పాత్రికేయంపై పంజా

పాత్రికేయంపై పంజా - Sakshi

సందర్భం

తమ భావజాలంతో ఏకీభవించనివారిని హతమార్చుతామని బెదిరించేవారూ, హతమార్చేవారూ ప్రజాస్వామ్య వ్యవస్థకు శత్రువులు. దబోల్కర్, పన్సారే, కల్బుర్గీ వంటి మేధావులూ, రచయితలూ, హేతువాదులను చంపివేయడం ద్వారా మేధావులకు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు గౌరిని హత్య చేయడం ద్వారా జర్నలిస్టులకు ‘ఖబడ్దార్‌’ అని చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. గౌరి హంతకులు ఏ భావజాలాన్ని విశ్వసిస్తున్నారో అటువంటి భావజాలాన్ని ఆమోదించే యాంకర్లూ, అసహనం ప్రదర్శించే జర్నలిస్టులూ దాపురించారు.

 

‘సామాజిక మాధ్యమాలలో మీరు వెల్లడిస్తున్న అభిప్రాయాల విషయంలో అంత తొందరపాటు వద్దు. కొంచెం ఆలోచించండి. మనం ఉన్న కాలం అంత క్షేమకరమైనది కాదు...’ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బెంగళూరులో హత్యకు గురైన సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌కు ఒక మిత్రుడు ఈ సలహా ఇచ్చాడు. ఒక ఘటన గురించి విన్న తరువాత మరుక్షణం మనలో కలిగే స్పందననే మనం ఇతరులతో పంచుకోవాలి అంటూ అందుకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇదంతా జరిగి వారం కూడా గడవలేదు. ఇంతలోనే ఆమె హత్య వార్త దేశాన్ని కుదిపివేసింది. నిన్న మొన్న జరిగిన గోరక్షకుల దాడుల గురించి, తాజాగా గోరఖ్‌పూర్‌ శిశు మరణాలపైన తీవ్ర నిరసన వ్యక్తం చేయడం వరకూ మిత, మతవాద రాజకీయాల మీద గౌరి నిరంతరాయంగా ధ్వజమెత్తుతూనే ఉన్నారు. ఆమె తన గురించి తనే పేర్కొన్నట్టు ఎంత వేగంగా స్పందిస్తారంటే, ప్రస్తుతం కేంద్రం, సుప్రీంకోర్టు నడుమ ఉన్న రొహింగ్యా శరణార్థుల పునరావాసం గురించి కూడా సామాజిక మాధ్యమాలలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనితో పాటు నక్సలైట్‌ ఉద్యమంలోని వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి రప్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. 

 

కన్నడ వారపత్రిక ‘గౌరి లంకేశ్‌ పత్రికె’కు గౌరి సంపాదకురాలు. తండ్రి నుంచి ఆ పత్రికతో పాటు, ఆయన భావాలు కూడా ఆమెకు వారసత్వంగా వచ్చాయి. ఇద్దరూ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పత్రికను ఆయుధంగా చేసుకున్నవారే. రాజ్యాన్ని ఎదిరించి పోరాడిన సాహసోపేతురాలైన జర్నలిస్టుకు ప్రభుత్వ లాంఛనాలతో బుధవారంనాడు అంత్యక్రియలు జరగడం విడ్డూరం. గౌరి గత కొంతకాలంలో ‘హిందూత్వ’రాజకీయాలకు వ్యతిరేకంగా కలం ఝళిపిస్తున్నవారే. టీవీ చానళ్ళు నిర్వహించే చర్చలలో రాజీలేని వాదన వినిపిస్తున్నవారే. దీనితో ఆమెకు తీవ్ర స్థాయిలో బెదిరింపులు తప్పలేదు. కానీ తనకు ఉన్న ప్రాణహాని గురించి ఆమె ఏనాడూ పట్టించుకోలేదు. గౌరి ప్రచురించిన ఒక నివేదిక మీద బీజేపీ ఎంపీ ప్రహ్లాద్‌ జోషి పరువునష్టం దావా వేశారు. అందులో గౌరిని కోర్టు దోషిగా తేల్చింది కూడా. ఆరు మాసాల శిక్ష విధించింది. ఆమె అప్పీలుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. 

 

ఇంత జరిగినా ఆమె తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆమె ఫేస్‌బుక్‌ పేజీ తెరిస్తే రోహిత్‌ వేముల ఫొటో, ట్వీటర్‌ హెడర్‌ స్థానంలో కన్హయ్య కుమార్‌ ఫొటో కనిపిస్తాయి. కన్హయ్యను తన పెంపుడు కొడుకని సంబోధించేవారు. ఇవన్నీ సరే, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రతినిధులుగా చెప్పుకోదగిన దబోల్కర్, పన్సారే, కల్బుర్గీలను హత్య చేసిన వారి ఆచూకీ ఈనాటికి కూడా తెలియడం లేదు. ఇప్పుడు గౌరి హత్య దర్యాప్తు విషయంలో అయినా ప్రభుత్వాలు స్పందన ఎలా ఉండబోతున్నదన్నదే అంతా ఎదురుచూస్తున్న అంశం. లౌకికవాదం కోసం, ప్రజాస్వామ్యం కోసం, దళితుల హక్కుల కోసం, స్త్రీల హక్కుల కోసం గొంతెత్తే వారి అవసరం ఎప్పటికీ ఉంటుంది. దానిని గుర్తించి నట్టయితే ప్రభుత్వాలు గౌరి హంతకులను తక్షణం అరెస్టు చేయడానికి పాటు పడ తాయి. అప్పుడే ప్రజలలో నమ్మకం ఏర్పడుతుంది.

 

నత్తనడకలో దర్యాప్తులు 

గౌరీ లంకేశ్‌ హత్యపై దర్యాప్తు జరిపి, వాస్తవాలు వెలికి తీయడానికి ప్రత్యేక బృందాన్ని (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌–సిట్‌) ఏర్పాటు చేస్తామనీ, పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఒకరు ఈ బృందానికి నాయకత్వం వహిస్తారనీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం బెంగళూరులో విలేకరులకి చెప్పారు. కానీ గౌరి దారుణ హత్యతో నిర్ఘాంతపోయిన దేశానికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ సాంత్వన కలిగించదు. ఎందుకంటే 2013 నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో జరిగిన హత్యలపైన విచారణ నత్తనడక నడుస్తున్నది. దబోల్కర్, పన్సారీల హంతకులను పట్టుకోవడంలో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైతే కల్బుర్గీని హత్య చేసినవారి ఆచూకీని కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. 

 

దేశంలో ఐటీ రాజధానిగా, కాస్మోపాలిటన్‌ సంస్కృతి కలిగిన నగరంగా బెంగళూరుకు మంచే పేరే ఉంది. ఈమధ్య నేరాల సంఖ్య పెరిగిపోయి నేర రాజధానిగా మారుతోంది. ఒకరిని హతమార్చాలని గట్టి పట్టుదలతో ప్రయత్నించే హంతకుల నుంచి పౌరులను రక్షించడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ హత్య జరిగిన తర్వాత సంవత్సరాలు గడిచినా దర్యాప్తు అంగుళం ముందుకు కదలకపోవడం, హంతకులను పట్టుకోలేకపోవడం వల్ల చట్టం పట్ల భయం తగ్గిపోతుంది. నేరం చేసినవారికి శిక్ష పడకపోతే నేరాలు పెరుగుతాయి. కర్ణాటక పోలీసుల దర్యాప్తు పట్ల విశ్వాసం లేకనే తన సోదరి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ గౌరీ సోదరుడు కోరాడు.

 

దేశవ్యాప్తంగా నిరసనలు 

గౌరి హత్యోదంతంతో బెంగళూరులోనే కాకుండా చెన్నై, హైదరాబాద్‌ నగరాలలోనూ, దేశవ్యాప్తంగా మరెన్నో నగరాలనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ దుర్ఘటనపై నివేదిక పంపించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. హంతకులను వెంటనే పట్టుకునేందుకు కృషి చేయాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదేశించారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన నేరం. నిబద్ధత కలిగిన వారంతా ఈ దారుణాన్ని ఖండించాలి. 

 

ఈ నలుగురి హత్యల విషయంలోనూ ఒకే పద్ధతి కనిపిస్తుంది. ఆగంతుకులు ఒకే విధంగా ద్విచక్రవాహనాల మీద వచ్చారు. ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు బృందాలుగా వచ్చారు. అతి సమీపం నుంచి పలుమార్లు కాల్పులు జరిపారు. ఒకే పద్ధతిలో నాలుగు హత్యలూ జరిగాయి. ‘సాధన’ పత్రిక సంపాదకుడు నరేంద్ర దబోల్కర్‌ను ఆగస్టు 20, 2013న కాల్చి చంపారు. ద్విచక్ర వాహనం మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు సమీపం నుంచి నాలుగుసార్లు కాల్పులు జరిపారు. తరువాత దబోల్కర్‌ మిత్రుడు, హేతువాది గోవింద్‌ పన్సారేను హత్య చేశారు. దబోల్కర్‌ హత్యపై దర్యాప్తును త్వరగా ముగించి, హంతకులను పట్టుకోవలసిందని పన్సారే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. 

 

17వ శతాబ్దానికి చెందిన మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ గురించి ‘శివాజీ ఎవరు?’ పేరుతో పన్సారే ఒక పుస్తకం రాశారు. శివాజీ బలమైన లౌకికభావాలు కలిగినవాడని నిరూపించే ప్రయత్నం చేశారు. కొల్హా పూర్‌లో ఫిబ్రవరి 20, 2015న ద్విచక్ర వాహనం మీదే వచ్చిన దుండగులు పన్సారేను హత్య చేశారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా 2015లో వచ్చిన చట్టం ఆయన కృషి ఫలితమే. హంపీ విశ్వవిద్యాలయం మాజీ వైఎస్‌చాన్సలర్, హేతువాది, ప్రముఖ కన్నడ భాషా రచయిత మల్లేశప్ప ముదివాలప్ప కల్బుర్గీ హత్య ఆగస్టు 30, 2015న ధార్వాడ్‌లో జరిగింది. అప్పుడు కూడా ద్విచక్ర వాహనం మీద వచ్చిన వారే ఆ దురాగతానికి పాల్పడ్డారు.



‘ది రిపబ్లిక్‌ ఆఫ్‌ రీజన్‌: వర్డ్స్‌ దే కుడ్‌నాట్‌ కిల్‌’ అనే గ్రంథాన్ని కల్బుర్గీ రచించారు. ఈ ముగ్గురి మాదిరిగానే ఆలోచించే నాలుగో వ్యక్తి గౌరీ లంకేశ్, ఆమెను కూడా అదే పద్ధతిలో హతమార్చారు. ఇద్దరు వ్యక్తులు ఈ ఘాతుకంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. దబోల్కర్, పన్సారేల హత్యలు ఒకే తీరులో, పెద్ద ప్రణాళికతో జరిగినవేనని బొంబాయి హైకోర్టు సైతం అభిప్రాయపడింది. ‘ఇవి అనూహ్యంగా, చెదురుమదురుగా జరిగిపోయిన ఘటనలు కావని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొన్ని సంస్థల ధనసాయం, మద్దతు కచ్చితంగా వీటి వెనుక ఉండి ఉండాలి’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామిక, లౌకిక, ఉదారవాద భావాలతో భారతదేశం మనుగడ సాగించాలంటే, దేశ సమైక్యత, సమగ్రతలను పరిరక్షించాలంటే ఇలాంటి ఉన్మాదాన్ని వెంటనే నిలువరించాలి. భావప్రకటన స్వేచ్ఛ సమాజానికి ఆక్సిజన్‌ వంటిది. ప్రశ్నించే తత్త్వం ప్రజాస్వామ్యానికి ఊపిరి.

 

ప్రజాస్వామ్య ద్రోహులు

తమ భావజాలంతో ఏకీభవించనివారిని హతమార్చుతామని బెదిరించేవారూ, హతమార్చేవారూ ప్రజాస్వామ్య వ్యవస్థకు శత్రువులు. దబోల్కర్, పన్సారే, కల్బుర్గీ వంటి మేధావులూ, రచయితలూ, హేతువాదులను చంపివేయడం ద్వారా మేధావులకు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు గౌరిని హత్య చేయడం ద్వారా జర్నలిస్టులకు ‘ఖబడ్దార్‌’ అని చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. గౌరి హంతకులు ఏ భావజాలాన్ని విశ్వసిస్తున్నారో అటువంటి భావజాలాన్ని ఆమోదించే యాంకర్లూ, అసహనం ప్రదర్శించే జర్నలిస్టులూ ఇంగ్లీషు చానళ్ళలో దాపురించారు. జర్నలిజానికి ఇటువంటి జర్నలిస్టులు కూడా హాని చేస్తున్నారు.



గావుకేకలు పెట్టడం, ఇతరులను మాట్లాడనీయకుండా తామే వాగడం, తర్జని ఊపుతూ ఒక పక్షానికి చెందిన రాజకీయవాదుల గురించి కటువుగా మాట్లాడం ఈ మధ్య జాతీయ చానళ్ళలో ఎక్కువయింది. సమాచార హక్కు చాలా విలువైనది. గౌరి హత్య అనంతరం జర్నలిస్టులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉద్యోగాలు చేస్తే సరైన సమాచారం సమాజానికి అందదు. జర్నలిస్టులను రక్షించుకోవలసిన బాధ్యత సమాజానిదే. జర్నలిజంలో ఎన్ని లోపాలున్నప్పటికీ, ఎన్ని అవలక్షణాలు కనిపిస్తున్నప్పటికీ ప్రజాస్వామ్యం మనుగడకు మీడియా క్రియాశీలకంగా పనిచేయాలి. తమ వాదనతో ఏకీభవించనివారిని హత్య చేసే భయంకరమైన ధోరణిని సమాజం తిరస్కరించాలి. ఎవరి విశ్వాసాలకు తగినట్టు వారు జీవించే స్వేచ్ఛ కావాలి. 

 

గౌరీ లంకేశ్‌ హత్య అనంతరం సోషల్‌ మీడియాలో వచ్చిన ప్రతిస్పందనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గౌరి హత్య పట్ల ఆనందం వెలిబుచ్చుతూ తను పెట్టిన పోస్టింగులను ప్రధాని స్వయంగా చూస్తారని ఒక వ్యక్తి గొప్పలు చెప్పుకున్నారు. అంటే తన అభిప్రాయాలకు ప్రధాని ఆమోదం ఉన్నదని ధ్వనించే విధంగా పోస్టింగ్‌ పెట్టాడు. ప్రముఖ న్యాయవాది ప్రశాంతభూషణ్‌ను సుప్రీంకోర్టులోని ఆయన కార్యాలయంలోకి ఒక వ్యక్తి ప్రవేశించి నేలమీద పడవేసి కొట్టాడు. ఆ వ్యక్తిని బీజేపీ సోషల్‌ మీడియాకి అధిపతిగా నియమించిందని ప్రశాంత భూషణ్‌ బుధవారంనాడు వెల్లడించారు. ఇటువంటి చర్యలు తప్పుడు సంకేతాలు ఇస్తాయి. ప్రశాంత భూషణ్‌పై దాడిని బీజేపీ ఆమోదించినట్టు అర్థం అవుతుంది. మొత్తంమీద దేశంలో అసహన వాతావరణం ప్రబలిందన్న మాట వాస్తవం. దీనికి కారణాలు ఏమిటో, కారకులు ఎవరో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సామరస్యపూరితమైన వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నించాలి. అదే గౌరీ లంకేశ్‌ కోరుకున్న మార్పు. దాన్ని సాధించడానికి కృషి చేయడమే ఆమెకు నిజమైన నివాళి.

  

 

    కె. రామచంద్రమూర్తి

 
Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top