breaking news
jammanapalli
-
అడిగింది జననపత్రం.. ఇచ్చింది మరణ పత్రం!
మార్కాపురం, బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కావాలని తల్లితండ్రులు కోరితే... ఓ పంచాయతీ కార్యదర్శి మాత్రం మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మేకల అరుణ, ఆదామ్ దంపతులకు గత ఏప్రిల్ 6న మార్కాపురం ఏరియా వైద్యశాలలో ఆడపిల్ల పుట్టింది. బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకుగాను జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ గ్రామ కార్యదర్శిని కోరారు. అదిగో..ఇదిగో అంటూ వారం రోజులపాటు కాలం గడిపిన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు అదే నెల 19వ తేదీన వారికి ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. నిరక్షరాస్యులైన వారు ఆ పత్రం ఆధారంగా బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకోగా.. ఐకేపీ అధికారులు వారి దరఖాస్తును తిరస్కరించారు. తాము తెచ్చింది జనన ధ్రువీకరణ పత్రం కాదని.. మరణ ధ్రువీకరణ పత్రమని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. దీనిపై గ్రామ కార్యదర్శిని నిలదీయడంతో పొరపాటు అయిపోయిందంటూ జారుకున్నాడు. జనన ధ్రువీకరణ పత్రం కావాలని అడిగితే.. ఎటువంటి విచారణ చేయకుండానే పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ఎంపీడీవో రాజేష్‌ను వివరణ కోరగా.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
బర్త్ సర్టిఫికెట్‌కు బదులు డెత్ సర్టిఫికెట్
ఒంగోలు : లంచం ఇవ్వలేదనే అక్కసుతో ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి జనన ధ్రువీకరణ పత్రానికి బదులు మరొకటి జారీ చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లిలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు జనన ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.400 ఇవ్వలేదని ఓ చిన్నారికి బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్ జారీ చేశాడు. బంగారు తల్లి పథకం కోసం అరుణ అనే మహిళ బర్త్ సర్టిఫికెట్ దరఖాస్తు చేసుకుంది. కాగా పంచాయతీ కార్యదర్శి వ్యవహరించిన తీరుపై చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం ఇవ్వనంత మాత్రానా సర్టిఫికెట్ మార్చేస్తారా అంటూ మండిపడుతున్నారు. వెంకటేశ్వరరావుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.