లేదా అన్న ఆందోళనలో అభ్యర్థులు ఉన్నారు. 12న మున్సిపల్ ఫలితాలు.. మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల పరిధిలో మొత్తం 97 వార్డుల్లో 523 మంది అభ్యర్థులు తలపడ్డారు. ఈ ఫలితాలను ఈనెల 12న ఆయా మున్సిపాలిటీల పరిధిలో వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు ఈవీఎంలు ఉపయోగించడంతో...ఆరోజు కొద్ది గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. అయితే మున్సిపల్ ఎన్నికలను కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు వ్యూహత్మకంగా తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల జాతరలో మున్సిపల్ ఫలితాలు తొలుత వెలువడనుండడంతో అన్ని పార్టీలలో ప్రస్తుతం దీనిపై చర్చనడుస్తోంది. ఎవరికి వారే మున్సిపల్ ఫలితాల నుంచి మొదలుకొని పరిషత్, సార్వత్రిక ఎన్నికల్లో తమ విజయపరంపర కొనసాగుతుందని ధీమాగా ఉన్నారు. పరిషత్ ఫలితం కోసం... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల కోసం పోటీ చేసిన అభ్యర్థుల్లో ఆత్రుత నెలకొంది. గత నెల 6న తొలి విడత, 11న మలివిడత ఎన్నికలు జరిగాయి. నెల రోజుల తర్వాత ఈ ఫలితాలు వెలువడనుండడంతో పల్లెపోరులో ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనని ఇటు అభ్యర్థులు, అటు రాజకీయ పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు ఈనెల 13న పరిషత్ ఫలితాలు వెలువరించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పరిషత్ ఎన్నికల్లో 44 జెడ్పీటీసీ స్థానాలకు 191 మంది, 622 ఎంపీటీసీ స్థానాలకు 2,320 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సార్వత్రిక ఎన్నికలకు రిహార్సల్‌గా పరిషత్ ఎన్నికలను పోల్చడంతో ఆయా పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బ్యాలెట్ పద్ధతిన ఈ ఎన్నికలు జరగడంతో ఓటింగ్ ఎక్కువగా నమోదైన మండలాల్లో జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. సార్వత్రిక ఫలితాలు కీలకం.. మూడు ఎన్నికలు జాతరగా జరిగినా సార్వత్రిక ఎన్నికల ఫలితాలే అన్ని పార్టీలకు కీలకం. ఈ ఫలితాలతోనే జిల్లాలో ఏ పార్టీ బలం ఎంత అనేది బయటపడనుంది. అలాగే తెలంగాణ తొలి అసెంబ్లీలో జిల్లా నుంచి ఎవరు అడుగపెడతారో తేలనుంది. ఈ నెల 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నామినేషన్లు వేసినప్పటి నుంచి అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రచార పర్వం, ఓటర్లకు గాలం వేయడంలో అభ్యర్థులు వినూత్న శైలిలో ముందుకెళ్లారు. వీటితో పాటు ఖమ్మం ఎంపీ స్థానం ఫలితం కూడా ఆరోజే బయట పడనుండడంతో ప్రధానంగా అన్ని పార్టీలు పోలింగ్ ముగిసిన రోజు నుంచే అంచనాల్లో మునిగాయి. పది అసెంబ్లీ స్థానాలకు మొత్తం 143 మంది బరిలో నిలవగా, ఖమ్మం పార్లమెంట్ స్థానంలో 27 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి బ్రహ్మరథం పడతారో వేచిచూడాల్సిందే. -
12న మున్సిపల్.. 13న ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు
-
12న మున్సిపల్.. 13న ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఫలితాల వెల్లడికి రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సాధారణ ఎన్నికలు పూర్తయ్యాక స్థానిక సంస్థల ఫలితాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ఫలితాల నోటిఫికేషన్‌ను సోమవారం జారీ చేశారు. మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు జరగ్గా, ప్రాదేశిక ఎన్నికలు ఏప్రిల్ ఆరు, ఏప్రిల్ 11న జరిగిన విషయం విదితమే. ఈ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలకు ముందే విడుదల అయితే వాటి ప్రభావం పడుతుందని కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లడంతో.. ఎన్నికల ఫలితాలను ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మే 12న, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు మే 13న వెల్లడించాలని ఎస్ఈసీ రమాకాంతరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పరోక్ష ఎన్నికలు అసెంబ్లీ ఫలితాల తరువాతే.. ఇదిలాఉండగా, మున్సిపల్, మండల, జడ్పీల అధ్యక్షులకు పరోక్ష పద్దతిలో నిర్వహించే ఎన్నికలు సాధారణ ఎన్నికల ఫలితాల తరువాతే నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడికి నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం, పరోక్ష పద్ధతిలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. పరోక్ష ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొనడానికి ప్రస్తుత శాసనసభ్యులకు జూన్ రెండు వరకు పదవి ఉన్నందున వారికి అవకాశం ఇవ్వాలా.? లేక కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలా.? అనే విషయంలో స్పష్టత లేదు. దీంతో పరోక్ష ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయలేదని సమాచారం. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంటుంది.