కొండను కొల్లగొట్టారు
మక్తల్, న్యూస్‌లైన్: అక్రమార్కుల చేతుల్లో కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అక్రమమైనింగ్ వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టారు. ఆరేళ్లుగా ఏటా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నా..రెవెన్యూ, మైనింగ్ అధికారులు అటువైపు వెళ్లకపోవడం శోచనీయం.
మక్తల్ మండలం సంగంబండ గ్రామశివారులోని కొండమ్మగుట్టలో జరుగుతున్న ఈ మైనింగ్ అక్రమ బాగోతం ఆ శాఖ అధికారులనే నివ్వెరపరిచింది. 2003లో హైదరాబాద్‌కు చెందిన గోపాల్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌కు సంగంబండ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం క్రషర్‌మిషన్ వేసుకోవడానికి అప్పట్లో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారు. ఈ మిషన్ కూడా ప్రాజెక్టు ముంపుప్రాంతంలోనే ఉంది. అప్పట్లో 16 ఎకరాల భూమికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. కేవలం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసమే కావడంతో అధికారులు అప్పట్లో అడ్డుచెప్పలేదు.
ఇదిలాఉండగా 2006-07లో సంగంబండ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మారెడ్డి కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డి వద్ద నుంచి క్రషర్ మిషన్‌ను కొనుగోలు చేశాడు. ఈ మేరకు సర్వే నెం.152లో 2.20 ఎకరాల భూమిలో గల పట్టాదారు లక్ష్మారెడ్డి విజయ్ కన్స్ట్రక్షన్స్ పేర మైనింగ్ అనుమతి తీసుకున్నాడు. అక్కడ ఉన్న భూమిలో మైనింగ్‌కు పెద్దగా అవకాశం లేకపోవడంతో పక్కనే ఉన్న కొండమ్మ గుట్టపై కళ్లు పడ్డాయి. నిబంధలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ నిర్వహించి పెద్దఎత్తున మైనింగ్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ వ్యాపారులకు పలుకుబడి గల రాజకీయల అండదండలు ఉండటంతో వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది.
అనుమతి ఓ చోట..మైనింగ్ మరోచోట
కాగా సంగంబండ శివారులో మైనింగ్‌కు తీసుకున్న అనుమతి ఒకచోట అయితే మైనింగ్ తవ్వకాలు మాత్రం మరోచోట చేపట్టారు. సర్వే నెం.152లో లకా్ష్మరెడ్డి పట్టాభూమిలో 2.20 ఎకరాలకు మైనింగ్‌కు అనుమతి ఉంది. అయితే సర్వేనెం.125లో గల ప్రభుత్వ గైరాన్ భూమిలో కొండమ్మ గట్టు ఉంది. 25 ఎకరాల్లో ఉన్న ఇదే గట్టుకు గత ఆరేళ్లుగా అక్రమంగా మైనింగ్ జరుగుతుంది. ఇప్పటికే సగం గట్టు కరిగిపోయింది. నిత్యం వందల ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా రవాణా జరుగుతుంది. ఒక్కో టిప్పర్‌కు రూ.20వేలు, ట్రాక్టర్‌కు రూ.మూడువేల చొప్పున విక్రయిస్తున్నారు. ఏడాదికి కోటి రూపాయల చొప్పున ఆరేళ్లుగా సుమారు రూ.10కోట్ల వ్యాపారం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, ఒక్కో క్యూబిక్ మీటర్‌కు రూ.50 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వం సుమారు రూ.3కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. ఇక్కడ సామర్థ్యానికి మించి బ్లాస్టింగ్ జరుగుతుండటంతో సమీపంలో ఉన్న సంగంబండ, మహద్వార్ గ్రామాల్లో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. పంటపొలాలు నాశనమయ్యాయని శ్రీనివాస్‌రెడ్డి అనే రైతు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేశాడు.
గోప్యంగా విచారణ
ఇదిలాఉండగా ఈనెల21న హైదరాబాద్ నుంచి వచ్చిన మైనింగ్‌శాఖ అధికారులు సంగంబండ గ్రామాన్ని సందర్శించి గోప్యంగా విచారణ జరి పారు. కొండమ్మ గట్టు వద్ద జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై విజిలెన్స్ డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో కొండమ్మగట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మైనింగ్ తవ్వకాలకు కొలతలు వేశారు. వివరాలను బహిర్గత పరిచేందుకు అధికారులు నిరాకరించారు. స్థానిక విలేకరులు విచారణపై వివరాలు చెప్పాల్సిందిగా కోరగా..మూడుకోట్ల విలువ చేసే మైనింగ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సెలవిచ్చారు.