ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు 

Election Commission Gives No Children Limit To Candidates In Elections - Sakshi

మార్గదర్శకాలు జారీచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం 

అభ్యర్థులు చెల్లించాల్సిన డిపాజిట్లు, ప్రచార వ్యయం ఖరారు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు తెర లేచిన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరెవరు అర్హులో వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హ త ఉండేది. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం ఈ నిబంధనను సడలించారు. దీంతో ఎంతమంది సంతానం ఉన్నా ఈ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, సాగునీటి వినియోగదారుల సంఘం సభ్యులు, అంగన్‌వాడీ వర్కర్లు, దేవాలయాలు, మత సంస్థల చైర్మన్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. టీఎస్‌ ఆర్టీసీ, సింగరేణి కాలరీస్‌ ఉద్యోగుల్లో మేనేజింగ్‌ ఏజెంట్లు, మేనేజర్, సెక్రటరీలు మినహా మిగిలినవారు పోటీ చేయొచ్చు. క్రిమినల్‌ కోర్టు దోషిగా నిర్ధారించిన వ్యక్తి.. శిక్ష ఖరారైన రోజు నుంచి ఐదేళ్ల వరకు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనర్హుడు. ఒక కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత సదరు వ్యక్తి పై కోర్టులో అప్పీల్‌ చేసిన సందర్భంలో స్టే ఇవ్వకుండా.. బెయిల్‌పై విడుదలైనప్పటికీ, అతడు/ఆమె పోటీ చేయడానికి అవకాశం లేదు. ఆర్థికంగా దివాళా తీసి, ఆ అప్పుల నుంచి బయటకు రాలేని పరిస్థితులున్నట్లు న్యాయస్థానం నిర్ధారించిన వారు కూడా పోటీకి అనర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాంట్రాక్ట్‌లు చేస్తున్నవారు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు.  

డిపాజిట్లు ఇవే..
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు చెల్లించాల్సిన ధరావత్తును ఎస్‌ఈసీ ఖరారు చేసింది. గ్రేటర్, కార్పొరేషన్‌తోపాటు మున్సిపల్‌ వార్డు స్థానానికి పోటీచేసే జనరల్‌ అభ్యర్థులు రూ.2,500 ఎస్‌ఈసీ పేరిట డీడీ తీసుకోవాలి. వార్డు స్థానాలకు పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250 చెల్లించాలి. ఒకే అభ్యర్థి రెండు, మూడు వార్డులకు నామినేషన్‌ వేసినా ఒక్కటే డిపాజిట్‌ సరిపోతుంది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్, గ్రేటర్‌ వరంగల్, గ్రేటర్‌ ఖమ్మంలలోని డివిజన్లలో అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని రూ.5 లక్షలకు పరిమితం చేశారు. మిగతా కార్పొరేషన్లలో రూ.1.50 లక్షలు, మున్సిపాలిటీల్లో రూ.లక్ష వరకు ప్రచారం కోసం ఖర్చు చేసుకోవచ్చు. 

ఉల్లంఘనులపై కఠిన చర్యలు..
ఎన్నికల నియమావళిలో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. అభ్యర్థులను బెదిరించినా, ఎత్తుకెళ్లినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ దొరికినా ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. అలాంటివారిని పదవి నుంచి తొలగించడంతోపాటు ఆరేళ్లపాటు ఎలాంటి పదవుల్లో పోటీ చేయకుండా అనర్హత వేటువేస్తారు. ఎన్నికల కోడ్‌ ఉన్నన్ని రోజులూ బహిరంగ సభలు, ఊరేగింపులు నిషేధం. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాలను ఎన్నికల సందర్భంగా వినియోగిస్తే నేరం. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top