గగన్‌యాన్‌ @ 10వేల కోట్లు

10,000 cr allotted for Gaganyaan space mission - Sakshi

మానవసహిత అంతరిక్ష యాత్రకు బడ్జెట్‌ కేటాయించిన కేంద్ర కేబినెట్‌

జీఎస్‌ఎల్వీ మార్క్‌–3తో అంతరిక్షంలోకి వ్యోమగాములు

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయులను  అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించిన ‘గగన్‌యాన్‌ ప్రాజెక్టు’కు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. రూ.10,000 కోట్ల బడ్జెట్‌తో చేపట్టనున్న ఈ ప్రయోగంలో భాగంగా ముగ్గురు వ్యోమగాముల బృందం అంతరిక్షంలో కనీసం వారంరోజుల పాటు గడపనుంది. ప్రాజెక్టులో భాగంగా తొలుత పూర్తి సన్నద్ధతతో ఉన్న రెండు మానవరహిత వాహకనౌకలను ప్రయోగిస్తారు. చివరగా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతారు.

అన్నిరంగాల భాగస్వామ్యం
‘శక్తిమంతమైన జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 వాహకనౌక ద్వారా వ్యోమగాముల మాడ్యూల్‌ను అంతరిక్షంలోని భూదిగువ కక్ష్యలోకి ప్రయోగిస్తాం. ఈ మిషన్‌ సందర్భంగా ముగ్గురు వ్యోమగాములకు దాదాపు వారం పాటు కావాల్సిన అన్ని వస్తువులు ఈ మాడ్యుల్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే సిబ్బంది శిక్షణ, ఫ్లైట్‌ సిస్టమ్‌తో పాటు మౌలిక వసతుల అభివృద్ధిని గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా చేపడతాం. ఇందుకోసం పలు జాతీయ సంస్థలతో పాటు ల్యాబొరేటరీలు, విద్యావేత్తలు, పారిశ్రామికవర్గాలతో కలిసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) పనిచేస్తుంది.

గగన్‌యాన్‌ ప్రాజెక్టు కోసం కేటాయించిన రూ.10,000 కోట్లతో ఫ్లైట్‌ హార్డ్‌వేర్, అవసరమైన టెక్నాలజీ అభివృద్ధితో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రయోగం వల్ల అత్యాధునిక టెక్నాలజీ విభాగంలో ఉద్యోగ కల్పనతో పాటు సుశిక్షితులైన మానవవనరులను తయారుచేయడం వీలవుతుంది. గగన్‌యాన్‌ ద్వారా విద్యార్థులు స్ఫూర్తి పొంది సైన్స్, టెక్నాలజీ రంగాన్ని తమ వృత్తిగా ఎంపికచేసుకుంటే దేశ నిర్మాణంలో వాళ్లంతా భాగస్వాములు అవుతారు’ అని కేంద్రం తెలిపింది.

ముచ్చటగా 3 ప్రయోగాలు
‘ఆమోదం పొందిన నాటి నుంచి 40 నెలల్లోగా మానవసహిత అంతరిక్ష యాత్రను చేపట్టాల్సి ఉంటుంది. అంతకంటే ముందు పూర్తిస్థాయిలో సిద్ధమైన రెండు మానవరహిత అంతరిక్ష వాహకనౌకలను ప్రయోగించి మిషన్‌ సన్నద్ధతను శాస్త్రవేత్తలు పరీక్షిస్తారు. తద్వారా మిషన్‌ ఏర్పాట్లు, సన్నద్ధత, టెక్నాలజీ పనితీరును అర్థం చేసుకుంటారు. చివరగా ముగ్గురు వ్యోమగాములను జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపుతారు. ఈ ప్రయోగం వల్ల భారత్‌లో వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక భద్రత, కాలుష్యం, వ్యర్థాల నియంత్రణ, నీరు–ఆహారభద్రత రంగాలకు ఊపు లభిస్తుంది’ అని కేంద్రం వెల్లడించింది.

ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ శివన్‌ మాట్లాడుతూ.. గగన్‌యాన్‌ ప్రయోగం వల్ల భారత్‌లో 15,000 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రయోగంలో వినియోగించే శక్తిమంతమైన జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 వాహకనౌకను ఇస్రో ఇప్పటికే అభివృద్ధి చేసింది. అలాగే వ్యోమగాములు అంతరిక్షంలో విహరించేం దుకు అవసరమైన మాడ్యూల్‌ను, ప్రయోగం సందర్భంగా ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునే ‘క్రూ ఎగ్జిట్‌ సిస్టమ్‌’ను శాస్త్రవేత్తలు ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. అంతేకాకుండా వ్యోమగాములు ధరించే స్పేస్‌ సూట్‌ను, మాడ్యుల్‌లోని లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ను కూడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి పరీక్షించారు.

2022 లేదా అంతకంటే ముందే ఓ భారతీయుడిని సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపుతామని 2018, ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే 2022 నాటికి లేదా అంతకంటే ముందే ఈ దేశపు యువతి లేదా యువకుడు అంతరిక్షంలోకి త్రివర్ణ పతాకంతో వెళతారని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రయాన్‌–1(2008), మంగళ్‌యాన్‌(2014) వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల తర్వాత ఇస్రో చేపడుతున్న కీలకమైన ప్రయోగం ఇదే కావడం గమనార్హం.

శ్రీహరికోట నుంచి ప్రయోగం
భారత్‌ రూ.10,000 కోట్ల వ్యయంతో 2022 నాటికల్లా మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ను చేపట్టనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనాల తర్వాత సొంత పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి మానవుడిని విజయవంతంగా పంపిన నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది.

► నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది.

► ప్రయోగంలో సాంకేతిక సాయం కోసం రష్యా, ఫ్రాన్స్‌లతో భారత్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది.

► సంస్కృత పదం వ్యోమ్‌(అంటే అంతరిక్షం అని అర్థం) ఆధారంగా అంతరిక్షంలోకి వెళ్లే భారతీయులను ‘వ్యోమ్‌నాట్స్‌’ అని వ్యవహరిస్తారు.

► గగన్‌యాన్‌ కోసం అవసరమైన కీలక సాంకేతికతల అభివృద్ధికి ఇస్రో ఇప్పటివరకూ రూ.173 కోట్లు ఖర్చుపెట్టింది. అంతరిక్ష యాత్రను చేపట్టాలని 2008లో ఆలోచన చేసినప్పటికీ ఆర్థిక కారణాలు, రాకెట్‌ ప్రయోగాల వైఫల్యంతో ఇస్రో వెనక్కితగ్గాల్సి వచ్చింది.

► 2007లో ఇస్రో ‘రీ ఎంట్రీ టెక్నాలజీ’ని పరీక్షించింది. ఇందులో భాగంగా అంతరిక్షంలో 550 కేజీల బరువున్న ఉపగ్రహాన్ని పంపి సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చింది. ఇందుకోసం భారీ ఉష్ణోగ్రతను సైతం తట్టుకునే తేలికపాటి, దృఢమైన సిలికాన్‌ పొరలను వాడారు.

► వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే మాడ్యుల్‌ను జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 ద్వారా ఇస్రో 2014లో ప్రయోగించింది. దాదాపు 3,745 కేజీల బరువున్న ఈ మాడ్యూల్‌ అంతరిక్షంలోకి వెళ్లి బంగాళాఖాతంలో విజయవంతంగా దిగింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top