భారత ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో కొత్త పోర్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: వ్యాపారరంగాన్ని వృద్ధిబాటలో నడిపేందుకు భారత ప్రభుత్వం రవాణా వ్యవస్థలపై దృష్టిపెట్టింది. కీలకంగా మారిన సముద్ర రవాణాను పటిష్టం చేసేందుకు కొత్త పోర్టుల నిర్మాణానికి సన్నద్ధమవుతోంది. దేశీయ దిగ్గజ సంస్థ గౌతమ్ అదానీ గ్రూప్ పాతికేళ్ల క్రితం ప్రతిపాదించిన మొదటి ట్రాన్స్ షిప్ మెంట్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ ఆసియాలో వరుసగా పోర్టులను నిర్మిస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్న చైనాకు దీటుగా కొత్త షిప్పింగ్ హబ్ ను కేరళలోని విజిన్జంలో నిర్మించేందుకు దాదాపు రూ. 27 వేల కోట్లు కేటాయించింది.
విజిన్జం పోర్టు నిర్మాణానికి అవసరమయ్యే మొత్తాన్ని విడతల వారీగా ప్రభుత్వం గౌతమ్ అదానీ గ్రూప్ సంస్థకు విడుదల చేయనుంది. విజిన్జం పోర్టు నిర్మాణం పూర్తయిన వెంటనే తమిళనాడులోని ఎనయామ్ వద్ద మరో పోర్టును నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు షిప్పింగ్ మంత్రిత్వశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కేవలం ఎనయామ్ నిర్మాణం వల్ల ఏటా 200 మిలియన్ డాలర్లను భారత కంపెనీలు ఆదా చేసుకోవచ్చని వివరించారు. భారతదేశానికి ఉన్న విశాలమైన 7,500 కిలోమీటర్ల తీరప్రాంతం ద్వారా దేశాన్ని ఆర్థికంగా పటిష్ట పరచాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరిక అని చెప్పారు.
2021 నాటికల్లా కార్గో రవాణా మూడింట రెండొంతులు పెరుగుదల చూపిస్తుందని.. పోర్టులను నిర్మించడం ద్వారా శ్రీలంక, సింగపూర్, దుబాయ్ వంటి దేశాలకు రవాణా సౌకర్యాలను పెంచుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు ఒక బిలియన్ డాలర్ల వ్యయంతో అదానీ గ్రూప్ ప్రారంభించిన విజిన్జం పోర్టు నిర్మాణాన్ని 2018లో పూర్తి చేయనున్నారు. విజిన్జం పోర్టు రవాణాకు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సముద్ర రవాణా దారిగా పేరుగాంచిన గల్ఫ్-మలక్కాకు కీలకంగా మారుతుంది.
ప్రస్తుతం ట్రాన్స్ షిప్ మెంట్ కోసం కొలంబో, సింగపూర్, దుబాయ్ ల పోర్టులపై ఆధారపడుతున్న భారత కంపెనీలు విజిన్జం నుంచి రవాణాకు వీలు కలుగుతుందని అదానీ గ్రూప్ కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. దాంతో శ్రీలంకలోని కొలంబో, హంబన్ తోటల్లో చైనా నిర్మిస్తున్న పోర్టులకు విజిన్జం గట్టి పోటీ ఇవ్వనుంది.
చైనా ప్రమాదం
శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవుల్లో పోర్టుల నిర్మాణంలో చైనా పెట్టుబడులు పెడుతుండటం భారత్ కు ముప్పుగా మారింది. చైనా-పాకిస్తాన్ కారిడార్ కింద దాదాపు 46 బిలియన్ డాలర్లతో చైనా పాకిస్తాన్ లోని గ్వాదర్ వద్ద పోర్టును నిర్మిస్తోంది. విజిన్జం పోర్టు నిర్మాణంలో కూడా చైనా భాగస్వామిగా మారడానికి ప్రయత్నించినా, దేశభద్రత కింద భారత ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు.
పోర్టుల నిర్మాణంలో చైనాకు చెందిన కంపెనీలు పెట్టుబడులు పెట్టకుండా ఎలాంటి నిషేధం విధించలేదని ఓ అధికారి తెలిపారు. కేవలం రవాణా కోసమే కాకుండా రక్షణపరంగా కూడా నేవీ, కోస్ట్ గార్డుకు చెందిన నౌకలను కూడా విజిన్జం పోర్టులో ఉపయోగించేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. 2014లో కొలంబో పోర్టు వద్ద చైనా తన జలాంతర్గామిని ఉంచడంతో షాకైన భారత్.. పోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇరాన్ లోని చాబహార్ వద్ద పోర్టు నిర్మించేందుకు భారత్-ఇరాన్ లు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ పోర్టు ద్వారా ఇరాన్, ఆప్ఘనిస్తాన్ మరికొన్ని మధ్య ఆసియా దేశాలకు రవాణా సులువుగా మారనుంది.
అయితే, తక్కువ ధరలకే ట్రాన్స్ షిప్ మెంట్ ను అందిస్తున్న కొలంబో పోర్టును వదిలేసి విజిన్జం పోర్టుకు షిప్ మెంట్లను వ్యాపారస్తులు ఎలా పంపుతారన్నదే.. ప్రశ్నార్థకంగా మారింది. భారీగా ఆఫర్ లను ఇవ్వడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమనే వాదన కూడా ఉంది. వాస్తవానికి 25 ఏళ్ల క్రితమే విజిన్జం పోర్టు నిర్మాణానికి అనుమతులు రాగా ఎఫ్ బీఐ నుంచి భద్రత కారణాలు, కేసుల కారణంగా పోర్టు నిర్మాణం వాయిదా పడటం ఒక రకంగా భారత్ కు నష్టం కలిగించిందనే చెప్పాలి.