ఇది విలీనదినమే!

ఇది విలీనదినమే! - Sakshi


త్రికాలమ్‌

ఈరోజు తెలంగాణ చరిత్రలో అత్యంత ముఖ్యమైనది. సరిగ్గా 69 సంవత్సరాల కిందట హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజు. విలీ నానికి ఒప్పుకోనంటూ హఠం చేసి స్వాతంత్య్రం ప్రకటించుకొని ఐక్యరాజ్య సమితి గడప ఎక్కిన నిజాం ఉస్మాన్‌ అలీ ఖాన్‌ మెడలు వంచి భారత్‌లో అంతర్భాగం కావడానికి ఒప్పించిన సందర్భం. దీనిని విమోచన దినంగా జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోరుతున్నది. కాదు, విద్రోహదినంగా పరిగణిస్తామని మజ్లీస్‌ ఇత్తహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం) ప్రకటించింది. విలీనదినంగా పాటిస్తే బాగుంటుందని సాధారణ ప్రజల అభిప్రాయం. ఇంతకీ నాడు జరిగింది విలీనమా, విద్రోహమా, విమోచనా?



చరిత్రను అన్వయించేవారికి స్వప్రయోజనాలు ప్రధానం. వారి దృష్టికోణం నుంచే పరిణామాలను అర్థం చేసుకుంటారు. వారి లక్ష్యాలకు అనుగుణంగానే అన్వయిస్తారు. భాష్యం చెబుతారు. హైదరాబాద్‌ సంస్థానం విముక్తికి ప్రధాన కారకుడిగా నాటి ఉపప్రధాని, దేశీయాంగమంత్రి సర్దార్‌ పటేల్‌ను బీజేపీ కీర్తిస్తుంది. హైదరాబాద్, జునాగఢ్‌ సంస్థానాలను ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసే బాధ్యతను ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఉపప్రధానికి అప్పగించారు. ఆ పని సర్దార్‌ సమర్థంగా చేశారు. విలీనానికి ససేమిరా అన్న మూడో సంస్థానం జమ్మూ–కశ్మీర్‌ వ్యవహారంలో నెహ్రూ జోక్యం చేసుకున్నాడు. తన పూర్వీకులు నివసించిన కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయం ఒకవైపూ, సిసలైన ప్రజాస్వామ్యవాదిగా తనకున్న అంతర్జాతీయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూసుకోవాలన్న అభిలాష మరోవైపూ లాగి నెహ్రూని ఇబ్బంది పెట్టినమాట వాస్తవం.



నెహ్రూ డోలాయమాన వైఖరి కారణంగా జమ్మూ–కశ్మీర్‌ వివాదం తెగకుండా ముడిపడకుండా దశాబ్దాలు గడిచిపోవడం, పాకిస్తాన్‌తో యుద్ధాలు చేయవలసిరావడం కూడా నిజమే. నెహ్రూ, షేక్‌ అబ్దుల్లాల పట్టింపు లేకపోతే 1947–48 లోనే కశ్మీర్‌ పాకిస్తాన్‌లో విలీనమయ్యేది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌ సంక్షోభానికి నెహ్రూను నిందించడం బీజేపీ విధానం. మొత్తం 560 సంస్థానాలను స్వతంత్ర భారతంలో విలీనం చేసింది నెహ్రూ, పటేల్‌ అనేది చరిత్ర. పీవీ నరసింహారావుకు కీర్తి దక్కడం ఇష్టంలేని సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ నాయకులు 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దార్శనికుడు నాటి ఆర్థికమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ అంటూ కీర్తించి తరిస్తున్నారు. మన్మోహన్‌సింగ్‌ను ఆర్థికమంత్రిగా నియమించిందీ, ఆర్థిక సంస్కరణలు అమలు జరపాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదీ, ప్రతిపక్షాల విమర్శలకు తాళలేక రెండు విడతల రాజీనామా చేసిన మన్మోహన్‌ను అనునయించి నచ్చజెప్పిందీ, పరిశ్రమల శాఖను తన చెంతనే పెట్టుకొని విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానాన్ని ఒకేరోజు ఏకబిగిన సహాయ మంత్రి కురియన్‌ (ప్రస్తుత రాజ్యసభ ఉపాధ్యక్షుడు) చేత ప్రకటింపజేసిందీ పీవీ అనే విషయం కాంగ్రెస్‌ నాయకులు తెలిసినా చెప్పరు.



మన్మోహన్‌ పీవీ నమ్మిన బంటుగా ఆర్థిక సంస్కరణలను మనస్ఫూర్తిగా అమలు చేసిన అమాత్యుడు అనడంలో ఎవరికీ సందేహం అక్కరలేదు. కాంగ్రె స్‌కి పీవీపైన ఉన్న ద్వేషం కంటే నెహ్రూపైన నేటి తరం బీజేపీకి గల ద్వేషం అధికం. అందుకే హైదరాబాద్‌ విముక్తికి సర్దార్‌ పటేల్‌ మాత్రమే కారణమని బీజేపీ వాదిస్తుంది. నెహ్రూ సమ్మతించి, సహకరించకపోతే పటేల్‌ లక్ష్యం నెరవేరేది కాదనేది వేరే విషయం. పైగా ఎన్ని విభేదాలు ఉన్నా అంతిమ శ్వాస వరకూ పటేల్‌ నెహ్రూతో స్నేహంగా ఉండేవారు. పరస్పరం గౌరవించుకునేవారు. గాంధీజీకి ఇద్దరూ రెండు కళ్ళుగా ఉండేవారు.



వెలుగు చూడని హైదరాబాద్‌

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన పదమూడు నెలల వరకూ హైదరాబాద్‌లో నిజాం పాలనే కొనసాగింది. అంతకాలం నిజాం ధిక్కారం ప్రదర్శించాడు. ప్రైవేటు సైన్యంగా రజాకార్లను పెంచి పోషించాడు. దేశ్‌ముఖ్‌లనూ, భూస్వాములనూ కూడగట్టుకున్నాడు. భారతదేశంలో విలీనం కాబోనంటూ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. పాకిస్తాన్‌ అధినేత మహమ్మదలీ జిన్నాతో రాయబారం నెరపాడు. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు పెట్టాడు. ఇంత చేసిన నిజాంను లొంగిపోయిన తర్వాత బుట్టదాఖలు చేయకుండా ‘రాజ్‌ప్రముఖ్‌’ పదవి ఇచ్చి ఎందుకు గౌరవించారు? నిజాం కబంధ హస్తాలనుంచి హైదరాబాద్‌ ప్రజలకు విముక్తి కల్పించామని నెహ్రూ, పటేల్‌ భావించి ఉంటే విమోచన దినోత్సవాలు నిర్వహించేవారే. కానీ వారు ఆ విధంగా భావించలేదు. అన్ని సంస్థానాల పూర్వాధిపతులనూ సగౌరవంగా సాగనంపి వారి హోదాకు భంగం లేకుండా హంగులూ, నిధులూ ఏర్పాటు చేయడం నాటి ప్రభుత్వ విధానం. అదే విధంగా నిజాంకూ మర్యాదలు జరిగాయి.



తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని దేశం వదిలి వెళ్ళనిచ్చారు. ఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా ప్రగతి యజ్ఞానికి శ్రీకారం చుట్టాలన్న సంకల్పం వారిది. అందుకే హైదరాబాద్‌ రాష్ట్రంలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం కానీ 1956లో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తర్వాత సంజీవరెడ్డి, తదితర కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్‌టి రామారావు, చంద్రబాబునాయుడు కానీ సెప్టెంబర్‌ 17న సంబరాలు జరుపుకోలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ప్రత్యేక తెలంగాణ ఉద్యమనాయకుడిగా ప్రతి సంవత్సరం ఈ ప్రస్తావన చేసేవారు. సెప్టెంబర్‌ 17 నాడు కర్ణాటక, మహారాష్ట్రలలో విలీనమైన పాత హైదరాబాద్‌ సంస్థానం ప్రాంతాలలో జరుపుకున్నట్టు హైదరాబాద్‌లో కూడా సంబురాలు జరిపించాలని డిమాండ్‌ చేశారు, ఆ పని చేయనందుకు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులను తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చాక ఆయన సైతం పాత ముఖ్యమంత్రుల బాటలోనే నడుస్తున్నారు. ఈ మౌనం వెనుక ముస్లింలను దూరం చేసుకోరాదనే విధానం కావచ్చు. పాత గాయాలను రేపడం ఎందుకన్న అభిప్రాయం కావచ్చు.



కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చరిత్రాత్మకమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. సుమారు నాలుగు వేలమంది యోధులు నేలకొరిగారు. జాగీర్‌దారుల, దేశ్‌ముఖ్‌ల దురాగతాలను వ్యతిరేకిస్తూ వారి గూండాలపైనా, రజాకార్లపైనా జరిగిన పోరాటం నిజాం పాలనా వ్యవస్థను కుదిపేసింది. నిజాం దారికి వస్తాడేమోనని నెహ్రూ, పటేల్‌ పదమూడు మాసాలు వేచి చూశారు. చర్చలతో పరిష్కారం కాకపోతే బలప్రయోగం చేయవలసి ఉంటుం దని నిజాంను నెహ్రూ హెచ్చరించాడు. పటేల్‌ 36 వేల మంది సైనికులను జనరల్‌ జెఎన్‌ చౌధురి నాయకత్వంలో పంపించారు. రజాకార్లు ప్రతిఘటించలేక దాసోహమన్నారు.



నిజాం లొంగుబాటు

సెప్టెంబర్‌ 17న నిజాం లొంగిపోయాడు. ఐక్యరాజ్య సమితిలో పెట్టిన కేసు ఉపసంహరించుకున్నట్టు రేడియో ప్రసంగంలో నిజాం చెప్పాడు. అది ఒత్తిడిలో చేసిన ప్రకటన కనుక కేసు ఉపసంహరణను ఆమోదించేది లేదంటూ ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. ఆ కేసు ఇటీవలి వరకూ సమితి పరిశీలనలో ఉంది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలలో పది స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం మంజూరు చేయలేదు. ఇందుకు ఇందిరాగాంధీ చెన్నారెడ్డికి చూపించిన కారణం ఈ కేసు. అంతకుముందు హైదరాబాద్‌ను ఆంధ్రలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేయడం వెనుక కూడా ఈ కేసు ఉన్నదని అంటారు. జనరల్‌ చౌధురి నిర్వహించిన సైనిక చర్యను పోలీసు చర్య అనీ, ఆపరేషన్‌ పోలో అనీ, ఆపరేషన్‌ క్యాటర్‌పిల్లర్‌ అనీ పిలిచారు. వాస్తవంగా జరిగింది సైనిక చర్య. కానీ దానిని పోలీసు చర్య (పోలీస్‌ యాక్షన్‌)గా అభివర్ణించడంలోని ఆంతర్యం ఐక్యరాజ్యసమితిని చిరాకు పరచకూడదనే.



సైనిక చర్య అంటే అది స్వతంత్రం ప్రకటించుకున్న రాజ్యంలో మరో దేశం జోక్యం చేసుకోవడంగా పరిగణించే ప్రమాదం ఉన్నదని భావించి ఉంటారు. సైన్యం నలుమూలల నుంచి హైదరాబాద్‌ను చుట్టుముట్టిన క్రమంలో హింసాకాండ జరిగిందని వార్తలు వచ్చాయి. నిజనిర్ధారణ కోసం నెహ్రూ పండిట్‌ సుందర్‌లాల్‌ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. కాజీ అబ్దుల్‌ గఫర్, మౌలానా మిస్రీ ఈ కమిటీలో తక్కిన సభ్యులు. ఈ కమిటీ 1948 డిసెంబర్‌లో మూడు వారాలు హైదరాబాద్‌ సంస్థానం ప్రాంతంలో పర్యటించి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక చూసి నిర్ఘాంతపోయిన నెహ్రూ, పటేల్‌ దానిని రహస్య పత్రంగా పరిగణించి ప్రజలకు అందుబాటులో లేకుండా దాచారు. 2013లో కేంబ్రిడ్జికి చెందిన చరిత్రకారుడు సునీల్‌ పురుషోత్తమ్, మరో చరిత్రకారుడు మహమ్మద్‌ సలీయుల్లా పూనిక ఫలితంగా ఈ నివేదిక వెలుగు చూసింది. నాందేడ్, షోలాపూర్‌ పట్టణాలతో సహా అనేక ప్రాంతాలలో స్థాని కులు పాత కక్షలు తీర్చుకునే క్రమంలో అనేక దాడులు చేశారనీ, కనీసం 27 వేలమంది ఈ దాడులలో మరణించి ఉంటారనీ, వారిలో అత్యధికులు ముస్లింలేననీ సుందర్‌లాల్‌ కమిటీ నివేదించింది. ‘మిమ్మల్ని హైదరాబాద్‌ ఎవరు వెళ్ళమన్నారు?’ అంటూ పటేల్‌ ఈ కమిటీ సభ్యులలో ఒకరైన గఫర్‌ను మందలించారట. ఈ విషయాలు బయటికి పొక్కితే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందనే భయంతో నివేదికను రహస్యపత్రంగా పరిగణించి ఉంటారు.



బీజేపీ వ్యూహం

బీజేపీకి మాత్రం ఈరోజు ఒక ముస్లిం రాజును గద్దె దింపిన రోజు. కనుక సంబరాలు జరుపుకోవలసిన సందర్భం. విమోచన సంబరాలు జరుపుకోవాలని నిరుడు వెంకయ్యనాయుడు కేసీఆర్‌ను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించలేదు. నిజాం పాలనను మెచ్చుకునే కేసీఆర్‌ ఇలా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆఖరి శ్వాస వరకూ కాంగ్రెస్‌వాదిగానే కొనసాగిన సర్దార్‌ పటేల్‌ను తమ ఆదర్శపురుషుడుగా, అభిమాన నాయకుడిగా చిత్రించడం కోసం ఈ చారిత్రక పరిణామాన్ని వినియోగించుకోవాలన్నది బీజేపీ నాయకుల అభిమతం. రజాకార్ల వారసులే ఎంఐఎం నాయకులని వారి విమర్శ. విమోచన అంటే ముస్లింలు అభ్యంతరం చెబుతారు. అడ్డుకుంటారు. ఫలితంగా హిందువులు సంఘటితం అవుతారన్న ఆలోచన కావచ్చు.



విమోచన అంటే ఎంఐఎం ఆగ్రహిస్తుందనీ, విద్రోహం అంటే బీజేపీ కోపగిస్తుందనీ భావించి ఈరోజుని ముఖ్యమైన సందర్భంగా పరిగణించకుండా వదిలేయడం చరిత్రను విస్మరించినట్టు అవుతుంది. తెలంగాణ ప్రజలకు ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ వారికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లభించింది నిజంగా ఈరోజే. కనుక విలీనదినం వేడుకగా జరుపుకోవడం సమంజసం. అధికారంలో ఉన్న పార్టీలు సంకోచిస్తూ మౌనంగా ఉంటే దీన్ని రాజకీయ ప్రయోజనాలకు విని యోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. పటేల్‌ను ప్రభుత్వాలు స్మరించకపోతే ఆయనను పూర్తిగా సొంతం చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సెప్టెంబర్‌ 17ని హైదరాబాద్‌ విలీనదినంగా జరుపుకోవడానికి సంకోచించనక్కరలేదు. ప్రభుత్వ పూనికతో జరిగే ఈ వేడుకలో టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు పాల్గొనవచ్చు. బీజేపీ, ఎంఐఎం నాయకులూ, కార్యకర్తలూ కాలక్రమంలో రాజీపడి ఈ సంబరాలలో పాల్గొంటారు. చరిత్ర చేసిన గాయాన్ని మాన్పడానికీ, సర్దార్‌ పటేల్‌ వారసత్వాన్ని స్మరించుకోవడానికీ తెలంగాణ ప్రజలకు ఇది మంచి అవకాశం.

కె. రామచంద్రమూర్తి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top