breaking news
adulterated palm wine
-
కల్తీ కల్లు తాగి 13 మందికి అస్వస్థత
హిందూపురం: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పరిధిలోని చౌళూరులో బుధవారం కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితుల కథనం మేరకు.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక చౌళూరులో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామ పరిసర ప్రాంతాల వారే కాకుండా సరిహద్దులోని కర్ణాటక ప్రాంతం నుంచి కూడా ఇక్కడికొచ్చి కల్లు తాగుతున్నారు. బుధవారం కల్తీ కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. గంగాధరప్ప, సిద్ధలింగప్ప, లక్ష్మమ్మ, నరసప్ప, నరసింహులు, కొల్లమ్మ, కల్లూది గంగమ్మ, రత్నమ్మ, కదిరప్ప, ముద్దమ్మ, సుబ్బరాయుడు, అశ్వర్థప్ప, గంగమ్మ తదితరులు కల్లు తాగిన తర్వాత ప్రవర్తనలో మార్పు వచి్చంది. వారిలో వారే మాట్లాడుకోవడం, అనవసరంగా కోపగించుకోవడం వంటివి చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఆస్పత్రులకు తరలించారు. వీరిలో.. కొల్లమ్మ, లక్ష్మమ్మ, సిద్ధలింగమ్మ, నరసప్ప, రత్నమ్మ, గంగమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో ముగ్గురు హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనపై ఎక్సైజ్, హిందూపురం రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. డైజోఫాం వంటి రసాయనాలను కలిపి కల్తీ కల్లు తయారు చేస్తున్నారని పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సైకోటిక్ బిహేవియర్‌తో వచ్చారు ఈ ఘటనపై హిందూపురం జిల్లా ఆస్పత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ జీవన మాట్లాడుతూ.. కల్లు తాగిన వారు సైకోటిక్ బిహేవియర్‌తో వచ్చారని చెప్పారు. ఎవరో వచ్చారు.. తమను ఏదో చేస్తున్నారు.. ఇబ్బందులు పెడుతున్నారంటూ ఏదేదో మాట్లాడుతున్నారని వివరించారు. దుస్తులు కూడా విప్పేసుకుంటున్నట్టు చెప్పారు. వీరికి చికిత్స అందిస్తున్నామన్నారు. -
కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత
గోపాల్పేట (మహబూబ్‌నగర్) : కల్తీ కల్లు తాగి 30మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్పేట మండలం బండరావిపాకుల గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బండరావిపాకుల గ్రామంలో రెండు కల్లు దుకాణాల మధ్య పోటీ ఉంది. కాగా గురువారం సాయంత్రం గ్రామంలోని రెండు కల్లు దుకాణాల్లో డైజోఫాం, సీహెచ్ ఎక్కువ మొత్తంలో కలిపి కల్లు తయారు చేశారు. దానిని తాగిన కొద్దిసేపటికే 30 మంది నిద్రలోకి జారుకున్నారు. అప్పటి నుంచి శుక్రవారం ఉదయం వరకు వారు నిద్రలోనే ఉన్నారు. దీంతో విషయం తెలుసుకున్న సర్పంచ్ 108కి సమాచారం అందించారు. వారు బాధితులను నాగర్‌కర్నూలు ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో బాల్‌రెడ్డి, వెంకటమ్మ, లాలమ్మ, బాలమ్మల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారికి నాగర్‌కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎక్సైజ్ ఎస్ఐ షాకీర్ అహ్మద్ కల్లు శాంపిళ్లను పరీక్ష కోసం హైదరాబాద్‌కు పంపారు. -
కల్తీ కల్లుకు యువకుడు బలి
మహబూబ్‌నగర్ : కల్తీ కల్లు తాగి యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం అమరచింతలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... అమరచింత గ్రామానికి చెందిన మహమూద్(38) అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కల్లుకు బానిసయ్యాడు. గురువారం ఉదయం కల్లు సేవించిన మహమూద్ ఇంటికి చేరుకుని స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.


