breaking news
the demand for
-
బ్లూ మార్చ్ విజయవంతం
సంగడిగుంట(గుంటూరు) జిల్లాలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు 25 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ దళిత మహాసభ వ్యవస్థాపకుడు డాక్టర్ కత్తి పద్మారావు ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిర్వహించిన బ్లూమార్చ్ సంపూర్ణంగా విజయవంతమైంది. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి బయలుదేరిన మార్చ్ కల్టెరేట్ రోడ్డులోని గుర్రం జాషువా విగ్రహానికి నివాళులర్పించి వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి చేరుకుంది. నీలం రంగు దుస్తులు ధరించిన వేలాది మంది కార్యకర్తలు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి కేటారుుంచాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మండే నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మహాసభలో కత్తి పద్మారావు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. అంబేద్కర్ విరచిత రాజ్యాంగంలో ఓటు హక్కు, విద్యా హక్కు కల్పించకపోతే ఎవరికీ చదువుకునే అవకాశం ఉండేది కాదన్నారు. చంద్రబాబు ఎంఏ చేయగలిగింది ఆ రాజ్యాంగం వల్లేనన్నారు. దేవాదాయ శాఖ వద్ద 3. 65 లక్షల ఎకరాల భూమి ఉండగా కేవలం 25 ఎకరాలను అంబేద్కర్ విగ్రహానికి కేటాయించటం లేదని దుయ్యబట్టారు. 30 రోజుల్లో భూమిని సాధించుకునేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. శాస్త్రీయజ్ఞానం, చైతన్యం, వెలుగు, తాత్వికత, లౌకికత్వం, ఐక్యత, నీతి, ఆదర్శం, రాజ్యాధికారాలకు గుర్తుగా అంబేద్కర్ విగ్రహం నిలుస్తుందన్నారు. సమాజ సంక్షేమం కోరిన వ్యక్తి విగ్రహ స్థలం ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. రాష్ట్ర రాజధానిని అమరావతి-గుంటూరు మధ్య నిర్మించాలని కోరింది దళిత మహాసభ మాత్రమేనన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన.. ఆయన వల్ల రాజకీయ, ఆర్థిక, సామాజిక లబ్ధి పొందిన ప్రజా ప్రతినిధులకు రాలేదన్నారు. 25 ఎకరాల్లో కేవలం విగ్రహం మాత్రమే కాకుండా పార్క్, మ్యూజియం, పరిశోధన కేంద్రం, దళిత మృతవీరుల చరిత్రశాల, అంబేద్కరైట్ల వృద్ధాశ్రమం, దళిత స్వతంత్ర పోరాట యోధుల సంక్షేమ శాల ఏర్పాటు చేయతలపెట్టినట్లు వెల్లడించారు. తల లేని మొండేలకు సీట్లిస్తున్న పార్టీలు 20 శాతం ఉన్న దళిత గిరిజనులు రాజ్యాధికారానికి వస్తారేమోననే భయంతో ఉన్నాయన్నారు. ప్రసంగం మధ్యలో శ్లోకాలు, గుఱ్ఱం జాషువా పద్యాలు, దళిత ఉద్యమ గీతాలు వినిపించి అలరించారు. సభలో దళిత నేతలు ఆర్.కృష్ణానాయక్, కోటి జేమ్స్, చింతపల్లి గురుప్రసాద్, పాల్తేటి పెంటారావు తదితరులు ఉద్వేగంగా ప్రసంగించారు. నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. -
జిల్లాకు చేరిన యూరియా
1518 టన్నులు సరఫరా ప్రొద్దుటూరు: జిల్లాకు కొంతమేరకు యూరియా కొరత తీరినట్టే. యూరియా సరఫరా కావడంతో రైతుల ఇబ్బందులు తీరుతాయి. ముఖ్యంగా కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, చెన్నూరు, కడప ప్రాంతాల్లో విస్తారంగా వరి పంటను సాగు చేస్తున్నారు. దీంతో యూరియాకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మిగతా ప్రాంతాల్లో కూడా ఇతర పంటల సాగుకు యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాదాపు 20 రోజులుగా యూరియా దొరక్క ఇబ్బందులు పడ్డారు. ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లోని రైతులు యూరియా కోసం కర్నూలు జిల్లాకు సైతం వెళ్లారు. ఈ సమస్యపై ‘యూరియా లేదయా’ అనే శీర్షికతో ఈనెల 1న సాక్షిలో ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ఎట్టకేలకు ఆదివారం జిల్లాకు యూరియాను తెప్పించారు. కాకినాడ నుంచి వ్యాగన్లోడ్ నాగార్జున నీమ్కోటెడ్ యూరియా కడపకు వచ్చింది. మొత్తం 1518 టన్నుల యూరియా రాగా రైతుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయాధికారులు జిల్లాలోని 12 వ్యవసాయ డివిజన్లకు ఆదివారమే తరలించారు. ఇందులో 400 టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్‌కు సరఫరా చేశారు. కాగా యూరియా ధర విషయంలో కూడా వివాదం జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించాలని వ్యవసాయాధికారులు, తమకు గిట్టుబాటు కాదని ఇటు వ్యాపారులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో దుకాణాలకు ఆదివారం సాయంత్రానికే యూరియా చేరింది. యూరియా బస్తా ధర ఏవిధంగా అమ్ముతారనే విషయం చర్చాంశనీయంగా మారింది.