డబ్బులిస్తే.....దేనికైనా రెడీనా?
మాస్కో: ఫిల్మ్‌మేకర్ గ్రిగొరి మామురిన్ టీనేజీ బాలుడు. తనకుతాను రష్యా స్పీల్బర్గ్ అని చెప్పుకుంటాడు. అసభ్యకరమైన, జుగుప్సాకరమైన వీడియోలు తీయడంలో అతనికి అతనేసాటి. ఇప్పుడతన్ని రష్యాలో చెడిపోయిన వ్యక్తని, స్పాయిల్డ్ కిడ్ అని పిలుస్తున్నారు. కానీ ఆయన తీసిన వీడియోలను మాత్రం సోషల్ మీడియాలో తెగ ఎగబడి చూస్తున్నారు. అయితే డబ్బు మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుందని, డబ్బుకోసం నేటితరం ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడుతుందని చెప్పడమే తన ఉద్దేశం అని గ్రిగొరి చెబుతున్నాడు. తాను చేస్తున్నది ఓ సామాజిక ప్రయోగమని, కమ్యూనిజం పతనం తర్వాత రష్యాలో కొనసాగుతున్న విలువలేమిటో తెలుసుకోవడమే తన ప్రయోగ లక్ష్యమని అంటున్నాడు.
గ్రిగొరి తన సోకాల్డ్ సామాజిక ప్రయోగానికి ఎక్కువగా టీనేజర్లనే ఎంపిక చేసుకుంటున్నాడు. అందులోనూ ఆడవాళ్లే ఎక్కువ. అతను తీసిన వీడియోలు ఎలా ఉన్నాయంటే....నడి బజార్లో ఓ అమ్మాయిని కలుసుకొని అందరి ముందు ఇలాగే లోదుస్తులు విప్పి తనకిస్తే కొంత డబ్బు ఇస్తానని ఆశ చూపిస్తాడు. అలా అడిగినందుకు ఆడవాళ్లంతా ముందు గ్రిగొరిని తిట్టినవాళ్లే. తర్వాత అతను డబ్బు ఆఫర్ పెంచుతూ పోవడంతో వాళ్లంతా శుభ్రంగా లోదుస్తులు విప్పేసి డబ్బు తీసుకొని పోతారు. ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల నుంచి 15వేల రూపాయల వరకు చెల్లించి వందల సంఖ్యలో అమ్మాయిలను ఇలా వీడియో తీశారు.
నడిరోడ్డు మీద గుండు కొట్టించుకుంటే ఇంత డబ్బు ఇస్తానంటూ ఎంతో మంది అమ్మాయిలకు గుండుకొట్టి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రేమించుకుంటున్న యువతీ యువకులను, కొత్తగా పెళ్లయిన దంపతులకు కూడా డబ్బాశ చూపించి అమ్మాయిలను లోబర్చుకుంటాడు. ఓ వీడియోలో గుర్తుతెలియని వ్యక్తిని పిలిచి తన మూత్రం తాగితే డబ్బిస్తానని ఆశ పెడతాడు. అలాగే తాగిస్తాడు. మరో వీడియోలో ఓ చిన్న కుక్కపిల్లను తీసుకొచ్చి ‘ఇది నన్ను మోసం చేసి వెళ్లిపోయిన ప్రేయసి పెంచుకుంటున్న కుక్క పిల్ల. దీన్ని చంపి దాన్ని బాధ పెట్టడం నా ఉద్దేశం. నేను చంపలేకపోతున్నా. ఇదిగో తుపాకీ నీవు చంపెతే డబ్బులిస్తా!’ అంటూ ఓ బాటసారికి ఆఫర్ ఇస్తాడు. ఆ బాటసారి అందుకు ఉపక్రమిస్తాడు.
ఇలా...అన్ని వివాదాస్పదమైన వీడియోలతో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. అతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు స్థానిక మీడియా ప్రయత్నించగా, తనను కాదు, తన తల్లిని ఇంటర్వ్యూ చేసుకోవాల్సిందిగా సలహా ఇచ్చాడు. తల్లిని కలిస్తే గ్రిగొరి మనస్తత్వం తెలుస్తుందనుకుని మీడియా ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించింది. మాస్కోలో అనేక ఫిట్నెస్ సెంటర్లు నడుపుతున్న అతని తల్లి అందుకు అంగీకరించడం లేదు. గ్రిగొరి తాత 69 ఏళ్ల నిక్లీదొవ్. సంపన్నవర్గంలో పేరమోసిన ప్రముఖ వ్యాపారవేత్త. తన లక్ష్యమేమిటో చెప్పే, కుటుంబం అనుమతి తీసుకునే తాను ఇలాంటి వీడియోలు తీస్తున్నానంటూ గ్రిగొరి అంటున్నాడు.