నైపుణ్యం కట్టుకోండి..

Weekly Cover Story In Sakshi Funday

కవర్‌ స్టోరీ

నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం 

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనం అక్షరాస్యతలో అభివృద్ధి సాధించాం. చాలా అంశాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లే, అక్షరాస్యతలో సాధించిన అభివృద్ధిలోనూ వ్యత్యాసాలు ఉన్నాయి. మనదేశంలో కొన్ని ప్రాంతాలు అక్షరాస్యతలో గణనీయమైన అభివృద్ధినే సాధించినా, మరికొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ఇంకా వెనుకబడే ఉన్నాయి. అక్షరాస్యత పెరిగిన కారణంగా, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యావంతుల సంఖ్య పెరుగుతోంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి ఏటా బయటకు వచ్చే పట్టభద్రుల సంఖ్య పెరుగుతోంది. స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో అక్షరాస్యత తక్కువగానే ఉన్నా, అప్పట్లో పట్టభద్రులైన వారు తక్కువ మందే అయినా, వారిలో చదువుకు తగిన నైపుణ్యాలు ఉండేవి. ఇప్పటి పట్టభద్రుల చేతికి పట్టాలైతే వస్తున్నాయి గాని, వారిలో చదువుకు తగిన నైపుణ్యాలే కొరవడుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వాలే తగిన చర్యలు ప్రారంభించి పుణ్యం కట్టుకోవాలి.

మన దేశంలో ఇప్పటికీ పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్న వారు సైతం చిన్న చిన్న ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. దేశంలో ఒకప్పుడు ఉన్నంత దారుణమైన నిరుద్యోగ పరిస్థితులు లేకపోయినా, ఇంజనీరింగ్, టెక్నాలజీ గ్రాడ్యుయేట్లు సైతం అటెండర్‌ స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్న ఉదంతాలు ఉంటున్నాయంటే పరిస్థితులను ఊహించుకోవాల్సిందే.

వాళ్లు ఉద్యోగాలకు పనికిరారు...
మన దేశంలో కార్పొరేట్‌ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. ప్రభుత్వాల చొరవతో బహుళజాతి సంస్థలు సైతం ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ సంస్థలన్నింటికీ పెద్దసంఖ్యలోనే వివిధ నైపుణ్యాలకు సంబంధించిన ఇంజనీరింగ్‌ పట్టభద్రులు పెద్దసంఖ్యలో అవసరం. మన దేశంలో ఐఐటీ వంటి ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలు, ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలలే కాకుండా, పెద్దసంఖ్యలో ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల నుంచి ఏటా లక్షలాది సంఖ్యలో ఇంజనీరింగ్‌ పట్టభద్రులు పుట్టుకొస్తున్నారు. వీరి చేతుల్లో పట్టాలైతే ఉంటున్నాయి గాని, వీరు పొందిన పట్టాలకు తగిన నైపుణ్యాలే కొరవడుతున్నాయి. మన దేశంలో తయారవుతున్న ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో దాదాపు 80 శాతం మంది ఉద్యోగాలకు పనికిరారని, వారిలో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలు బొత్తిగా లేవని, ‘నాలెడ్జ్‌ ఎకానమీ’లో వారు ఇమడటం సాధ్యం కాదని ‘ఆస్పైరింగ్‌ మైండ్స్‌’ విడుదల చేసిన ‘యాన్యువల్‌ ఎంప్లాయబిలిటీ సర్వే–2019’ నివేదిక కుండ బద్దలు కొట్టింది.

ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు కోడ్‌ రాసే నైపుణ్యం కీలకం. మన దేశంలో చక్కగా కోడ్‌ రాయగలిగే ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు కేవలం 4.6 శాతం మంది మాత్రమే. పొరుగు దేశమైన చైనా ఈ విషయంలో మరీ అధ్వానంగా ఉంది. అక్కడి ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో మంచి కోడ్‌ రాయగలిగేవారు 2.1 శాతం మంది మాత్రమే. అమెరికన్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో మంచి కోడ్‌ రాయగలిగే వారు 18.8 శాతం మంది వరకు ఉంటున్నారు. చైనా కంటే మెరుగ్గా ఉన్నామని చంకలు గుద్దుకోవాలో, అమెరికా కంటే వెనుకబడినందుకు ఆవేదన చెందాలో మన విద్యావ్యవస్థను శాసిస్తున్న ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలి.

వివిధ రంగాలకు చెందిన ఇంజనీర్లలో ఉద్యోగాలకు పనికొచ్చేవారి సంఖ్య అత్యంత దయనీయంగా ఉన్నట్లు ‘యాన్యువల్‌ ఎంప్లాయబిలిటీ సర్వే–2019’ నివేదికలో బయటపడింది. కీలకమైన రంగాల్లో మన ఇంజనీర్ల ఎంప్లాయబిలిటీ పరిస్థితిపై ఈ నివేదిక వెల్లడించిన గణాంకాలు ఇవీ...మిగిలిన విభాగాల్లో కూడా మన ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లది ఇదే పరిస్థితి. ఎంపిక చేసుకున్న కీలక అంశాల్లోనే కాదు, కనీసం విషయాన్ని ఆకళింపు చేసుకునే నైపుణ్యాలు, సమర్థంగా ఉద్యోగాలు చేయడానికి అవసరమైన భాషా నైపుణ్యాలలో కూడా మన ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు దారుణంగా వెనుకబడి ఉంటున్నారు.

దేశవ్యాప్తంగా మన ఇంజనీరింగ్‌ విద్య ఎక్కువగా ‘థియరీ’ చదువుకోవడం వరకు మాత్రమే పరిమితమవుతోంది. దాదాపు సగానికి సగం మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు ప్రాక్టికల్‌ శిక్షణకు నోచుకోవడం లేదు. కేవలం 40 శాతం మంది మాత్రమే ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుకుంటున్నారు. మిగిలిన 60 శాతం మందికి ఇంజనీరింగ్‌లోని మౌలిక అంశాలు సంబంధిత పరిశ్రమలలో ఎలా ఉపయోగపడతాయనే దానిపై కనీసమైన అవగాహన కూడా ఉండటం లేదు.

పురోగతి అక్షరాస్యతకే పరిమితం
మనం సాధించిన పురోగతి అంతా అక్షరాస్యతకే పరిమితం. అక్షరాలు కూడబలుక్కుని చదవడం, చేతినంతా కూడదీసుకుని సంతకం చేయడం వస్తే చాలు, అక్షరాస్యుల జాబితాలో చేరిపోవడానికి. అక్షరాస్యతపై రూపొందించుకున్న గణాంకాలకు విద్యా నాణ్యత గురించి ఎలాంటి పట్టింపులూ లేవు. వయోజనుల్లోను, యువజనుల్లోను అక్షరాస్యతపై ‘యూనెస్కో’ 2015లో విడుదల చేసిన  గణాంకాలు ఇవీ..చైనా సంగతి సరే, మన కంటే ఆర్థికంగా, సాంకేతికంగా వెనుకబడిన శ్రీలంక, మయాన్మార్‌లాంటి చిన్న దేశాలు సైతం అక్షరాస్యతలో మనకంటే ముందంజలో ఉన్నాయి. యువజన అక్షరాస్యతలో నేపాల్‌ మనకంటే ముందంజలో ఉందని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.

ప్రపంచానికి కావలసినవి నైపుణ్యాలే!
శాస్త్ర సాంకేతిక పురోగతి శరవేగం పుంజుకున్న నేపథ్యంలో ఇప్పటి ప్రపంచానికి కావలసినవి నైపుణ్యాలే! ఉద్యోగాలు పొందాలంటే, వాటికి కావలసిన నైపుణ్యాలు కచ్చితంగా ఉండి తీరాలి. నైపుణ్యాలతో పనిలేని లేదా అరకొర నైపుణ్యాలు సరిపోయే ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అతి తక్కువ నైపుణ్యాలతో నెట్టుకొచ్చే ఉద్యోగాల సంఖ్య 2010 నాటికి 74 శాతం ఉంటే, 2020 నాటికి ఈ ఉద్యోగాలు 62 శాతానికి పడిపోతాయని అంచనా.

మరోవైపు తగిన నైపుణ్యాలు గల ఉద్యోగుల అవసరం విపరీతంగా పెరుగుతోంది. వచ్చే ఏడాది నాటికి వివిధ రంగాల్లో నైపుణ్యాలు గల ఉద్యోగులు దాదాపు 1.80 కోట్ల మంది అదనంగా అవసరమవుతారు. ఇదే సమయానికి భారత్‌లో 4.70 కోట్ల మంది కార్మికులు చేతిలో పని లేకుండా పోయే పరిస్థితులు ఉన్నాయని, వీళ్లంతా ఎలాంటి నైపుణ్యాలూ లేనివాళ్లే అయి ఉంటారని ‘అప్‌గ్రేడ్‌’ సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలింది. పని కోల్పోయే ఈ మిగులు కార్మికులకు పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలలో తగిన శిక్షణ కల్పించి, వారిని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఎలా అన్నదే భారత్‌ ముందు ఉన్న సవాలు అని ‘అప్‌గ్రేడ్‌’ సంస్థ తరఫున అధ్యయనం చేపట్టిన ఆర్థిక శాస్త్రవేత్తలు మయాంక్‌ కుమార్, అపూర్వ శంకర్‌ చెబుతున్నారు. 

మిగిలిన గ్రాడ్యుయేట్లదీ అదే పరిస్థితి
మన ఇంజనీర్ల పరిస్థితి సరే, దేశంలోని మిగిలిన గ్రాడ్యుయేట్లలో కూడా ఉద్యోగాలకు పనికొచ్చేవారు తక్కువగానే ఉంటున్నారు. బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి సాధారణ డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లలో కేవలం 25 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలకు అవసరమయ్యే నైపుణ్యాలు ఉంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో దాదాపు 48 శాతం సంస్థలు తమ తమ సంస్థల్లో ఖాళీ పోస్టులను నింపడం కష్టంగా ఉందని చెబుతుంటే, ఆ పోస్టులకు కావలసిన నైపుణ్యాలు గల గ్రాడ్యుయేట్లే కరువవుతున్నారని వాపోతున్నాయి, ఈ పరిస్థితుల్లో మన గ్రాడ్యుయేట్లకు తగిన నైపుణ్యాలలో శిక్షణ కల్పిచేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టకపోతే, వీరంతా నిరుద్యోగులుగా మిగిలిపోయి, దేశానికి పెనుభారమయ్యే పరిస్థితులు తలెత్తుతాయి.

దేశ ఆర్థిక పురోగతికి ఇదెంత మాత్రం క్షేమం కాదని ఆర్థిక, సామాజిక నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్న భారత్‌కు ఈ పరిస్థితి పెద్ద అవరోధం కాగలదని కూడా వారు చెబుతున్నారు. మన పట్టభద్రులకు, మిగులు కార్మిక శక్తికి పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలను కల్పించే రీతిలో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుకోకుంటే, ఆర్థిక రంగంలో మనకు వెనుకబాటు తప్పదని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నైపుణ్యాల కొరత ఎందుకంటే..?
మన దేశంలో నైపుణ్యాల కొరతకు ప్రధాన కారణం విద్యా వ్యవస్థ వైఫల్యమే. ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన బోధన, శిక్షణ లభించడం లేదు. చాలా చోట్ల పాఠశాలల్లో ఎనిమిదో తరగతి, ఆపై తరగతులు చదివే వారిలో 25 శాతం మంది విద్యార్థులు వాక్యాలను చదవలేని స్థితిలో, ప్రాథమికమైన లెక్కలు చేయలేని స్థితిలో ఉన్నారని ‘ఏన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌’ (ఏఎస్‌ఈఆర్‌) ఈ ఏడాది ప్రారంభంలోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు విపరీతంగా పెరిగినా, ఇవేవీ విద్యా నాణ్యతను ఆశించిన స్థాయిలో మెరుగుపరచలేకపోతున్నాయి. గుజరాత్, హర్యానా, అస్సాం, కేరళ వంటి కొద్ది రాష్ట్రాల్లోని విద్యార్థుల అధ్యయన ప్రమాణాలు, నైపుణ్యాలు మెరుగుపడినా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో విద్యార్థుల అధ్యయన ప్రమాణాలు, నైపుణ్యాలు ఇదివరకటి కంటే దిగజారాయి. ఉత్తరప్రదేశ్‌లోనైతే మూడో తరగతి విద్యార్థుల్లో ఎక్కువశాతం మంది చిన్న చిన్నపదాలను కూడబలుక్కునైనా చదవలేని స్థితిలో ఉన్నారు.

సర్వశిక్షా అభియాన్, మాధ్యమిక శిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, విద్యా హక్కు చట్టం వంటి వాటి ఫలితంగా పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా పెరిగినా, విద్యార్థుల్లో అధ్యయన ప్రమాణాలు, నైపుణ్యాలు కనీస స్థాయిలోనైనా మెరుగుపడకపోవడం విచారకరం. గణాంకాల్లో వీళ్లంతా అక్షరాస్యులుగానే నమోదవుతున్నారు. మన అక్షరాస్యత గణాంకాల్లో కనిపిస్తున్నదంతా వాపు మాత్రమే తప్ప బలుపు ఎంతమాత్రం కాదని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచలేని మన విద్యావ్యవస్థలోని లోపాలకు వారు చెబుతున్న కొన్ని ప్రధాన కారణాలు ఇవీ..

  • శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత
  • ప్రాథమిక స్థాయిలో నాసిరకం బోధన
  • నిరుపేద నిరక్షరాస్యుల కుటుంబాలకు చెందిన పిల్లలకు లభించని ప్రోత్సాహం
  • ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కావలసిన కనీస పాఠ్యపరికరాల కొరత
  • పాఠశాలల్లో పిల్లలకు బొమ్మల కథల పుస్తకాలు అందుబాటులో లేకపోవడం
  • సృజనాత్మక అధ్యయనానికి కావలసిన కనీస వసతుల కొరత
  • క్లిష్టమైన విషయాలను విద్యార్థులకు సరళంగా బోధించలేకపోతున్న ఉపాధ్యాయులు
  • బోధనలో నిమగ్నం కావలసిన ఉపాధ్యాయులను ప్రభుత్వాలు ఇతరేతర అవసరాలకు వాడుకోవడం.
  • విద్యా వ్యవస్థను సమూలంగా మెరుగుపరచడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించకపోవడం.
  • వృత్తి విద్యా శిక్షణకు ప్రభుత్వాలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం.

సాధించాల్సింది చాలానే ఉంది
స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశంలో అక్షరాస్యులు కేవలం 18 శాతం మాత్రమే. ఇప్పుడు అక్షరాస్యుల సంఖ్య 74 శాతానికి చేరుకుంది. దేశంలోని పిల్లల్లో దాదాపు 95 శాతం మంది పాఠశాలలకు వెళుతున్నారు. అలాగని దేశంలోని అక్షరాస్యులందరికీ ఉపాధికి కావలసిన నైపుణ్యాలు ఉన్నాయని చెప్పడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నట్లు వివిధ అధ్యయనాలు, పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. అలాగే పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతున్న పరిస్థితులు కూడా లేవు. ‘దేశంలోని 35 శాతం యువజనులు, వయోజనులు ఇంకా అక్షరాస్యతకు దూరంగానే ఉన్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నప్పటికీ, దాదాపు 40 శాతం విద్యార్థుల్లో కనీస అధ్యయన నైపుణ్యాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితి మన దేశానికి ఒక సవాలు. దీనిని గుర్తించి, ప్రణాళికాబద్ధంగా ఈ సమస్య పరిష్కారానికి సత్వరమే కృషిని ప్రారంభించాల్సి ఉంది’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’కు రాసిన ఒక ప్రత్యేక వ్యాసంలో పేర్కొనడం గమనార్హం.

నైపుణ్యాలలో టాప్‌–5 
ఆధునిక పరిస్థితుల్లో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలు గల కార్మిక శక్తి గల దేశాలలో మనం చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ విషయంలో టాప్‌–5 దేశాలు, ఆ దేశాల్లో నైపుణ్యాలు గల కార్మికశక్తిపై గణాంకాలు...
దేశం నిపుణులైన కార్మికులు

దక్షిణ కొరియా-    96 శాతం
జపాన్‌ -            80 శాతం
జర్మనీ -           75 శాతం
యూకే -          68 శాతం
అమెరికా  -       52 శాతం

మన దేశంలో నైపుణ్యాలు కలిగిన కార్మికుల సంఖ్య పట్టుమని పది శాతం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాలు కలిగిన కార్మికులు 38 శాతం ఉంటే, ప్రపంచవ్యాప్త సగటు కంటే మన దేశంలో నైపుణ్యాలు కలిగిన కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top