breaking news
Hall tickets Distribution
-
22వ తేదీ టెన్త్ పరీక్ష వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పదో తరగతి పరీక్షల విభాగం చేస్తోంది. హాల్‌టికెట్ల ముద్రణ పనులు చివరి దశకు చేరడంతో బుధవారం నుంచి పాఠశాలలకు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 22న జరగాల్సిన ఆంగ్లం పేపర్–2 పరీక్షను వాయిదా వేసింది. 22న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఎన్నికల అధికారి సూచన మేరకు పరీక్ష తేదీని మార్చింది. ఆ పరీక్షను వచ్చే నెల 3న నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు రివైజ్డ్ టైం టేబుల్‌ను జారీ చేసి, ప్రధానోపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. పరీక్ష ప్రతి రోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఉంటుందని, ద్వితీయ భాష పరీక్ష, ఓఎస్ఎస్సీ పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటాయని వివరించింది. ఎస్సెస్సీ వొకేషనల్ థియరీ పరీక్ష మాత్రం ఉదయం 11:30 గంటలకే పూర్తవుతుందని తెలిపింది. -
రేపే ఏపీసెట్-2013
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ అర్హత పరీక్ష (ఏపీసెట్)-2013 నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 24న నిర్వహించనున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 12 రీజినల్ సెంటర్లలో 208 పరీక్షా కేంద్రాలలో 1,26,785 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. వీరిలో 3,479 మంది వికలాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేక స్క్రైబ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అభ్యర్థులందరికీ హాల్ టికెట్ల పంపిణీ పూర్తయ్యింది. ఒకరి పరీక్షను మరొకరు రాయకుండా తొలిసారి వేలిముద్ర విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఏపీసెట్ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ బి.రాజేశ్వర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అభ్యర్థులంతా పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని ఆయన సూచించారు.