సర్దేశాయ్ గర్వపడి ఉంటారు!
ముంబై: కొత్త మిలీనియంలో భారత జట్టు విదేశాల్లో సాధించిన విజయాలు చూసి నాటి తరం దిగ్గజం దిలీప్ సర్దేశాయ్ ఎంతో గర్వపడి ఉంటారని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. అప్పటి రోజుల్లో వెస్టిండీస్ గడ్డపై భీకరమైన పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని అలవోకగా పరుగులు సాధించిన సర్దేశాయ్ తమలో స్ఫూర్తి నింపారని ఆయన అన్నారు. కఠిన పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా చేసిన కొన్ని పరుగులు కూడా నేటి సెంచరీలకంటే ఎక్కువేనని ఆయన చెప్పారు.
గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్ ‘దిలీప్ సర్దేశాయ్ స్మారకోపన్యాసం’ చేశారు. ఈ సందర్భంగా సర్దేశాయ్తో తనకున్న అనుబంధాన్ని వీవీఎస్ గుర్తు చేసుకున్నారు. ఆయన బ్యాటింగ్‌ను ప్రత్యక్షంగా చూడలేకపోయినా... ఆయనతో కలిసి మాట్లాడిన క్షణాలు అపురూపమని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించారు.
క్రికెట్ అంటే వారి దృష్టిలో ఒక ఆట మాత్రమే కాదని, దానిపై వారికి ఉన్న అభిమానం, పెనవేసుకున్న అనుబంధం గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుందని లక్ష్మణ్ చెప్పారు. తన అభిరుచిని గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రుల వల్లే క్రికెట్లో ఈ స్థాయికి చేరానని తన కెరీర్‌ను గుర్తు చేసుకున్న వీవీఎస్... కోహ్లి నేతృత్వంలోని ప్రస్తుత భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు.