బహుళ కూటములతో ఎవరికి లబ్ధి?

Who Will Be Benefited Political Parties Alliances In India - Sakshi

జాతిహితం

దేశవ్యాప్తంగా ఇప్పటికీ బలంగా కనిపిస్తున్న బీజేపీ ఒకవైపున మరోవైపు వివిధ కూటముల ఏర్పాటుతో చీలిపోయి తలపడనున్న ప్రతిపక్షం మరోవైపుగా భారత రాజకీయాలు చీలిపోయాయి. బీజేపీని, కాంగ్రెస్‌ను తక్కువ స్థానాలకు పరిమితం చేస్తే  తామే దేశరాజధానిలో పీఠాన్ని కైవసం చేసుకోవచ్చని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి.  అయితే గతంలో దేవైగౌడ పాలనకు లాగా కాంగ్రెస్‌ మద్దతును వెలుపలనుంచి పొంది  అధికారంలోకి వచ్చే పరిస్థితి పునరావృతం అయేటట్లు కనిపించడంలేదు. పైగా ప్రతిపక్షాల కూటమి లోని అనైక్యత, స్వార్థ రాజకీయాలు, తామే అసలైన పెళ్లి కొడుకులం అని భావించే పరిస్థితి ప్రధాని మోదీ స్థానాన్ని బద్దలు చేయలేవు.

నేను రెండు దఫాలుగా పాతికేళ్లపాటు పని చేసిన పత్రికలో ఒక సుప్రసిద్ధమైన కథ రాజ్యమేలేది. ఆ పత్రిక దివంగత సంస్థాపకుడు రామ్‌నాథ్‌ గోయెంకాతో ముఖ్య స్నేహితుడొకరు ఒక సందర్భంలో మాట్లాడుతూ నీ సంపాదకుడి ఉద్యోగ కాంట్రాక్టును ఎందుకు పొడిగించ లేదని ప్రశ్నించారు. ‘‘ఆయన రుషితుల్యుడు లాంటివాడు. అలాంటి గొప్ప వ్యక్తిని నీవు ఎక్కువకాలం కొనసాగించకపోవడాన్ని నేను ఊహించలేకపోతున్నాను’’ అని ఆ స్నేహితుడు వ్యాఖ్యానించారు. ‘‘భాయీ, ఆయన సెయింట్‌ జార్జి వర్గీస్, కాదనను. కానీ నా పత్రిక మహాశివుడి పెళ్లి ఊరేగింపు (శివ్‌జీ కీ బారాత్‌) వంటిది. ఎవరికివారు తామే పెళ్లికొడుకులుగా భావించే అలాంటి ఊరేగింపును ఒక రుషి నిర్వహించడం చాలా కష్టం’’ అని ఆ పత్రికాధిపతి అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇప్పుడు మహాశివుడి పెళ్లి ఊరేగింపు అనేది తమకిష్టమైనది తిని తాగి, ఊగిపోతూ చిందులేస్తున్న నానావిధమైన ప్రాణులు, దయ్యాలు, ఆత్మలు, భూతాలు, మంత్రగత్తెలు వంటి సంతోషకరమైన గుంపునకు సంకేతంగా మారింది. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీల వ్యవహారం దీనికి భిన్నంగా ఉందేమో దయచేసి నాకు చెప్పండి. అదే సమయంలో మహాశివుడి పెళ్లి ఊరేగింపు ఇప్పటికీ క్రమపద్ధతిలోనే ఉండటానికి కారణం లేకపోలేదు. పెళ్లికొడుకు కాబోతున్న మహా శివుడి స్థాయి, ప్రశ్నించడానికి వీలులేని నాయకత్వమే దానికి కారణం. దాని ఆధునిక రూపంలో ప్రతి ఊరేగింపూ ఒక పెళ్లివేడుకగా మారనుంది. ఇటీవల ముగిసిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన వ్యూహకర్తలు చిరునవ్వులు చిందిస్తున్నారంటే తమ నాయకత్వానికి భవిష్యత్తులోనూ ప్రమాదం లేదనిపించడమే కారణం.

ఇప్పుడు విషయానికి వద్దాం. ఒకవైపున భారతదేశ అత్యంత ప్రముఖమైన నూతన శివ–భక్త పార్టీ అయిన కాంగ్రెస్‌ నేతృత్వంలో తగుమాత్రపు విశ్వసనీయతతో కూడిన నాలుగు పార్టీల కూటమి ఉంది. అవేమిటంటే శరద్‌ పవార్‌ ఎన్సీపీ, ఎంకె స్టాలిన్‌ డీఎంకే, లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఆర్జేడీ, హెచ్‌డీ దేవేగౌడకు చెందిన జేడీ(ఎస్‌) పార్టీలు. ఎన్డీయేని మొదటి కూటమిగా భావిస్తే, దీన్ని రెండో కూటమిగా లెక్కిద్దాం. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలు తమ సొంత ఘటబంధన్‌తో తమదైన మార్గంలో వెళుతున్నాయి. పరిస్ధితులు ఇలాగే ఉంటే ఈ రెండు పార్టీలు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ రెండింటిపైనా ఎన్నికల ప్రచారంలో దాడులకు తలపడనున్నాయి. మన సౌకర్యం కోసం దీన్ని మూడో ఫ్రంట్‌ అని పిలుద్దాం.ఇక మమతా బెనర్జీ బలప్రదర్శనతో మరొక కూటమి ప్రదర్శితమవుతోంది. ఈ కూటమిలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీతో పాటు డీఎమ్‌కే, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ వంటి పలు ప్రాంతీయ పార్టీలు భాగమై ఉన్నాయి. దీన్ని ఒకరకంగా నాలుగో కూటమిగా భావించవచ్చు.ఇకపోతే, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌ కూటములకు దేనికీ చెందకుండా ప్రత్యేకంగా ఉంటున్న కూటములు కూడా ఇప్పుడు రంగంలోకి వస్తున్నాయి. ఏదో ఒక సందర్భంలో ఇవి ముందుపీఠికి రావడానికి వేచి చూస్తున్నాయి. ఈ విధంగా ఐదో, ఆరో, ఏడో కూటమిలకు కూడా తావు ఉంటుంది. చివరిగా వామపక్షాలు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు వీటిని ఎవరూ కోరుకోవడం లేదు. ఇప్పుడు దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటి స్ధితి ఇదే. వీటిని పెళ్లికొడుకు లేని ఊరేగింపుగా చెప్పవచ్చు.

కాంగ్రెస్‌ను మినహాయిస్తే వీటిలో ఏ ఒక్క పార్టీ కూడా 50 లోక్‌సభ స్థానాలను సాధించే పరిస్థితి లేదు. వీటి ఆశ ఏమిటంటే బీజేపీని 170 స్థానాలలోపు, కాంగ్రెస్‌ని 100 స్థానాలలోపు కుదించివేయదలచడమే. ఇది సాధ్యమైతే ఈ పార్టీలన్నీ ఒక కూటమిగా మారి కాంగ్రెస్‌ పార్టీనీ వెలుపల ఉండి మద్దతు తెలిపేలా చేస్తాయి. గతంలోనూ ఇలాంటి సినిమానూ మనం దేవేగౌడ యునైటెడ్‌ ఫ్రంట్‌ రూపంలో చూశాం. ఇలాంటి స్థితి సాధ్యమైతే, కాంగ్రెసేతర పార్టీలు ఎంత చిన్నవిగా ఉన్నప్పటికీ లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో పాదం మోపడానికి తమవంతుగా ప్రయత్నిస్తాయి. కారణం ఒకటే. మాజీ ముఖ్యమంత్రిగా ఉండటం కంటే మీ జీవితం చివరలో మాజీ ప్రధానమంత్రిగా ఉండటం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కదా. 1996లో దివంగత సీపీఎం నేత హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ ఇలాగే దేవేగౌడకు అలాంటి స్థానమే కల్పించారు. ఈరోజు ప్రతి పక్షం నేను కూడా దేవేగౌడను అవుతాను అని ఆశలు పెట్టుకుంటోంది.  అయితే 1996లో సంభవించిన పరిణామాలను భారత్‌ 2019లో పునరావృతం చేసేలా కనిపించడం లేదు. దీనివల్లే బీజేపీలో మీరు ఆత్మవిశ్వాసంతోపాటు కాసిన్ని చిరునవ్వులను కూడా మనం చూడగలుగుతాం. ఈ వేసవిలో జరుగునున్న సార్వత్రిక ఎన్నికలు ఇటీవలే ముగిసిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, అలాగే తాము గత కొందకాలంగా ఉపఎన్నికల్లో పొందుతూ వస్తున్న వరాజయాలను ప్రతిబింబించవని మోదీ, ఆయన వ్యూహకర్తలు బలంగానే నమ్ముతున్నారు.

పైగా, ప్రతిపక్షాల అనైక్యత, పరస్పరం ప్రయోజనాల మధ్య ఘర్షణ, వ్యక్తిగత శత్రుత్వాలు, వీటన్నిటికీ మించి మోదీ హఠావో అనే ఏకసూత్ర అజెండా కారణంగా భారత్‌ మరోసారి ఇందిరాగాంధీ వర్సెస్‌ ఇతరులు అనే 1971 నాటి పరిస్థితుల వైపునకు చేరబోతోందని బీజేపీ నమ్ముతోంది. అప్పట్లోనూ ఇందిరా గాంధీకి పరాజయం తప్పదని ఎన్నికల విశ్లేషకులు ప్రకటించారు కానీ ‘గరీబీ హఠావో’ కావాలా లేక ‘ఇందిరా హఠోవో’ కావాలా ఏదో ఒకటి తేల్చుకోండి అనే నినాదంతో ఇందిర నాటి ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ లేక ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే మీరు ప్రజావ్యతిరేకతకు ఎదురొడ్డవచ్చు. మీ పార్టీలో ఉంటున్న ఇద్దరు లేక ముగ్గురు పోటీదారుల గురించి ఓటర్లకు స్పష్టంగా తెలుసు. పైగా వ్యక్తిగత విశ్వాసాల ప్రాతిపదికన ఓటర్లు పెద్దగా చీలిపోవడం కూడా తటస్థించదు. కానీ జాతీయ స్థాయిలో మేం మోదీకి వ్యతిరేకంగా పోరాడుతూనే, అదేసమయంలో మాలో మేముకూడా పోట్లాడుకుంటాం  అంటే అది ప్రమాదకర ఫలితాలకు దారితీస్తుంది. ‘వీరిలో మీ కొత్త దేవేగౌడ ఎవరై ఉంటారు’ అంటూ మోదీ దాన్నే ఒక ఎన్నికల ప్రచారంగా మార్చేస్తారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేతలను తునాతునకలు చేస్తారు కూడా.

ఈ 2019 సంవత్సరాన్ని బీజేపీ 1971తో పోలుస్తున్నా–నిజానికి రెండు కారణాలరీత్యా ఆ పార్టీకి అంతకన్నా మెరుగైనదని చెప్పవచ్చు. 1971 మాదిరిగా కాక ఈసారి అత్యధిక స్థానాలు ప్రాంతీయ పార్టీలకు దక్కుతాయి. వీటిలో ద్రవిడ పార్టీలు మొదలుకొని మాయావతి, ఆఖరికి మమత వరకూ చర్చించదగిన స్థాయిలో ఎవరికీ సైద్ధాంతిక జంజాటం లేదు. వారు కాంగ్రెస్, బీజేపీల్లో దేనితోనైనా భాగస్తులు కాగలరు లేదా వ్యతిరేకించగలరు. ఎవరితోనైనా జట్టు కట్టగలరు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఏ పార్టీకైనా మొత్తం 543 స్థానాల్లో 350 అవసరమవు తాయి. 300 కన్నా తక్కువ వస్తే కొత్త అవకాశాల అన్వేషణ మొదలవు తుంది. 275 కన్నా తగ్గితే ప్రాంతీయ పార్టీల శక్తి రెండింతలవుతుంది. అప్పుడు ఆ పక్షాలు బీజేపీతో కూడా జత కట్టగలవు.రెండు–1971లో, ప్రత్యేకించి హిందీ రాష్ట్రాల్లో ప్రధానమైన ప్రతి పక్షాలన్నీ కేవలం కాంగ్రెస్‌ వ్యతిరేకతపై మాత్రమే ఒకటి కాగలిగేవి. ఇవాళ బీజేపీ ఇజంపై గట్టి వ్యతిరేకత ఉందన్న మాట వాస్తవమే అయినా దానికి పోటీగా కాంగ్రెస్‌ వ్యతిరేకత కూడా నిలిచి ఉందని మరిచిపో రాదు. ఎవరికీ మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడితే 50లోపు స్థానాలుండి కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని కలలుగనే నేతలకు అది మంచి అవకాశమవుతుంది. దీన్ని బలంగా చెబుతున్నవారు తెలం గాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.ఇప్పుడు ఈ లెక్కలు మీకొక విషయాన్ని చెబుతాయి.

బీజేపీ, కాంగ్రెస్‌లకు కలిసి 250 కన్నా తక్కువ వచ్చినా మిగిలిన పార్టీలు 272కి చేరుకునే అవకాశం లేదు. వారికి ఖచ్చితంగా ఆ రెండు పార్టీల్లో ఏదో ఒకటి బయటినుంచి మద్దతివ్వాల్సిందే. దానర్థం– వీపీ సింగ్, చంద్రశేఖర్, హెచ్‌డీ దేవెగౌడ తరహాలో రోజుకూలీ ప్రధానులు మళ్లీ వస్తారన్నమాట. మోదీ, రాహుల్‌ మినహా మరే నాయకుడూ 50 స్థానాలకు మించి సంపాదించలేరు గనుక బీజేపీయేతర, కాంగ్రెసేతర నాయకుడెవరినీ ఎవరూ ఏడాదికి మించి భరించే అవకాశం లేదు. అలాంటి ప్రభుత్వం అల్లరల్లరిగా సాగే ‘శివ్‌జీ కీ బారాత్‌’ తరహాలోనే ఉంటుంది. నాయకుడు లేదా పెళ్లి కొడుకు లేని ఆ ఏర్పాటు చాలా త్వరగానే ముగిసిపోతుంది. గుర్తుంచుకోండి, రుషి తుల్యుడు జయ ప్రకాశ్‌ నారాయణ్‌లాంటి నాయకుడే 1979లో ఈమాదిరి గుంపును ఎన్నాళ్లో ఒకటిగా ఉంచలేకపోయారు. అంతిమంగా, ప్రతిపక్షం ఇలాగే నాయకుడు లేని రూపంలోనే ఎన్నికలకు వెళతామని పట్టుబట్టిందనుకోండి. అప్పుడు మోదీకి ఈ స్క్రిప్టునే పెద్దగా ఓటర్లకు చదివి వినిపిస్తే సరిపోతుంది. ఓటర్లు మోదీ మాటలను చాలావరకు శ్రద్ధగా వింటారు కూడా. ఒకవేళ అలా జరగకుండా ప్రతిపక్షాల కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలల అద్భుతాన్ని పునరావృతం చేసిన పక్షంలో, మరో 50 ఏళ్లపాటు బీజేపీనే అధికారంలో ఉంటుందనిగొప్పగా చెప్పుకునే అవకాశాన్ని అమిత్‌ షాకు మరోసారి ఇస్తుంది.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top