breaking news
Chandanagar police
-
లైంగిక దాడి.. ఆపై హత్య
చందానగర్ : నల్లగండ్లలో 17 రోజుల క్రితం అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన బాలుడు కృష్ణటాపా (8) కేసును చందానగర్ పోలీసులు చేదించారు. చిన్నారిపై లైంగిదాడి చేసి.. హత్య చేసినట్టు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చందానగర్ సీఐ వాసు కథనం ప్రకారం.. నేపాల్ దేశానికి చెందిన శ్యామ్‌లాల్ టాపా, సంగీత టాపా నల్లగండ్ల సాయిశ్రీ అపార్టుమెంట్ సమీపంలో గుడిసె వేసుకుని కొడుకు కృష్ణ టాపాతో కలిసి ఉంటున్నారు. సాయిశ్రీ డెవలపర్స్‌లో లేబర్‌గా పనిచేసే బీహార్‌కు చెందిన రామన్పటేల్(36) చిన్నారి కృష్ణటాపాను అప్పుడప్పుడు ఆడిస్తూ ఉండేవాడు. ఫిబ్రవరి 4న బాలుడి తండ్రి శ్యామ్‌లాల్ టాపా పనిపై పుట్టపర్తి వెళ్లాడు. 12న తల్లి సంగీత కూలి పనికి వెళ్లగా కృష్ణ టాపా గుడిసె ముందు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో చాక్లెట్ ఇప్పిస్తానని రామన్పటేల్.. బాలుడిని నల్లగండ్ల హుడాలోని ఓపెన్ పార్కు వద్ద ఉన్న చెట్లపొదల్లోకి తీసుకెళ్లాడు. చెట్ల పొదల్లో రామన్పటేల్ కృష్ణ టాపాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు అరవడంతో భయపడ్డ నిందితుడు డ్రాయిర్తో గొంతు నులిమి చంపేశాడు. మిస్టరీ వీడిందిలా... పుట్టపర్తికి వెళ్లిన మృతుడి తండ్రి శ్యామ్‌లాల్ టాపా 14న తిరిగి వచ్చాడు. అప్పటికే కొడుకు కనిపించడం లేదని భార్య చెప్పడంతో నాలుగు రోజుల పాటు గాలించారు. ఆచూకీ దొరకకపోవడంతో 18న చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 22న కుళ్లిపోయిన స్థితిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజు నుంచి వారి పక్క గుడిసెల్లో ఉంటున్న రామన్పటేల్ కనిపించడంలేదు. అనుమానం వచ్చిన పోలీసులు కేసును ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాగిన మైకంలో లైంగికదాడి చేసి, హత్య చేశానని రామన్పటేల్ తెలిపాడు. కాగా, కేసు మిస్టరీని ఛేదించిన ఎస్ఐలు సైదులు, లక్ష్మీనారాయణ, హెడ్‌కానిస్టేబుల్ విఠల్రెడ్డిలను సీఐ అభినందించారు. -
రూ. 2 కోట్ల విలువైన డ్రగ్ స్వాధీనం
చందానగర్, న్యూస్‌లైన్: రెండు కోట్ల విలువ చేసే ఎఫిడ్రిన్ మత్తు పదార్థంతోపాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ ఎస్వోటీ, చందానగర్ పోలీసులు సంయుక్తంగా కేసును ఛేదించారు. చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ ఎస్వోటీ ఓఎస్డీ గోవర్ధన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం చోటపల్లికి చెందిన బుబ్బా శ్రీనివాస్‌రెడ్డి చందానగర్ హుడా కాలనీలో ఉంటుండగా.. ఇతని సోదరుడు బుబ్బా వెంకట్‌రెడ్డి లింగంపల్లి నారాయణరెడ్డి కాలనీ శ్రీరాములు రెసిడెన్సీలో ఉంటున్నాడు. బొబ్బా శ్రీనివాస్‌రెడ్డి హుజూరానగర్లో బీఎస్సీ వరకు చదువుకున్నారు. 2000 సంవత్సరంలో నగరానికి వచ్చి జిన్నారం మండలం ఖాజీపల్లిలోని హెరెన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్లో కెమిస్ట్‌గా రెండేళ్లు పనిచేశాడు. అనంతరం నాచారంలోని హెర్మాస్ కెమికల్స్‌లో చేరాడు. ఆపై ఆర్టీసీ బస్సులో కాంట్రాక్టు పద్ధతిలో కండక్టర్‌గా, ఎల్బీనగర్లోని సాయి అడ్వాంటియమ్ ఫార్మా లిమిటెడ్‌లో ప్లాంట్ ఇన్చార్జిగా, బీదర్‌లోని బీఎస్ఎన్ ఫార్మా లిమిటెడ్‌లో కొన్నాళ్లు పనిచేశాడు. కెమికల్ ప్రాసెసింగ్‌లో అనుభవం గడించిన శ్రీనివాస్‌రెడ్డి కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌లో శ్రీకర్ల్యాబ్స్ను ఏర్పాటు చేసి బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఉపయోగపడే ఆనస్రేజోల్ అండ్ లిట్రేజోల్ డ్రగ్‌ను సొంతంగా తయారు చేశాడు. దానిని రెండేళ్లు మార్కెటింగ్ చేశాడు. తీవ్ర నష్టాలు చవిచూసిన శ్రీనివాస్‌రెడ్డికి సులభ పద్దతిలో డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. అరబిందో ఫార్మా లిమిటెడ్‌లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న తన సోదరుడు వెంకట్‌రెడ్డితో కలిసి జీడిమెట్లలోని ఆర్ఎస్ మాలిక్యూర్స్ను అద్దెకు తీసుకున్నారు. ఇద్దరికి ఫార్మాలో మంచి అనుభవం ఉండటంతో ముంబైకి చెందిన జావిద్ నుంచి ప్రొపైఫినన్, బ్రోమైన్, సోడియం బోరో హైడ్రైడ్‌ను దిగుమతి చేసుకొని ఆర్ఎస్ మాలిక్యూర్స్లో ప్రాసెసింగ్ ద్వారా ఎఫిడ్రిన్‌గా తయారు చేస్తున్నారు. ఆరు నెలల క్రితం వీరు ఆర్ఎస్ మాలిక్యూర్స్ను అద్దెకు తీసుకొని 50 కిలోల మత్తు పదార్థాన్ని తయారు చేసి.. నెల్లూరు జిల్లా అనంత సాగరం మండలం రవికుంటపాడుకు చెందిన తిరుమల విజయ్‌కుమార్‌రెడ్డి (ఈయన సరూర్‌నగర్ మండలం మీర్‌పేట తిరుమలహిల్స్‌లో ఉంటున్నారు)కి అమ్మకానికి ప్రతిపాదించారు. గతంలో ఎర్రచందనం వ్యాపారంలో దెబ్బతిన్న విజయ్‌కుమార్‌రెడ్డి డ్రగ్ విక్రయించేందుకు తన సొంత గ్రామానికి చెంది చెన్నైలో స్థిరపడిన నవాజ్‌ఖాన్ అలియాస్ భాయ్‌ను సంప్రదించాడు. రెండు నెలల క్రితం 50కిలోల డ్రగ్‌ను నవాజ్ఖాన్ను ఇవ్వగా కిలోకు రూ.1.5లక్షల చొప్పున రూ.75లక్షలు ఇచ్చాడు. భాయ్ వీరి నుంచి డ్రగ్స్‌ను కొని మలేసియా, సింగపూర్, ఇతర దేశాలకు కిలో రూ.5 లక్షల చొప్పున విక్రయిస్తుంటాడు. వ్యాపారం లాభసాటిగా ఉండటంతో మరో 56 కిలోల డ్రగ్స్‌ను తయారు చేసి విక్రయించేందుకు గంగారం ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలో వేగనార్ (ఏపీ 28డిబి 791)కారులో శనివారం ఉదయం 10గంటల సమయంలో వేచివున్నారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, చందానగర్ పోలీసులు దాడిచేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 2 కోట్ల విలువ చేసే 56 కిలోల డ్రగ్స్, రూ.7లక్షల నగదు, మూడు సెల్ఫోన్లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకున్న ఇన్స్పెక్టర్లు కె. చంద్రశేఖర్, బి. పుష్పన్‌కుమార్, బస్వారెడ్డి, అంజయ్య, సబ్ ఇన్స్పెక్టర్లు జి. నాగరాజు, మహేశ్‌గౌడ్, శివ, రమేష్‌లతో పాటు చందానగర్ సీఐ వాసులను ఆయన అభినందించారు. న్యూ ఇయర్ వేడుకల కోసమేనా... కొత్త సంవత్సరం వేడుకల్లో విక్రయించడానికే ముఠా పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను తయారు చేసినట్లు అనుమానిస్తున్నారు. నగరంలోని పబ్స్, ప్రైవేట్ పార్టీలకు, రిసార్ట్స్‌లో 100, 50 గ్రామల ప్యాకెట్లను విక్రయించేందుకు ముఠా సభ్యులు వ్యూహం పన్నినట్లు సమాచారం. కాగా, ఈ డ్రగ్ మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పోలీసులు చెప్పారు.