భారత్‌ కేంద్రంగా నూతన ప్రపంచం

Ram Madhav Aricle On Indias Role In Building New World Order After Corona - Sakshi

విశ్లేషణ

ఒకవైపు అమెరికా, ఐరోపా దేశాలు కరోనా వైరస్‌ ప్రభావాన్ని కట్టడి చేయడానికి కష్టపడుతోంటే, ఈ మహమ్మారిని ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాలు సమర్థవంతంగా ఎదుర్కోగలగటం గమనార్హం. కోవిడ్‌–19ను ఎదుర్కోవడంలో ప్రజాస్వామ్య క్రియాశీలత కనపరచి భారతదేశం మిగతా వారికి ఓ ఉదాహరణగా నిలిచింది. దూరదృష్టి కల నేతల నేతృత్వంలోని ప్రజాస్వామ్య దేశాలు ఇటువంటి సవాళ్ళను ఉదారవాద విలువల విషయంలో రాజీ పడకుండా ఎదుర్కోగలవని మోదీ నిరూపించారు. ఇప్పుడిప్పుడే ఆవిష్కృతమవుతున్న నూతన ప్రపంచ క్రమంలో, మోదీ సూచించిన ‘మానవ కేంద్రక అభివృద్ధి సహకారం’ ఆధారంగా  నూతన ప్రపంచ వ్యవస్థను నిర్మించటంలో అమెరికా, జర్మనీ దేశాలతో కలిసి భారత్‌ నిర్ణయాత్మక పాత్ర పోషించగలదు.

శతాబ్ద కాలం క్రితం అమెరికా, ఐరోపా దేశాలు, ఆ దేశాల కాలనీలలో పర్యటించా లంటే ప్రజలెవరికీ వీసాలు, పాస్‌ పోర్టుల అవసరం ఉండేది కాదు. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. దేశాల సరిహద్దులు కఠినతరంగా మారాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించటం, ఆర్థికమాంద్యం పెరిగి పోవటం జరిగింది. జాతీయవాదం హద్దు మీరిన జాతీయవాదంగా పరిణమించటంతో రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత దేశాలన్నీ కలిసి ఒకరితో ఒకరికి సంబంధం ఉండేలా ఓ వ్యవస్థీకృత ప్రపంచ వ్యవస్థని రూపొందించుకొన్నాయి. అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ గత 65 సంవత్సరాలలో ప్రపంచ క్రమం అదే రీతిలో కొనసాగింది.

ఆ ప్రపంచ క్రమాన్ని కరోనా విశ్వ మహమ్మారి ఆస్థిరపరచేలా ఉంది. దేశాలు అంతర్ముఖంగా, కొన్నైతే నిరంకుశంగా మారుతు న్నాయి. కొద్ది మంది రాజకీయ శాస్త్రజ్ఞులు తలుపులు మూసుకొని ఉండే సంకుచిత జాతీయవాదం ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతుందని చెబుతున్నారు. ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్యాలకు కాలం చెల్లిందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ నిరాశావాదం ఎక్కడ నుండి పుడు తోంది? దీనికంతటికీ కేవలం కరోనా వైరస్‌ కారణం కాకపోవచ్చు. అత్యంత శక్తివంతమైన దేశాలుగా భావించబడే రెండు దేశాలు యావత్‌ ప్రపంచ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాయి. హూవర్‌ సంస్థకు చెందిన అమెరికా చరిత్రకారుడు నియాల్‌ ఫెర్గుసన్‌ వాటిని ‘చిమేరా’గా వర్ణించాడు.

చిమేరా అంటే గ్రీకు పురాణాల్లో సింహం తలతో, మేక శరీరంతో, పాము తోకతో, నోటి నుండి మంటలను ఊదుతూ  ఉండే ఓ భయం కర సంకర జీవి. గత దశాబ్దం పైగా అమెరికా, చైనాలు సృష్టించిన ఆర్థిక సంబంధ నమూనాను ఫెర్గుసన్‌ 20వ శతాబ్దం చివర వరకు అమెరికా, జపాన్‌ దేశాల మధ్య ఉన్న ‘నిచిబెయి’ ఆర్థిక బంధాన్ని పోలి ఉన్నదని పేర్కొన్నాడు. కరోనా వైరస్‌ చిమెరికా (చైనా, అమెరికా) అంటే కేవలం చిమేరా మాత్రమేనని తెలియజేస్తుంది. నిజాలను ప్రపంచం నుండి దాచిపెట్టి, వైరస్‌ చైనా సరిహద్దులను దాటి విశ్వ మహమ్మారిలా పరిణమించేలా చేసిందనే ఆరోపణలను చైనా ఎదు ర్కొంటున్నది. వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న అమెరికన్‌ ఎంటర్‌ ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌ అనే మేధో సంస్థకు చెందిన డెరెక్‌ సిసోర్స్‌ చైనాలో వైరస్‌ సంక్రమణ కేసులు అది అధికారికంగా చెపుతున్న దానికంటే అనేక రేట్లు అధికంగా ఉన్నాయని వాదిస్తున్నాడు. 

ఆచారబద్ధమైన పద్ధతులను అనుసరించని దేశాలలో చైనా ఒకటి. ‘చారిత్రక అనుభవం’ అనే మార్గాన్ని అనుసరిస్తున్నామని చైనా భావి స్తూంటుంది. దీర్ఘకాల పోరాటం లేదా విప్లవం తరువాత 1949లో మావో అధికారం హస్తగతం చేసుకోవటం కారణంగానే తాము నేడు ఈ స్థాయిలో ఉన్నామని చైనా భావిస్తుంది. చైనా వాళ్ళ ప్రపంచ వీక్షణ మూడు ముఖ్య సూత్రాల ఆధారంగా ఉంటుంది. అవి జీడీపీ వాదం– స్థూల జాతీయ ఉత్పత్తి వాదం, చైనా మధ్యస్థ వాదం–అన్నిటికీ చైనానే కేంద్రం అనే వాదం, చైనీయులు అసాధారణులనే వాదం– చైనీయులు మిగతా వారందరి కంటే భిన్నమైన, ఉన్నతమైన వారు అనే వాదం. అన్నిటికంటే ముఖ్యమైన తర్కం ఆర్థికాభివృద్ధి అని డెంగ్‌ జియా వోపింగ్‌ 1980లో పేర్కొన్నాడు. చైనా ఆర్థిక వేత్తలు దీనిని జీడీపీ వాదంగా వర్ణిస్తుంటారు. స్వతంత్రం, స్వయంప్రతిపత్తి, స్వయం సమృద్ధి ఉండాలని మావో నొక్కి చెప్పేవాడు. మాతృభూమిపై వాంగ్‌ షేన్‌ రచించిన  భావగీతం చైనాలో ప్రఖ్యాత దేశభక్తి గీతం. 

పర్వతాలు, మైదానాలు, యాంగ్సీ, హుయాంగ్‌ నదులతో కూడిన ప్రియమైన మన మాతృభూమి అందమైనది, వైభవోపేత మైనది అని ఆ పాటలో ఉన్న వర్ణన చైనీయుల మనస్సులలో గాఢంగా  నాటుకుపోయింది. చైనా కేంద్రక వాదం చైనాలో ప్రబలంగా ఉంటుంది. మూడవది, చైనీయులు అసాధారణమనే వాదం. ఇతరుల నుంచి నేర్చుకోవటాన్ని చైనా విశ్వసించదు. సమస్యల పరిష్కారం కోసం సొంత జ్ఞానాన్నే వాడాలని  చైనా నాయకులు పదేపదే చెపుతుం టారు. చైనీయుల జాతీయవాద ప్రపంచ దృక్కోణం రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో జర్మనీ దృక్పథాన్ని పోలిఉంది. 1930 లలో జర్మన్‌ జాతి పరమైన ఆధిపత్యం, చరిత్రాత్మక హక్కులను ప్రస్తా వించటం, జాతిపరంగా తాము సర్వోత్తమమనే భావం తెలిసిందే. 

అంతకుముందు చెకోస్లోవేకియాకి చెందిన సుదేటెన్లాండ్‌ అనే జర్మన్‌ భాష మాట్లాడే ప్రాంతాన్ని హిట్లర్‌ ఆక్రమించినపుడు ఐరోపా అతడిని ఎదుర్కోవటానికి బదులుగా సంతృప్తిపర్చడానికి ప్రయ త్నించింది. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి ఐరోపా  దేశాలు హిట్లర్‌తో మ్యూనిచ్‌ ఒప్పందం కుదరటంతో సంబరపడుతుండగా, నాటి అమె రికా అధ్యక్షుడు రూజ్వెల్ట్, మీ ఈ చర్య యావత్‌ మానవాళికి మీరు చేసిన అసాధారణ చారిత్రాత్మక సేవగా కోటానుకోట్ల ప్రజలు గుర్తిస్తా రని హిట్లర్‌ను పొగిడాడు. ఇక మీదట ఆక్రమణలకు పాల్పడనని చేసిన వాగ్దానాన్ని దురదృష్టవశాత్తు ఒప్పందం కుదిరిన సంవత్సరం లోపే హిట్లర్‌ ఉల్లంఘించటంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యింది. 1939–40 కాలంలో బ్రిటన్‌ ఏ పరిస్థితిలో ఉందో ప్రస్తుతం అమెరికా అదే పరిస్థితిలో ఉంది. అమెరికాలోని రాష్ట్రాలను కరోనా వైరస్‌ బీభత్సానికి గురిచేసిన తరువాతగానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మేల్కొనలేదు. కరోనా వైరస్‌ అమెరికాలో విజృంభిం చనున్నదనే హెచ్చరికలు చేసే వారిని పట్టించుకోవద్దంటూ ఫిబ్రవరి 28నాడు దక్షిణ కరోలినాలోని తన మద్దతుదారులను ట్రంప్‌ కోరారు. మీడియా హిస్టీరియాతో ప్రవర్తిస్తున్నదని చెబుతూ, కరోనా వైరస్‌ ప్రబ లబోతున్నదంటూ మీడియా పేర్కొనటాన్ని గాలివార్తలుగా ట్రంప్‌ కొట్టిపారేశాడు. చైనా ప్రతిపాదించిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రణా ళికలోని లాభాల కోసం చైనాను కౌగలించుకొన్న ఐరోపా దేశాలు కరోనా వైరస్‌ ప్రభావాన్ని కట్టడి చేయటానికి కష్టపడుతున్నాయి.

ఈ మహమ్మారిని ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాలు సమర్థ వంతంగా ఎదుర్కోగలగటం గమనార్హం. సగటున ఒక రోజులో అమె రికా కంటే ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపిన దక్షిణ కొరియా అందరికంటే ముందు నిలబడింది. సింగపూర్‌ విస్తృతంగా పరీక్షలు జరుపుతూ వైరస్‌ లక్షణాలను కనుగొనే భారీ ప్రయత్నం చేసింది. గతంలో సార్స్‌ వైరస్‌ కారణంగా మరణాలను చవిచూసిన అను భవంతో హాంకాంగ్‌æ, తైవాన్‌లు  కరోనా వైరస్‌ని సమర్థవంతంగా కట్టడి చేయటానికి సమయోచిత చర్యలు తీసుకున్నాయి. కోవిడ్‌– 19ను ఎదుర్కోవడంలో ప్రజాస్వామ్య క్రియాశీలత కనపరచి భారత దేశం మిగతా వారికి ఓ ఉదాహరణగా నిలిచింది.  పూర్తి స్థాయి ప్రజా మద్దతుతో లాక్‌ డౌన్‌ అమలు పరచటం, భౌతిక దూరం పాటించే నిరోధక చర్యలు తీసుకోవటం ద్వారా ప్రధాన మంత్రి సహచరులతో పాటుగా ముందుండి దేశాన్ని నడిపిస్తున్నారు. 

నూట ముప్పై కోట్ల ప్రజలున్న దేశంలో మే ఒకటి నాటికి 35,365 యాక్టివ్‌ కేసులు  నమోదై ఉన్నాయి. ఉద్దేశపూర్వక కవ్వింపు చర్యలు, ఇస్లామోఫోబియా అనే తప్పుడు ప్రచారాలను ఎదుర్కొన్నప్పటికీ మోదీ ఎటువంటి ఏకపక్ష, నిరంకుశ చర్యలకు ఉపక్రమించలేదు. కవ్వింపు చర్యలు ఎదురుగా కనపడుతున్నప్పటికీ మోదీ నిబ్బరంగా, శాంతంగా, ఆశావాద దృక్పథం కనపరచారు.  దూరదృష్టి కల నేతల నేతృత్వంలోని ప్రజాస్వామ్య దేశాలు ఇటువంటి సవాళ్ళను ఉదార వాద విలువల విషయంలో రాజీ పడకుండా ఎదుర్కోగలవని నిరూపించారు. ఇప్పుడిప్పుడే ఆవిష్కృతమవుతున్న నూతన ప్రపంచ క్రమంలో, మోదీ సూచించిన ‘మానవ కేంద్రక అభివృద్ధి సహకారం’ ఆధారంగా నూతన ప్రపంచ వ్యవస్థను నిర్మించటంలో అమెరికా, జర్మనీ దేశాలతో కలిసి భారత్‌ నిర్ణయాత్మక పాత్ర పోషించగలదు. 

పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక విజ్ఞానం, ప్రజా స్వామ్య ఉదారవాదం ఆధార స్తంభాలుగా కొత్త ప్రపంచ వ్యవస్థ సంస్థాగత నియమావళి ప్రకటించే సమయం ఆసన్నమౌతోంది. అంతర్గతంగా అశాంతిని, అంతర్జాతీయంగా నిందలు ఎదుర్కొంటు న్నప్పటికీ చైనాకు ఒక అవకాశం ఉన్నది. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ వాడు కలో ‘లూక్సియాన్‌ డౌజ్హేంగ్‌’ అనే పదబంధం ఉంది. దాని అర్థం ఆకృతి, విధానం నిర్ధారించే పోరాటం. అధికారం కోసం పోరాటం అని కొందరు అర్థం చేసుకున్నప్పటికీ, పార్టీ కొత్త విధానాన్ని నిర్ణయించే పోరాటం అనే అర్థం సైతం ఉన్నది. అటువంటి పోరాటాలు గతంలో ఎన్నో జరిగాయి. నేటి ప్రపంచం అటువంటి మెరుగైన పోరాటం కోసం ఆశించవచ్చా?

రాం మాధవ్‌ 
వ్యాసకర్త భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి 
ఇండియా ఫౌండేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సభ్యులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top