సందర్భాన్ని బట్టి బుద్ధిని ఉపయోగించాలి

A story by Chaganti Koteswara Rao - Sakshi

పరమేశ్వరుని సృష్టిలో మనుష్యునకు ఇచ్చిన అపూర్వమైన కానుకలు మూడు. మొదటిది మాట, రెండవది నవ్వు. మూడవది బుద్ధి. ఈ మూడింటిని నిరంతరం వాడుకుంటూ మనిషి ఎదగాలి. ఏదిమంచి, ఏది చెడు అనేది నిర్ణయించుకోగలిగిన శక్తి ని మనకు బుద్ధి ఇస్తుంది. దీనిని మనం సమర్ధంగా వినియోగించుకోవాలంటే శాస్త్రాన్ని బాగా చదవాలి, పెద్దల మాటలు ఒంట పట్టించుకోవాలి. మహాత్ముల జీవితాలను బాగా పరిశీలించాలి. నాకు తెలిసిందే మంచి, నేను చెప్పినదే మంచి అని ఎప్పుడూ అనుకోకూడదు. మనిషి జీవితాంతం విద్యార్థిగా తెలుసు కుంటూనే ఉండాలి.

ఒకప్పుడు మంచిగా ఉన్నది మరొకప్పుడు చెడు అవుతుంది. చెడుగా ఉన్నది మంచి అవుతుంది. సందర్భాన్ని బట్టి తెలుసుకోలేకపోతే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. అలాగే ఎప్పుడు ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అనే విచక్షణ బుద్దిచేత పెరగాలి. అబద్ధం చెప్పడం తప్పు, కానీ అహింస కోసం, ఇతరత్రా ప్రాణాలను రక్షించడం కోసం అబద్ధం చెప్పడం తప్పు కాదు.
శ్రీరామాయణంలో సీతమ్మ తల్లి దగ్గరకు రాక్షసులు వచ్చి ‘‘ఆ చెట్టుమీద నుంచి ఒక కోతి మీతో కిచకిచలాడుతూ మాట్లాడింది గదా, ఆ కోతి ఎవరు ?’’ అని అడిగారు.

‘పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి. ఇది లంకా పట్టణం. ఇక్కడంతా రాక్షసులుంటారు. వచ్చినవాడెవరో, మాట్లాడిందేమిటో మీకు తెలియాలి, నాకెలా తెలుస్తుంది ?’’ అని సమాధానమిచ్చింది. ఆవిడకు తెలియదా, వచ్చినవాడెవడో...హనుమ మాట్లాడాడు, ఉంగరం కూడా ఇచ్చాడు... తెలుసు. మరి నిజం ఎందుకు చెప్పలేదు? అబద్ధం ఎందుకు చెప్పింది? తన కోసమని కష్టపడి నూరు యోజనాల సముద్రాన్ని దాటి వచ్చిన వ్యక్తి ప్రాణ రక్షణ కోసం అలా అనవలసి వచ్చింది.

ఒక్కొక్కసారి పెద్ద ధర్మాన్ని నిలబెట్టడం కోసం చిన్న అధర్మం చేయాల్సి ఉంటుంది. పెద్ద సత్యాన్ని నిలబెట్టడానికి చిన్న అబద్ధం ఆడాల్సి ఉంటుంది. అది ధర్మ వివక్ష.  అవతలి వ్యక్తిని కొట్టడం తప్పు. హింస తప్పు. కానీ దేశ సరిహద్దుల్లో నిలబడిన సైనికుడు ఎప్పుడూ ఆయుధాలు ధరించి ఉంటాడు. హద్దుమీరి సరిహద్దు రేఖ దాటి అవతలివాడు కాలు ఇవతల పెడితే నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాడు. అంతే. అది తప్పు కాదు. దేశ సంరక్షణకోసం అలా కాల్చవలసిందే. అయ్యో ! సాటి మనిషిని అలా కాల్చేయడమేమిటి ? అని  కూర్చుంటే దేశం ఎక్కడుంటుంది..మనం ఎక్కడుంటాం ??? ఆయన కాల్చాడు కదా అని మీరూ, నేనూ హద్దు మీరకూడదు. అందువల్ల మనం ఉన్న స్థితినిబట్టి ధర్మం మారుతుంది.

‘మన బుద్ధిని ఉపయోగించి మనం ఈ సమాజ హితానికి ఏం చేయగలం’ అని నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండడానికి నా బుద్ధిని నేను ఎలా ఉపయోగించాలని చూడాలి. బయటినుంచి కాకినాడలోకి ప్రవేశించే మార్గంలో ఒక చోట పెద్ద పాఠశాల ప్రాంగణం కనబడుతుంది. దాని ఆవిర్భావానికి కారకుడు సత్యలింగం నాయకర్‌. ఒకప్పుడు ఆయన రంగూన్‌ వెళ్ళాలని సంకల్పించి స్టీమర్‌లో టిక్కెట్‌ కొనుక్కోవడానికి డబ్బుల్లేక ప్రమాదకరమని తెలిసినా సాహసించి ఒక తెరచాప పడవలో వెళ్ళి, ఏవో చిన్నచిన్న పనులు, వ్యాపారాలు చేసుకుంటూ నెమ్మదిగా వాటిలో ఎదుగుతూ స్థితిమంతుడయ్యాడు.

ఇప్పుడు మనకు రు.20 లక్షలు చిన్న మొత్తం. ఆరోజుల్లో అంత డబ్బు ఆయన దానపట్టా రాసేసాడు. దానికి ఇప్పటి విలువ లెక్కగడితే రు.200 కోట్లవుతుంది. సీ్ర్త, పురుష, పండిత, పామర, కుల, మత, వర్ణ, వర్గ వివక్ష లేకుండా అందరికీ చదువు అందాలని, కటిక పేద విద్యార్థులకు భోజన సదుపాయం కూడా సమకూర్చాలనీ ఆరాటపడి ఈ విద్యాలయం కట్టించాడు. అదీ బుద్ధిని సంస్కరించుకోవడం అంటే.

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top