అయితే భారత్‌కేంటి ? 

India Welcomes Success Of Singapore Summit - Sakshi

సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ జరిపిన అణు చర్చలు ఎలాంటి ఫలితాన్నిస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూసిన దేశాలలో భారత్‌ కూడా ఒకటి. మొదట్నుంచి ట్రంప్, కిమ్‌ వేస్తున్న అడుగుల్ని నిశితంగా గమనిస్తున్న భారత్‌ సదస్సు విజయవంతం కావడాన్ని స్వాగతించింది. కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతలకు ఈ చర్చల ద్వారా మార్గం ఏర్పడిందని భారత్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఇరుగుపొరుగు దేశాలకు అణుపరిజ్ఞానం వ్యాప్తికి ఇకనైనా అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.  గత కొన్నేళ్లుగా ఉత్తరకొరియా, పాకిస్తాన్‌ మధ్య అణు సంబంధాలు కొనసాగుతున్నాయనే ఆందోళనలో ఉన్న భారత్‌ ఈ చర్చల ద్వారా తమ ఆందోళనలకు కూడా తెరపడుతుందని ఆశగా ఎదురు చూస్తోంది. ట్రంప్, కిమ్‌ చర్చలు సానుకూలంగా జరగడం భారత్‌కు కలిసొచ్చే అంశమనే అంచనాలు ఉన్నాయి. దౌత్యపరంగా, వాణిజ్యపరంగా వీరి శిఖరాగ్ర సదస్సు భారత్‌కు లాభిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

దౌత్యం బంధాలు బలపడేలా ..
భారత్‌కు మొదట్నుంచి ఉత్తర కొరియా శత్రుదేశమేమీ కాదు. దాదాపుగా 20 ఏళ్ల తరవాత  గత నెలలో ఉత్తర కొరియాలో పర్యటించిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్‌  ఉత్తర కొరియాను మిత్ర దేశంగానే అభివర్ణించారు. 1962–73 మధ్య కాలంలో రెండు దేశాల మధ్య బంధాలు బలోపేతం దిశగా అడుగులు పడ్డాయి. అయితే ఉత్తర కొరియా, పాక్‌ మధ్య అణు సంబంధాలు, క్షిపణి సాంకేతిక సహకారం ఎప్పుడైతే కొనసాగాయో భారత్‌  ఉత్తర కొరియాతో అంటీముంటనట్టుగా వ్యవహరించడం మొదలు పెట్టింది. పాకిస్థాన్‌కు ఉత్తర కొరియా అణు పరిజ్ఞానం అమ్ముతోందన్న కారణంగానే ఐక్యరాజ్యసమితిలో కొరియాపై ఆంక్షల తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది.  అయినప్పటికీ భారత్‌ ఉత్తర కొరియా పట్ల ఎల్లప్పుడూ మానవతా దృక్పథంతోనే వ్యవహరిస్తూ వచ్చింది. భారత్‌లో ఉత్తర కొరియా సైనికులకు శిక్షణ, డెహ్రడూన్‌లోని సెంటర్‌ఫర్‌ స్పేస్‌సైన్స్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌లో ఉత్తర కొరియా విద్యార్థులకు  సాంకేతిక శిక్షణ కూడా ఇచ్చింది. కరువు కాటకాల సమయంలో ఆ దేశానికి చాలాసార్లు వందల టన్నుల ఆహార పదార్థాల్ని పంపించింది. ఉత్తర కొరియా కూడా  భారత్‌ను సునామీ ముంచెత్తినప్పుడు 30 వేల డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇప్పుడు ట్రంప్, కిమ్‌ చర్చల ఫలితంగా ఆసియా ఖండంలో అణ్వాయుధ వ్యాప్తి నిరోధం జరిగి శాంతిభద్రతలు ఏర్పడతానే ఆశాభావంతో భారత్‌ ఉంది. 

వాణిజ్యపరంగానూ ప్రభావం !
ఉత్తరకొరియాతో వాణిజ్యపరంగానూ భారత్‌ సత్సంబంధాలనే కలిగి ఉంది. ఉత్తర కొరియాతో వాణిజ్య భాగస్వామ్యులుగా ఉన్న దేశాలలో భారత్‌ మూడో అతి పెద్ద దేశంగా ఉంది. ప్రభుత్వ గణాంకాలప్రకారం 2015–16 సంవత్సరంలో ఇరు దేశాల మధ్య 5.9 కోట్ల డాలర్ల వ్యాపార లావాదేవీలు జరిగాయి. గత ఏడాది ఆ దేశం ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షించిన తర్వాత ఆందోళన చెందిన భారత్‌ ఆ దేశంపై వాణిజ్యపరమైన ఆంక్షల్ని విధించింది. ట్రంప్, కిమ్‌ సమావేశంలో  ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణకు అంగీకరించడంతో మోదీ ప్రభుత్వం చేపట్టిన తూర్పు దేశాలతో వాణిజ్య బం«ధాల బలోపేత విధానానికి (యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ) మరింత ప్రాధాన్యం పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే మరికొందరు రాజకీయ పరిశీలకులు మాత్రం ఉత్తర కొరియా ఎంతవరకు మాట మీద నిలబడి అణునిరా«యుధీకరణ జరుపుతుందా అన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సదస్సుతో భారత్‌కు, ఉభయ కొరియా దేశాలతో బంధాలు బలోపేతమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top