గ్యాస్ ధర.. మూడేళ్లలో 10 డాలర్లకు! | Long term price outlook looks positive for Natural Gas | Sakshi
Sakshi News home page

గ్యాస్ ధర.. మూడేళ్లలో 10 డాలర్లకు!

Dec 24 2013 1:32 AM | Updated on Sep 2 2017 1:53 AM

గ్యాస్ ధర.. మూడేళ్లలో 10 డాలర్లకు!

గ్యాస్ ధర.. మూడేళ్లలో 10 డాలర్లకు!

ప్రస్తుతం యూనిట్‌కు (ఎంబీటీయూ) 4.2 డాలర్లుగా ఉన్న సహజవాయువు (గ్యాస్) రేటు రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం వచ్చే మూడేళ్లలో దాదాపు 10 డాలర్లకు పెరగనుంది.

న్యూఢిల్లీ: ప్రస్తుతం యూనిట్‌కు (ఎంబీటీయూ) 4.2 డాలర్లుగా ఉన్న సహజవాయువు (గ్యాస్) రేటు రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం వచ్చే మూడేళ్లలో దాదాపు 10 డాలర్లకు పెరగనుంది. ఫలితంగా ఎరువుల రంగానికి ఇచ్చే సబ్సిడీ కన్నా ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయం లభించనుంది. పలు కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఈ మేరకు వివిధ అంచనాలు ప్రకటించాయి. బార్‌క్లేస్ ఈక్విటీ రీసెర్చ్ అంచనాల ప్రకారం 2014-15లో గ్యాస్ రేటు 8.3 డాలర్లుగాను, అటు పై ఏడాది 9.1 డాలర్లుగా, 2016-17లో 9.4 డాలర్లుగాను ఉండనుంది. మరోవైపు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో గ్యాస్ ధర 10 డాలర్ల కన్నా ఎక్కువగా ఉంటుందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ రేటు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి 8.4 డాలర్లకు పెరగనున్న సంగతి తెలిసిందే.
 
 ఈ రేటును ద్రవీకృత గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ధరలకు అనుసంధానించడం వల్ల అంతర్జాతీయంగా గ్యాస్ రేటు 10 డాలర్ల మేర మారితే దేశీయంగా 0.1-0.5 డాలర్ల మేర మారగలదని బార్‌క్లేస్ ఒక రీసెర్చ్ నోట్‌లో పేర్కొంది. అధిక ధరల వల్ల గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు 2014-15 నుంచి 4 బిలియన్ డాలర్ల మేర ఆదాయాలు రాగలవని.. ప్రభుత్వానికి రాయల్టీ, లాభాల్లో వాటా, పన్నులు, డివిడెండ్ల రూపంలో అదనంగా  505 మిలియన్ డాలర్లు లభించగలవని అంచనా వేసింది. ఇక, నిర్దిష్ట స్థాయిలో గ్యాస్ అమ్మకాలు ఉంటే 2014-15లో ఓఎన్‌జీసీకి రూ. 16,400 కోట్ల ఆదాయం, రూ. 9,700 కోట్ల లాభాలు అదనంగా లభించగలవనేది ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా. ఆయిల్‌కు రూ. 2,000 కోట్లు, రిలయన్స్‌కి రూ. 3,400 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొంది.
 
 గ్యాస్, విద్యుత్ రేట్లు పెరుగుతాయ్..
 దేశీయంగా రోజుకు 86 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) మేర ఉత్పత్తయ్యే గ్యాస్‌లో దాదాపు 67 ఎంసీఎండీని విద్యుత్, ఎరువులు, ఎల్‌పీజీ రంగ కంపెనీలే వినియోగిస్తున్నాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. కొత్త రేటు వల్ల వీటిపై అదనంగా రూ. 19,700 కోట్ల భారం పడుతుందని వివరించింది. ఈ భారాన్ని గాని వినియోగదారులకు బదలాయించిన పక్షంలో గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్ రేట్లు 45 శాతం పెరుగుతాయని, యూరియా రేట్లు 60% మేర పెరగగలవని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement