అరుదైన పదాలు.. భిన్నమైన అర్థాలు
నిడమర్రు: భూ యాజమాన్య వివరాలు, క్రయ విక్రయాల సమాచారం ఏ రికార్డుల్లో ఉంటాయో పల్లె రైతుల్లో చాలా మందికి తెలియదు. పూర్వం నుంచి భూమిని ఏవిధంగా వర్గీకరించారు, రెవెన్యూ మూలాలు, విధి విధానాలు, చట్టాలు, నిబంధనలు తెలుసుకోవాలంటే రెవెన్యూశాఖలో వాడుకలో ఉన్న కొన్ని రికార్డులు వాటిలోని పదాలకు అర్థాలు తెలిసి ఉండాలి. వాటికి సంబంధించిన సమాచారాన్ని నిడమర్రు తహసీల్దార్ ఎం.సుందర్రాజు వివరించారు. ఆ సమాచారం మీకోసం..
- బ్రిటీష్ హయాంలో ‘ఆర్ఎస్ఆర్ ’
ఆర్ఎస్ఆర్ అంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్. 1926లో బ్రిటిష్ హయాంలో దీన్ని తయారు చేశారు. ఈ రికార్డే ఇప్పటికీ రెవెన్యూ అధికారులకు కీలకం. ఈ రికార్డులో ప్రభుత్వ భూమి, పట్టా భూమి, ప్రైవేటు వ్యక్తుల భూమి, ఇనాం, ఎండోమెంట్, వక్ఫ్, రుద్ర భూములు, వాగులు, వంకలు, రహదారులు, తదితర భూ వివరాలు ఉంటాయి. ఏదైనా ప్రజా అవసరం కోసం ప్రభుత్వం భూసేకరణ చెయ్యాలంటే ఈ రికార్డునే ఆధారం చేసుకుని ధర నిర్ణయిస్తుంది. ఈ రికార్డులు వీఆర్వోల వద్ద జిరాక్స్ కాపీలు, తహసీల్దారు, ఆర్డీఓ, జిల్లా స్థాయి ఏడీ కార్యాలయాల్లో ఒరిజినల్ కాపీలు ఉంటాయి.
-ఆర్ఓఆర్ అంటే..?
ఆర్ఓఆర్ అంటే రికార్డ్స్ ఆఫ్ రైట్. ఈ రిజిస్టర్ రెవెన్యూ దస్త్రాలను బ్రిటిష్ పాలన తర్వాత అధికారులు ఆధునికీకరించారు. 1973 తర్వాత గ్రామగ్రామాన సర్వేచేసి భూముల వివరాలు సేకరించారు. ప్రతి డివిజన్‌కు ప్రత్యేక కలెక్టర్, ప్రతి గ్రామానికి ఒక ఆర్ఐ, ఒక వీఆర్వో, ఒక సీనియర్ అసిస్టెంట్ స్థాయి సిబ్బందిని నియమించి భూములకు సంబంధించిన ప్రతి విషయం నమోదు చేశారు. ఈ రికార్డుల్లో హక్కుదారులు, అనుభవదారులు, యజమానుల పేర్లు నమోదై ఉంటాయి. ఈ ఆర్వోఆర్ను కూడా ప్రస్తుతం ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ఏదైనా ఓ గ్రామంలో భూమి యాజమాన్య హక్కుపై వివాదం తలెత్తితే ఈ ‘ఆర్ఓఆర్ ’నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో అన్ని రకాల భూ వివరాలు నమోదై ఉంటాయి.
సాగు వివరాలు ‘అడంగళ్’లో
అడంగళ్‌ను పహాణీ అనికూడా అంటారు. ఇది సాగు భూమి వివారాలు నమోదు చేసే ప్రధాన రెవెన్యూ రిజిస్టర్. ఇందులో ఏటా గ్రామంలోని అన్ని భూముల వివరాలు సర్వే నంబర్ల వారీగా నమోదు చేస్తారు. నమోదైన సర్వే నంబర్లో మొత్తం విస్తీర్ణం, ఎవరి పేరుమీద ఎంత విస్తీర్ణం ఉంది, హక్కుదారులు ఎవరు, పట్టాదారులు ఎవరు వంటి పూర్తి వివరాలు ఉంటాయి. ఈ అడంగళ్ రిజిస్టర్లో రైతుల పేర్లు నమోదై ఉంటే వారికి ఆ భూమిపై పూర్తి హక్కు లభించినట్టే. భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్టర్ అధికారులు ఈ అడంగళ్నే ఆధారంగా తీసుకుంటారు. ప్రస్తుతం అడంగళ్ రిజిస్టర్‌ను ఆన్లైన్లో పొందుపరిచారు.
రైతు వ్యక్తిగత దస్త్రం ‘1బీ రికార్డు’.. రైతులకు సంబంధించిన వ్యక్తిగత రికార్డును 1బీగా పిలుస్తారు. ఏరైతుకు ఎంత పొలం ఉంది, ఆరైతుల్లో ఎవరు పట్టాదారు, ఎవరు అనుభవదారులు అనే వివరాలు నమోదై ఉంటాయి. దీన్నే గతంలో 10(1)అడంగళ్ అనేవారు. ఒక రైతు గ్రామంలో ఏఏ సర్వే నంబర్లలలో ఎంత విస్తీర్ణంలో భూములు కలిగి ఉన్నాడో వివరాలు ఇందులో నమోదై ఉంటాయి. ఈ 1బీని కూడా ఆన్లైన్ చేశారు. పట్టాదారు పాసు పుస్తకం ఖాతా సంఖ్య ఆధారంగా 1బీ రికార్డులో వరుస క్రమంలో నమోదు చేస్తారు.
- ఫసలీ అంటే ..జూలై 1- జూన్ 30 మధ్య కాలాన్ని ఫసలీ అంటారు. ఈ పదం మొగలాయిల కాలం నుంచీ వాడుకలో ఉంది. ఈ ఫసలిలో అడంగళ్లోని వివరాలే నమోదై ఉంటాయి. ఎవరైనా భూమిని కొనుగోలు చేస్తే సంబంధిత దస్తావేజులు తీసుకుని రెవెన్యూ అధికారులను సంప్రదించి అడంగళ్‌లో నమోదు చేయించుకోవాలి,
- మరిన్ని రెవెన్యూ పదాలు ..-బీమెమో: ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించమని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు
-ఎఫ్ఎంబీ: ఇది గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఒకటి. గ్రామంలోని అన్ని సర్వే నంబర్ల పటాలు, వాటి నిర్థిష్ట కొలతలతో ఉంటాయి.
-అడ్వర్స్పొసెషన్: ప్రతికూల స్వాధీనం, ప్రతికూల ఆదీనం... వాస్తవంగా భూమి హక్కు ఉన్న వ్యక్తి అనుమతి పొందకుండా ఆ భూమిని వాస్తవంగా, శాంతియుతంగా, నిరవధికంగా, బహిరంగంగా స్వాధీనంలో ఉంచుకుని ఆ భూమిపై నియంత్రణాధికారాన్ని కలిగి ఉండటాన్ని అడ్వర్స్పొసిషన్ అంటారు. ఈ విధంగా పట్టా భూమిని 12 సంవత్సరాలు, ప్రభుత్వ భూమి 30 సంవత్సరాలు స్వాధీనంలో ఉన్నట్లైతే సివిల్ కోర్టుద్వారా యాజమాన్య హక్కు పొందవచ్చు.
-అసామిషిక్మి: భూయజమానికి పన్ను చెల్లించే నిబంధనలపై భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వ్యక్తిని అసామిషిక్మి అంటారు.
-చౌపస్లా: పట్టాదారుకు ఉన్న భూ వివరాలను తెలిపే రిజిస్టర్. ఇందులో భూవర్గీకరణ, విస్తీర్ణం, పట్టాదారుని పేరు తదితర వివరాలు ఉంటాయి,
-దస్తావేజు: భూమికి సంబంధించిన కొనుగోలు అమ్మకాలు, ఇతర లావాదేవీలను తెలిపై పత్రం. క్రయ విక్రమాలు జరిగినపుడు ఈ దస్తావేజును చట్టపరంగా తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
-ఇజారా: ప్రభుత్వానికి చెందిన బంజరు భూములను వ్యవసాయానికి గానీ నివాసానికి గానీ నిర్థి«ష్టమైన పన్ను చెల్లించే పద్ధతిపై లీజుకివ్వడాన్ని ‘ఇజారా ’అంటారు.
-జమాబందీ: ప్రభుత్వానికి రావాల్సిన భూమి పన్ను, నీటి పన్ను, ఇతర బకాయిలు సక్రమంగా లెక్కకట్టడం, ఇవన్నీ రెవెన్యూ లెక్కల్లోకి తీసుకువచ్చిందీ లేనిదీ నిర్ధారించడానికి గ్రామ, మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీనే ‘జమాబందీ ’ అంటారు. ఆ ప్రక్రియ ద్వారా గ్రామంలో ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం డిమాండ్ నిర్ధారిస్తారు. దీంతో పాటు మండల స్థాయి అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, సక్రమంగా నిర్వహిస్తున్నదీ లేనిదీ పరిశీలీస్తారు. రైతులు తమ సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లేందుకు జమాబంది అవసరం. జమా బందీని ఏడాదికి ఒకసారి జిల్లా రెవిన్యూ అధికారి, డెప్యూటీ కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ నిర్వహిస్తారు.