జిల్లాలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల నిర్వాహ కులకు జెఎన్‌టీయూహెచ్ పెద్ద ఝలక్ ఇచ్చింది.
జిల్లాలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల నిర్వాహ కులకు జెఎన్‌టీయూహెచ్ పెద్ద ఝలక్ ఇచ్చింది. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కళాశాలలకు ఒకటి, రెండు సెక్షన్లకు మాత్రమే అనుమతులు ఇచ్చిన వర్సిటీ కొన్ని కళాశాలలకు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా సీట్లను కేటాయించింది.
కోదాడటౌన్ : జెఎన్ టీయూవర్సిటీ 2015-16 విద్యాసంవత్సరానికి అనుమతి ఇచ్చిన కోర్సులు, కేటాయించిన సీట్ల వివరాలను గురువారం వెబ్‌సైట్‌లో పెట్టింది. ప్రతిష్టాత్మకమైన ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న సూర్యాపేటలోని ఎస్‌వీ ఇంజనీరింగ్ కళాశాలకు ఒక్క ట్రిపుల్‌ఈ సెక్షన్‌కు మాత్రమే అనుమతించి దానిలో కేవలం 60 సీట్లను మాత్రమే కేటాయించింది. జిల్లాలో అత్యధికంగా కోదాడలోని నాలుగు కళాశాలలకు సీట్లను కేటాయిం చిన వర్సిటీ ఇక్కడే ఉన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలకు మాత్రం కేవలం రెండు సెక్షన్లలో 240 సీట్లకు మాత్రమే అనుమతులు ఇచ్చిం ది. గత సంవత్సరం ఈ కళాశాలలో 720 సీట్లకు అనుమ తి ఉండేది. ప్రస్తుతం జిల్లాలోని కోదాడ గేట్ కళాశాల కు, దేశముఖిలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలకు అత్యధికంగా 720 చొప్పున సీట్లను కేటాయించారు.
కోదాడ కళాశాలలకు సీట్ల పంట...
కోదాడ నియోజకవర్గంలో ఉన్న ఆరు ఇంజనీరింగ్ కళాశాలలకు వర్సిటీ ఎక్కడా లేని విధంగా ఇంజనీరింగ్ సీట్లను కేటాయించింది. నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు మండలం రామాపురంలో ఉన్న గేట్ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీ సాయి ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ రెండు ఒకే ఆవరణలో నడుస్తున్నాయి. ఒకే యాజమాన్యం కింద ఉన్న ఈ కళాశాలలకు ఏకంగా 1080 సీట్లకు అనుమతులు ఇచ్చింది. గత సంవత్సరం సౌకరా్యాలు లేవని ఈ కళాశాలల్లో మొదటి సంవత్సరం తరగతులకు అనుమతి ఇవ్వని వర్సిటీ ఈ విద్యాసంవత్సరం మాత్రం గేట్ కళాశాలకు 720 సీట్లకు, శ్రీ సాయి ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌కు 360 సీట్లకు అనుమతి ఇచ్చింది. ఇక నకిలీ అధ్యాపకులను చూపినట్లు గత సంవత్సరం కేసు నమోదై అనుమతులు నిరాకరించబడిన కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు ఈసంవత్సరం 420 సీట్లు, అదే విధంగా కోదాడలోని సనా ఇంజనీరింగ్ కళాశాలకు 480 సీట్లు, మిట్స్‌కళాశాలకు 270 సీట్లు, అనురాగ్ కళాశాలకు 240 కేటాయించింది. ఈ విధంగా ఒక్క కోదాడలోని కళాశాలలకే 2490 సీట్లను కేటాయించింది.
తలకిందులైన పరిస్థితి...
అన్ని సౌకర్యాలు ఉన్నాయని గత సంవత్సరం అనుమతులు పొందిన 7 కళాశాలల్లో కోదాడలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల, సూర్యాపేటలోని ఎస్‌వీ ఇంజనీరింగ్ కళాశాలలు అగ్రస్థానంలో ఉన్నాయి. కానీ విచిత్రంగా ఈ విద్యాసంవత్సరం ఈ రెండు కళాశాల పరిస్థితి తలకిం దులైంది. గత సంవత్సరం 420 బీటెక్, 80 ఎంటెక్ సీట్లకు అనుమతులున్న ఎస్‌వీ ఇంజనీరింగ్ కళాశాలకు మాత్రం ఈ విద్యాసంవత్సరం కేవలం 60 బీటెక్ సీట్లకు అనుమతు లు ఇచ్చి ఎంటెక్ సీట్లకు పూర్తిగా మంగళం పాడా రు. జిల్లాలో అత్యధిక మౌ లిక వసతులను కలిగిఉన్న కళాశాలల్లో ఇది అగ్రస్థానంలో ఉండడమే గాక స్టాఫ్‌కు బ్యాంక్ ద్వారా జీతాలు చెల్లిస్తున్న ఏకైక కళాశాల ఇది మాత్రమే. ఇక కోదాడలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలకు గత సంవత్సరం 720 సీట ్లకు అనుమతులు ఇచ్చిన వర్సిటీ ఈ సంవత్సరం కేవలం 240 సీట్లకు మా త్రమే అనుమతి ఇచ్చింది. ఈ కళాశాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరెడ్డికి చెందింది కావడం గమనార్హం. జిల్లాలోని మిర్యాలగూడలో ఉన్న మీనా మహిళా ఉమెన్స్ కళాశాలకు మాత్రం ఆ సంవత్సరం ఒక్క సీటుకు కూడా అనుమతులు ఇవ్వలేదు. ఇక్కడ ఉన్ననాగార్జున ఇంజనీరింగ్ కళాశాల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవు. జిల్లా కేంద్రంలోని మోనా కళాశాలకు కూడా ఒక్క సీటు కూడా కేటాయించలేదు.
భగ్గుమంటున్న కళాశాలల నిర్వాహకులు
ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల కేటాయింపులపై పలు కళాశాలల నిర్వాహకులు భగ్గుమంటున్నారు. జిల్లాలో పేరున్న కళాశాలలను పూర్తిగా విస్మరించిన వర్సిటీ అధికారులు లాబియింగ్‌కు లొంగిపోయారని వారు దుయ్యబడుతున్నారు. కనీసం ప్రిన్సిపాల్ కూడా లేకుండా నడుస్తున్న కళాశాలలకు వందల సంఖ్యలో సీట్లను కేటాయించడంపట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కళాశాలలకు కేటాయించిన సీట్లపై పూర్తి విచారణ చేపట్టాలని, దీనిపై సమాచార హక్కు ద్వారా పూర్తి వివరాలను సేకరించి వర్సిటీ బండారాన్ని బయటపెడతామని ఒక ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ చెప్పారు. వందల సంఖ్యలో సీట్లను కేటాయించిన కళాశాలకు ఇపుడు వెళ్దాం ... వారు చూపిన సిబ్బందిలో సగంమంది అక్కడ ఉన్నా మా కాలేజీని మూసి వేస్తామని మరో కరస్పాండెంట్ ఆవేదన వెల్లగక్కారు.