breaking news
Helicopter missile
-
నేవీకి మరింత శక్తి
వాషింగ్టన్: సముద్రంలో గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేకించిన ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. 24 హెలికాప్టర్లకు మొత్తంగా ధర రూ.1.78 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్రంలో చైనా క్రియాశీలకంగా మారుతున్న నేపథ్యంలో యుద్ధ సమయాల్లో భారత నావికాదళానికి ఈ హెలికాప్టర్లు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. శత్రు దేశాల సబ్మెరైన్లు, నౌకలను వెంటాడి వాటిని ధ్వంసం చేసేందుకు వీలుగా వీటిని రూపొందించారు. సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. యుద్ధనౌకల నుంచి, విధ్వంసక నౌకల నుంచి, క్రూజర్ల నుంచి, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి ప్రయోగించగలిగే హెలికాప్లర్లలో ఇవే అత్యాధునికమైనవని నిపుణులు చెబుతున్నారు. ఇవీ ప్రత్యేకతలు... ♦ అమెరికాలో ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను ‘రోమియో’అని కూడా పిలుస్తారు. ♦ లాక్‌హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ (ఓవిగో) సంస్థ ఈ హెలికాప్టర్లను తయారుచేసింది. ♦ ఈ హెలికాప్టర్లలో సబ్మెరైన్లను ధ్వంసం చేసే పరికరాలతో పాటు సర్చ్, రెస్క్యూ, గన్ సపోర్ట్, నిఘా, సమాచారం చేరవేసే సాంకేతికతను అనుసంధానం చేసింది. ♦ సరుకులు, వ్యక్తుల తరలించే వెసులుబాటు ఉంది. ♦ 2721 కిలోగ్రాముల బరువైన సామగ్రిని తాడుతో తరలించే సదుపాయం కూడా ఇందులో ఉంది. ♦ జూలై 2001లో తొలి హెలికాప్టర్ తయారైంది. ♦ ఇందులో ముగ్గురు లేదా నలుగురు సిబ్బందితో పాటు ఐదుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ♦ దీనికి సెన్సర్లను అమర్చారు. దీనివల్ల హెలికాప్టర్‌ను లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చే వాటిని గుర్తిస్తుంది. ♦ చిన్న ఆయుధాలు, మంటలు అంటుకున్నా కూడా ఎలాంటి హాని కలగకుండా ఏర్పాట్లు చేశారు. ♦ 1,425 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రెండు టర్బో షాఫ్ట్ ఇంజన్లను దీనికి అమర్చారు. -
‘హెలినా’ పరీక్ష విజయవంతం
జోధ్‌పూర్: శత్రువు ల యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసే ‘హెలినా’ క్షిపణి (‘నాగ్’ క్షిపణి హెలికాప్టర్ వెర్షన్)ను రక్షణశాఖ విజయవంతంగా పరీక్షించింది. రాజస్తాన్‌లో జైసల్మేర్‌లో చందన్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించిన ఈ ప్రయోగంలో..7 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ‘హెలినా’ ఛేదించిందని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం మూడు సార్లు దీనిని ప్రయోగించగా ఒకసారి లక్ష్యానికి స్వల్ప దూరంలో పేలిందని తెలిపాయి. అయితే ప్రాథమికంగా క్షిపణి పరీక్ష సంతృప్తికర ఫలితాలను ఇచ్చిందన్నాయి. ఈ వెర్షన్‌కు సంబంధించి ఇంతకు ముందే పోఖ్రాన్లో ప్రయోగాత్మక పరీక్షలు జరిపామని, అవి కూడా విజయవంతం అయ్యాయని చెప్పాయి.