డిష్యుం.. డిష్యుం!
సాక్షి, చెన్నై: చెన్నై మహానగర పాలకమండలి సమావేశం మంగళవారం ఉద్రిక్తతకు దారి తీసింది. అన్నాడీఎంకే, డీఎంకే కౌన్సిలర్లు తన్నుకున్నారు. ప్రతిపక్ష నేతపై అధికారపక్ష సభ్యుల దాడితో ఈ వివాదం రే గింది. అన్నాడీఎంకే, డీఎంకే సభ్యులు పరస్పరం ఆందోళనకు దిగడంతో సమావేశ మందిరం పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. చెన్నై కార్పొరేషన్ పాలక మండలి సమావేశం రిప్పన్ బిల్డింగ్‌లో మధ్యాహ్నం జరిగింది. మేయర్ సైదై దురై స్వామి అధ్యక్షతన, కమిషనర్ విక్రమ్ కపూర్ నేతృత్వంలో సమావేశం ఆరంభం కాగానే, ఉద్వేగ భరిత వాతారణం నెలకొంది. తమ అధినేత్రి జయలలిత జైలుకు వెళ్లడంతో, నిరసన వ్యక్తం చేస్తూ అన్నాడీఎంకే కౌన్సిలర్లు నల్ల చొక్కాలు, నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరయ్యారు. జయలలిత చిత్ర పటాల్ని చేత బట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సభా మందిరంలో తమకు కేటాయించిన సీట్లలో ఆశీనులయ్యారు. సభ ఆరంభం కాగానే, మేయర్ దురై స్వామి ప్రసంగం అందుకున్నారు.
ప్రసంగం: జయలలితకు విధించిన జైలు శిక్షను ఖండిస్తూ, ఆమెకు ఎదురైన కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్వేగంగా ప్రసంగాన్ని అందుకున్నారు. అమ్మ జపంతో ప్రసంగం సాగుతుండగానే, డీఎంకే అధినేత ఎం కరుణానిధికి వ్యతిరేకంగా మేయర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఎంకే కార్పొరేషన్ పక్ష నేత, ప్రతిపక్ష నేత సుభాష్ చంద్ర బోస్ జోక్యం చేసుకుని తమ అధినేతపై మేయర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. దీంతో అన్నాడీఎంకే మహిళా సభ్యురాలు, వెంటనే మరి కొందరు సభ్యులు ఆయనపై దాడికి యత్నించారు. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు సుభాష్ చంద్రబోస్‌పై దాడి చేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తమ నేత మీద దాడితో డీఎంకే కౌన్సిలర్లు ప్రతిఘటించే యత్నం చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. అన్నాడీఎంకే మహిళా కౌన్సిలర్లు మరింతగా రెచ్చి పోయారు. డీఎంకే కౌన్సిలర్ల వైపుగా దూసుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో మేయర్ కట్టడి చేయడానికి యత్నించారు. పరస్పరం దాడికి దిగడంతో సభలో అరుపులు కేకలతో గందరగోళ వాతావరణం నెలకొంది. పరస్పరం తోసుకుంటూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. చివరకు తమ మీద దాడిని ఖండిస్తూ, డీఎంకే సభ్యులు సభా మందిరం నుంచి బయటకు వచ్చేశారు.
పరస్పరం ఆందోళన: వెలుపలికి వచ్చిన డీఎంకే సభ్యులు ప్రవేశ మార్గంలో బైఠాయించిన నిరసన తెలియజేశారు. ఈ సమయంలో అన్నాడీఎంకే సభ్యులు సైతం సభ నుంచి బయటకు వచ్చి పోటీగా ఆందోళనకు దిగారు. దీంతో డీఎంకే సభ్యులు అక్కడి నుంచి కాస్త దూరంగా వచ్చేశారు. ప్రవేశ మార్గం వద్ద బైఠాయించిన అన్నాడీఎంకే సభ్యులు డీఎంకే అధినేత కరుణానిధి, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామిలకు వ్యతిరేకంగా నినాదాల్ని హోరెత్తించారు. చివరకు మేయర్ రంగంలోకి దిగి తమ పార్టీ సభ్యుల్ని బుజ్జగించి లోనికి ఆహ్వానించారు. డీఎంకే సభ్యులు సభ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లడంతో సభా మందిరంలోకి అన్నాడీఎంకే సభ్యులు వెళ్లారు. అనంతరం సభలో జయలలితకు విధించిన శిక్షణ వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశారు. ఆమెకు ఎదురైన కష్టాన్ని తలచుకుని ఉద్వేగానికి లోనయ్యారు.