‘నారింజ’పై నిర్లక్ష్యమేలా? | Care of the farmers questioned | Sakshi
Sakshi News home page

‘నారింజ’పై నిర్లక్ష్యమేలా?

Jun 13 2015 11:26 PM | Updated on Oct 1 2018 2:00 PM

నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ‘నారింజ’ ప్రాజెక్టు నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది.

నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ‘నారింజ’ ప్రాజెక్టు నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. ప్రాజెక్టు కింద ఉన్న భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు వీలుగా కాలువల నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.5.77 కోట్లు మంజూరయ్యాయి. ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేనప్పుడు కాలువల నిర్మాణంతో ప్రయోజనమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
 
 జహీరాబాద్ నియోజకవర్గంలోనే ప్రధాన నీటి వనరుగా నారింజ ప్రాజెక్టు ఉంది. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వృథాగా తరలిపోతున్న నీటిని జహీరాబాద్ ప్రాంత రైతులు వినియోగించుకునేందుకు వీలుగా బీదర్ రోడ్డుపై రోడ్డు-కం-బ్యారేజీని నిర్మించి భూములను సాగులోకి తీసుకురావాలని అప్పట్లో ప్రతిపాదించారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో నారింజ బ్యారేజీని నిర్మించారు. 1970 డిసెంబర్ 20న అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రెగ్యులేటర్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 1971లో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిధారెడ్డి కాలువ తూమును ప్రారంభించారు. కాగా ఈ పథకం ప్రారంభోత్సవానికే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా ప్రయోజనం చేకూరలేదు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం వల్లే గత నాలుగు దశాబ్దాలుగా నారింజ జలాలు పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని రైతులు అంటున్నారు.
 
 ఎక్కడ పుట్టింది...
 నారింజ వాగు కోహీర్ మండలం బిలాల్‌పూర్ గ్రామంలో పుట్టింది. అక్కడి నుంచి జహీరాబాద్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఈ వాగుపై వరద ప్రాంత వైశాల్యం 143.8 స్క్వార్ మైల్స్‌గా గుర్తించారు. గరిష్ట వరద ప్రవాహం 41.800 క్యూసెక్కులుగా గుర్తించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు నిర్మించారు. దీనికింద ప్రధాన కాలువలు తవ్వించినా, వాటికి అనుబంధంగా చిన్న చిన్న కాలువలు తవ్వించక పోవడంతో ప్రాజెక్టు నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ పొలాల్లో తవ్వి వదిలేసిన కాలువలను అప్పట్లోనే రైతులు పూడ్చేసి పంటలను సాగు చేసుకుంటున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 85 మిలియన్ క్యూబిక్ ఫీట్స్(ఎంసీఎఫ్‌టీ)గా ఉంది.
 
 పూడిక తీస్తేనే మేలు..
 ప్రాజెక్టులో పూడిక తీస్తేనే మేలు జరుగుతుందని పరిసర గ్రామాల రైతులంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఒక్క భారీ వర్షానికే నిండుతుందని, మిగతా నీరంతా వృథాగా కర్ణాటక వెళ్తుందని వారంటున్నారు. పూడిక తీయిస్తే మరింత అధికంగా నీరు నిల్వ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా భూమిలోకి అవసరం మేరకు నీరు ఇంకిపోయి పరిసర గ్రామాల్లోని భూగర్భ జలాలు మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు. తద్వారా వ్యవసాయ బావులు, బోర్లలో పుష్కలంగా నీరు వచ్చి ఆశించిన మేర పంటలు సాగయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. పూడికతీతకే మొదటి ప్రాధాన్యత నివ్వాలని వారంటున్నారు.
 
 అడ్డుకున్న రైతులు
 గతంలో తమకు పరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు పరిహారం చెల్లించి కాలువలు తవ్వాలని బూర్దిపాడ్ గ్రామ రైతులు అంటున్నారు. గ్రామంలో 26 మంది రైతులు కాలువల కింద పోతున్నాయి. దీంతో వారు కాలువ తవ్వకం పనులను నిలిపి వేయించారు. సాగులో ఉన్న చెరకు పంటలో నుంచి కాలువను తవ్వడంతో తాను నష్టపోయానని రైతు సంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.
 
 ప్రాజెక్టు స్వరూపం
 ప్రాజెక్టు :    నారింజ
 ఆయకట్టు :    3వేల ఎకరాలు
 కుడి కాలువ పొడవు :    2.కి.మీటర్లు
 కుడి కాలువ కింద ఎకరాలు :    550 ఎకరాలు
 కుడి కాలువ కింద గ్రామాలు :    న్యాల్‌కల్ మం:
 మిర్జాపూర్(బి), మల్కాపూర్, జహీరాబాద్ మం : కొత్తూర్(బి)
 ఎడవ కాలువ పొడవు :    13 కి.మీటర్లు
 ఎడమ కాలువ కింద ఎకరాలు :    2,450 ఎకరాలుగా
 ఎడవ కాలువ కింద గ్రామాలు :    జహీరాబాద్ మం: కొత్తూర్(బి), బూర్దిపాడ్, సత్వార్, బూచనెల్లి, చిరాగ్‌పల్లి, మాడ్గి
 
 పరిహారం ఇప్పించాలి..
 గతంలో మాకు పరిహారం అందలేదు. పరిహారమిచ్చిన తరువాతే కాలువలను తవ్వే పనులు చేపట్టాలి. పెద్ద కాలువల కోసం మేం అధికంగా భూములను కోల్పోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం సాగులో ఉన్న చెరకు తోటల్లో నుంచి కాలువలు తవ్వుతున్నందున పంటకు కూడా పరిహారం అందించాలి.
 - కమాల్‌రెడ్డి, రైతు, బూర్దిపాడ్
 
 నారింజ ప్రాజెక్టు... లక్ష్యం ఘనం... ఫలితం శూన్యం అన్నట్టుగా ఉంది. నాలుగు దశాబ్దాలైనా ఈ ప్రాజెక్టు నీటితో సెంటు భూమి తడవలేదు. ప్రస్తుతం పూడికతో నిండిపోవడంతో నీరు నిలిచే పరిస్థితి లేదు. ఒక్క వర్షానికే మిగతా నీరంతా పక్క రాష్ట్రానికి పోతుంది. పూడిక తీయాల్సిన పాలకులు కాలువలు తవ్వుతూ నిధులు, విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. రైతుల మొరను ఆకలించరు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి దుస్థితి నెలకొంది.
 -జహీరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement