నా బిడ్డ పేరుతో ఒక చట్టం రావాలి 

The sudden death of Amar Palthe in duty in the Indian Navy - Sakshi

భారతీయ నౌకాదళంలో విధి నిర్వహణలో ఉన్న తన కుమారుడి ఆకస్మిక మరణం వెనుక అంతుచిక్కకుండా ఉన్న కారణాలను వెల్లడించాలని పాతికేళ్లుగా ఒంటరి న్యాయపోరాటం చేస్తున్న మాతృమూర్తి అనూరాధ పాల్థేకు ఎట్టకేలకు కొద్దిపాటి ఊరట లభించింది. ఈ కేసును తక్షణం సి.బి.ఐ. విచారణకు అప్పగిస్తూ గత సోమవారం హైదరాబాద్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర థాణే జిల్లా డోంబివలిలో ఉంటున్న అనూరాధ పాల్థే తనను కలిసిన ‘సాక్షి’ ప్రతినిధులతో తన  ఆవేదనను పంచుకున్నారు. 

అసలేం జరిగింది?
పాతికేళ్ల క్రితం.. ఇండియన్‌ నేవీలో చేరిన అమర్‌ పాల్థేకి సీ మ్యాన్‌ 1గా కాకినాడ తీరప్రాంతంలో పోస్టింగ్‌ వచ్చింది. 1993 సెప్టెంబర్‌ 21 న అమర్, తక్కిన సీ మెన్‌.. నేవీ శిక్షణలో భాగంగా హెలికాప్టర్‌ నుంచి సముద్ర తీరంలోకి దుమికి ఒడ్డుకు చేరే విన్యాసాన్ని ప్రదర్శిస్తుండగా, సముద్రంలోకి పడిపోయిన అమర్‌ తిరిగి ఒడ్డుకు చేరలేదు. రెండు రోజుల తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది. పోస్ట్‌మార్టమ్‌లో వైద్యులు అతడి తలపై గాయాలు ఉండడం గమనించినప్పటికీ, అవి ఘటనకు ముందు నుంచే ఉన్న దెబ్బలని గుర్తించడంతో అమర్‌ మరణం అనుమానాస్పదం అయింది. దీనిపై అమర్‌ తల్లి అనూరాధా అశోక్‌ పాల్థే విచారణకు పట్టుపట్టారు. కాకినాడ పోర్ట్‌ పోలీసులు, నేవీల అంతర్గత దర్యాప్తు సంస్థ ‘బోర్డ్‌ ఆఫ్‌ ఎంక్వయరీ’.. ఈ రెండు కూడా.. ప్రమాదం వల్లనే అమర్‌ చనిపోయాడు తప్ప, వేరే కారణాలేవీ లేవని తేల్చి చెప్పినప్పటికీ వాటిపై నమ్మక కుదరక అనూరాధ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అవిశ్రాంతంగా పోరాటం సాగిస్తూ వచ్చారు.  

 నేవీకి వ్యతిరేకం కాదు
‘‘నేను నేవీకి వ్యతిరేకం కాదు. నేవీలోని అవినీతి అధికారులకు వ్యతిరేకంగానే నా న్యాయ పోరాటం. నా కొడుకు అమర్‌ మృతి ప్రమాదవశాత్తు జరగలేదని కోర్టు అంగీకరించింది కనుకనే ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అందుకు నా ధన్యవాదాలు.  సీబీఐ దర్యాప్తు చేపడితే అమర్‌ మర ణానికి వాస్తవ కారణాలు బయటపడతాయన్న నమ్మకం నాకు ఉంది. కేసును వెనక్కి తీసుకోవాలని ఇన్నేళ్లలోనూ అనేక బెదిరింపులు వచ్చాయి. దీంతో మానసికంగా కుంగిపోయి ఈ కేసును వెనక్కి తీసుకోవాలని కూడా  అన్పించింది.  కానీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, నా విద్యార్థులు ఇలా అనేక మంది ప్రోత్సాహం, ముఖ్యంగా ఈ కేసు వాదిస్తున్న న్యాయవాదులు సునీల్, మంజీరా దంపతుల సహకారంతో ఇంతవరకు పోరాడగలిగాను. నేను ఉన్నంత వరకు ఈ న్యాయపోరాటం చేస్తాను. నా కుమారునిలాగే నేవీలో అనుమానాస్పదంగా అనేక మంది మరణించినట్టు గడిచిన ఇరవై ఐదేళ్లలో  తెలుసుకున్నాను. ఏదైనా అడిగితే ప్రమాదవశాత్తు మరణించారని చెబుతారు. అనేక మంది శవాలు కూడా లభించలేదు. ఈ మరణాలపై విచారణకు అడ్డుపడేవారికి, నేవీలోని అవినీతి అధికారులకు శిక్ష పడేలా చూడాలి. ఇందుకోసం అవసరమైతే చట్టం ఉండాలి. ఆ చట్టానికి నా కుమారుని పేరు పెడితే సంతోషిస్తాను.’’  

బలి తీసుకున్నారు 
అమర్‌ 1970 మే 25వ తేదీ పుట్టాడు. 1990 జనవరి ఒకటవ తేదీ నేవీలో చేరాడు. మొదటి ఆరు నెలలు ‘చిలుక’లో శిక్షణ పొందాడు. తర్వాత డైవర్‌గా సెలక్టయ్యాడు. వాడికి అడ్వెంచర్స్‌ అంటే ఇష్టం. అవార్డులు కూడా అందుకున్నాడు. విధుల్లో భాగంగా 1993లో కాకినాడ వెళ్లాడు. అప్పుడే ప్రమాదవశాత్తూ అమర్‌ మరణించినట్లు వార్త వచ్చింది. కుప్పకూలి పోయాను. అక్కడికి వెళ్లాను. రెండు రోజుల ముందే హెలిక్యాప్టర్‌ నుంచి డైవ్‌ చేస్తూ మిస్‌ అయ్యాడని, తర్వాత ఒడ్డుకు కొట్టుకురావడం స్థానిక మత్స్యకారులు చూశారని అధికారులు చెప్పారు. నాకు నమ్మబుద్ధి కాలేదు. ఘటనకు ముందే అమర్‌కు బలమైన గాయాలైనట్టు పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. ఖిన్నురాలినయ్యాను. నేవీ అంటే ఎంతో గౌరవమున్న మేము మా అబ్బాయి కోసం నేవీపైనే న్యాయపోరాటానికి దిగాం. నేవీలో కొందరు అవినీతి అధికారుల కారణంగానే మా కొడుకు మరణించాడని నా నమ్మకం.

ముందుగా ముంబై హై కోర్టులో పిటిషన్‌ వేశాం. అనంతరం 1997లో కాకినాడ కోర్టులో కేసు నమోదు చేశాం. కేసులు నడుస్తున్నప్పుడు కొందరు నేవీ అధికారులు ఈ కేసుల్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అమర్‌ సముద్రంలోకి డైవ్‌ చేస్తున్న సమయంలో అధిక ఎత్తులో హెలికాప్టర్‌ ఉండడం, భారీ ఎత్తున అలలు ఎగిసి çపడడం వల్ల అమర్‌ను వెంటనే వెదకలేకపోయామని, దీంతో అమర్‌ మరణించాడని కోర్టుకు నేవీ అధికారులు చెప్పారు. కానీ నేవీ, ఏయిర్‌ఫోర్స్, ఆర్మీ ఇలా మూడూ ఆ సమయంలో అక్కడ ఉండగా ఎందుకు వెదకలేకపోయారనే అనుమానాలకు వారి వివరణ తావిచ్చేలా ఉంది. మా అనుమానం నిజమేనని కాకినాడ కోర్టుతోపాటు, హైదరాబాదు హైకోర్టు కూడా నా కుమారుని మృతి ప్రమాదవశాత్తు జరగలేదని, అన్‌నేచురల్‌ డెత్‌ అని అభిప్రాయపడ్డాయి’’ అని తెలిపారు అనూరాధ.

భర్త మరణానంతరం 
అనూరాధ స్కూల్‌ టీచర్‌. కోర్టు కేసులకు వెళ్లి రావడానికి ఇబ్బందిగా ఉండడంతో 2001లో స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. 2007లో ఆమె భర్త అశోక్‌ మరణించారు. అప్పుడు మాత్రం ఈ పోరాటంలో తను ఒంటరినయ్యానని అమెకు అనిపించింది. చిన్న కుమారుడు ప్రతాప్, కోడలు సహకారం అందించారు. ఈసారి పూర్తిస్థాయిలో న్యాయపోరాటం మొదలైంది. ముఖ్యంగా 2008 నుంచి ఇప్పటి వరకు కుటుంబానికి... అంటే .. తన మనవలు, మనవరాళ్లకు ప్రేమను అందించలేక పోయినందుకు  ఆమె విలపించిన రోజులెన్నో ఉన్నాయి. ‘‘పదేళ్లపాటు దేవుణ్ణి కూడా కొలవడం మానేసి నా కొడుకు కోసం పోరాడాను. నిజంగా దేవుడున్నాడు. నా మొర ఆలకించాడు’’ అన్నారు అనూరాధ.  

అనేక బెదిరింపులు
‘‘ఈ కేసులను వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తూ ఎక్కడెక్కడి నుంచో నాకు కాల్స్‌ వస్తుండేవి. ఓసారి బాగా భయపడి వెంటనే న్యాయవాది దంపతులకు ఫోన్‌ చేసి చెప్పాను. వాళ్లు పోలీస్‌ ఎంక్వయిరీ చేయిస్తే ఆ కాల్స్‌లో ఒకటి పాకిస్తాన్‌ సిమ్‌ నుంచి వచ్చినట్లు బయటపడింది. ఇలాంటివన్ని కూడా నా కేసును మరింత బలోపేతం చేశాయి. 2017 జులైలో తుది తీర్పు ఇవ్వనున్నట్టు హైదరాబాదు కోర్టు పేర్కొంది. దీనిపై ఎంతో ఉత్కంఠతో గడిపాను. కాని తీర్పును అడ్డుకోవడంలో నేవీ అధికారులు సఫలీకృతమయ్యారు. మళ్లీ ఈ కేసు వాయిదా పడింది. మానసికంగా కుంగిపోయాను. కేసును వెనక్కి తీసుకుందామనుకున్నాను. కొన్ని రోజులపాటు అనారోగ్యం పాలయ్యాను. కానీ నిలబడ్డాను. అందరి ప్రోత్సాహం లభించింది. ముఖ్యంగా నయాపైసా తీసుకోకుండా నా కోసం పోరాడుతున్న న్యాయవాది దంపతులు నాకు అండగా నిలిచారు. నేను పనిచేసిన పాఠశాలకు చెందిన పాఠశాల విద్యార్థుల సహకారం కూడా లభించింది. అనేక మంది విద్యార్థులు న్యాయం చేయాలంటూ డిఫెన్స్‌ శాఖ మంత్రికి లేఖలు రాశారు. నేను కూడా అనేక మందిని కలిశాను. ఎట్టకేలకు పాతికేళ్ల అనంతరం 2018 డిసెంబరు 17వ తేదీన హైదరాబాదు హై కోర్టు సిబిఐకి అప్పగించింది’’ అని భారమైన హృదయంతో తెలిపారు అనూరాధ.

నాలుగు పుస్తకాలు 
అనూరాధ తన న్యాయపోరాటంపై ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు రాశారు. సుప్రసిద్ద రచయిత్రి శిరీష్‌ పయి ప్రొత్సాహంతో తన కుమారుడు జన్మదినాన్ని (జయంతి)  పురస్కరించుకుని  2013 మే 25వ తేదీన మొదటి పుస్తకం అవిష్కరించారు.  నాలుగువ పుస్తకం జనవరి ఒకటవ తేదీ 2016న విడుదల అయింది. ఇప్పటి వరకు కొనసాగిన కేసుతోపాటు తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, న్యాయపోరాటంపై అయిదవ పుస్తకాన్ని కూడా రాస్తున్నట్టు అనూరాధ చెప్పారు. మరాఠీలో ఉన్న ఈ పుస్తకాలన్నిటినీ త్వరలోనే ఇంగ్లిష్‌లోకి అనువదిస్తున్నట్లు తెలిపారు.
 – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై
– మూడి శ్రీనివాస్, సాక్షి, పుణెí  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top