అమూల్యమైన సందర్భం

Sriramana Article On Great Poets - Sakshi

అక్షర తూణీరం

గుడికి రోజూ వెళ్తూనే ఉంటాం. అయినా శ్రద్ధగా గమనించం. మూలవిరాట్‌ని కళ్లింతవి చేసి చూస్తాం. అఖండం వెలుగులో చాలన్నట్టు దర్శనమి స్తాడు. నాడు శిల్పులు అడుగడుగునా, అణువణువునా ఎన్ని అందాలు సృజించి ఉంటారో మనం దశాబ్దాలు గడిచినా గమనించం. అలాగే మహా కవుల ఎన్నో చక్కందనాల్ని పట్టించుకోం. అలాగే కొన్ని జీవితాలు వెళ్లిపోతాయ్‌. ఇదిగో ఉన్నట్టుండి భయంకరమైన తీరిక వచ్చింది. ఏళ్లుగా అవే సర్వస్వంగా సేకరించిన ఎన్నో పుస్తకాలను దోసి లొగ్గి పరామర్శించే గొప్ప అవకాశం చిక్కింది.

ఆ ఉద్యానంలో అడుగుపెడితే, నాకు ఎదురైన మొదటి పుస్తకం పోతన చరిత్రము. అభినవ పోతన వానమామలై వరదాచార్య పోతన జీవితాన్ని ప్రబంధంగా తీర్చిదిద్దారు. ఏ పుట పట్టుకున్నా మందార మకరందాలే. బంగారానికి తావిలా ఆ గ్రంథానికి అబ్బిన మహత్మ్యం మరొకటి ఉంది. గాయక సార్వభౌములు శ్రీ నారాయణరావు గారికి మహా రచయిత సభక్తికంగా సమర్పించిన ప్రతి అది. నారాయణరావు గురించి చెప్పుకోవాలంటే వారిది తెలంగాణ కరీంనగర్‌. అక్కడ విశ్వనాథ కొంతకాలం పనిచేశారు. ఆ దగ్గర్లో ‘మ్రోయు తుమ్మెద’ అనే వాగు ఉంది. ఆ పేరుతో కవి సామ్రాట్‌ నారాయణరావు సంగీత జీవితాన్ని నవల రూపంలో రచించారు. నారాయణరావు గొప్ప గాయకుడు.

ఆఖరి నైజాం నవాబుకి పరమ ఇష్టుడు, మిత్రుడు. ఆస్థానంలో ఉండమని ఆహ్వానించినా, సున్నితమైన సంగతులతో తిరస్కరిం చారు. వారి అబ్బాయి ఇక్కడ డీఐజీగా పనిచేసిన రాంనారాయణ నా అభిమాని, నా హితాభిలాషి. ఒకరోజు మరికొన్ని మంచి పుస్తకాలతోపాటు పోతన చరిత్ర నాకు కానుకగా పంపారు. వారి తండ్రిగారి స్వరాలను సీడీగా ఇచ్చారు. మ్రోయు తుమ్మెద నవలని సీడీతో సహా ముద్రించి అందిం చాలని అనుకునేవాళ్లం. ప్రస్తుతం రాంనారాయణ గొప్ప భావుకుడు, గొప్ప కవి. స్నేహధర్మంలో ఎన్నో అనుభవాలు పంచుకునేవాళ్లం. మర్చిపోలేని ఒక మాట తొలి వేకువలో పెరటివైపు తులసికోట నీడలో నాన్నగారి తంబురా శ్రుతి మంద్రస్థాయిలో మొదలయ్యేది. ఆ చిరు మంద్రానికే కోటమీది దీప శిఖ తొణికేది.

అమ్మ బొగ్గుల కుంపటిమీద అంతే శ్రద్ధగా చాయ్‌ కోసం పాలు పొంగిస్తూ ఉండేది. చాయ్‌ తాగేప్పటికంటే తాగబోయే ముందు మరీ బావుంటుందంటారు అనుభవజ్ఞులు. అమ్మకి ఏళ్లుగా తెలుసు నాన్నగారి జిహ్వకి ఎంత చక్కెర పడాలో. ఒక్క రేణువు కూడా తేడా పడేది కాదు. అంతే వేసి చెంచాతో చక్కెర కలిపేది అమ్మ. జాగ్రత్తగా, చెంచా కప్పువంచకి తగలకుండా సుతారంగా ఇతర ధ్వనుల్ని రానీయకుండా ఆమె సంబాళించేది. నాన్నగారు ప్రతిసారీ ముచ్చటపడేవారు. ఆయన అభినందనల చూపు హిందుస్థానీ నొక్కులవెంట తంబురా మెట్ల మీదుగా జారి పారిజాత పరిమళ మంత సున్నితంగా అమ్మని ఆవరించేవి. ఈ జుగల్‌ బందీ నాకు ఇష్టమైన జ్ఞాపకం అనేవారు రాం నారాయణ. కళాప్రపూర్ణ బాపు రేఖా చిత్రాలతో సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్య కావ్యం శివతాండవం. ఏమి నడక! అది ఏమి నడక! ఆచా ర్యులవారు తెలుగుజాతి వరం. ఆయనే కావ్యకర్త. ఆయనే తరగతిలో అది పాఠ్యాంశం కాగా విద్యా ర్థిగా ఆయనే చదువుకున్నారు.

ఆ కావ్యం పెనుగొండలక్ష్మి. కవి జీవితంలో మహర్దశ అంటే ఇదే. అప్పుడే చోటు నిండుకుంది. ఇంకా తంజావూరు సరస్వతీమహల్‌ లైబ్రరీ విలు వైన ముచ్చట్లు చెప్పనే లేదు. తంజావూరులో వీణల్ని వెండిగొలుసులతో గౌరవంగా వేలాడతీ స్తారు. అవి నిదానంగా గాలికి నడుములు కదిలి స్తుంటే త్యాగయ్య కృతులు తొణికిసలాడుతున్నట్టు ఉంటుంది. అదొక గొప్ప సాంప్రదాయం, వీణకు ఇవ్వాల్సిన గౌరవం. ఇంకా శ్రీశ్రీ మహాప్రస్థానం లండన్‌ రాత ప్రతి కబుర్లు చెప్పుకోనేలేదు. శ్రీశ్రీ దస్తూరీ ఎప్పుడైనా చూశారా? ఆ కంచుకంఠం విన్నారా? అవన్నీ గొప్ప అనుభవాలు. లండన్‌ విదే శాంధ్ర ప్రచురణ, డా. గూటాల కృష్ణమూర్తి చాలా శ్రమించి ముద్రించారు. తెలుగువారు లాకర్‌లో దాచుకోవాల్సిన వస్తువు ఈ మహాప్రస్థానం.


శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top