అమ్మా వెళుతున్నా

special  story to Rohingyas - Sakshi

రోహింగ్యాలు

ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ‘అమ్మా వెళ్లొస్తా’ అంటాం.దేశం విడిచి వెళుతున్నప్పుడు ‘అమ్మా వెళుతున్నా’ అని మాత్రమే అనగలం!మయన్మార్‌ను రాత్రికి రాత్రి సైన్యం తుపాకీ మొనల మీద విడిచిపెట్టిన ఏడు లక్షలమంది రోహింగ్యాలు రుధిరాశ్రువుల మధ్య బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందుతున్నారు.సెల్‌ఫోన్లలో షూట్‌ చేసుకుని వచ్చిన తమ ఇళ్లను, ఊరిని చూసుకుంటూ  అదే పెద్ద ఊరటగా బతుకు ఈడుస్తున్నారు.

కడసారిది వీడ్కోలు
కన్నీటితో మా చేవ్రాలు
జననానికి ఇది మా దేశం
మరణానికి మరి ఏ దేశం...

గడపలో నాటుకున్న మొక్కను వదిలిపెట్టాలి. గంప కింద పెట్టి  పొదువుకున్న కోడిపిల్లలను వదిలిపెట్టాలి. నాన్న గతంలో కొనిచ్చిన పాత సైకిల్‌ను వదిలిపెట్టాలి. అమ్మ ఆ అరుగు మీదే కూర్చుని కబుర్లు చెప్పేదనే జ్ఞాపకం వదిలిపెట్టాలి. ఇంటిని, ఇరుగూ పొరుగును, మామా బాబాయ్‌ పిలుపులను, తెలిసినవారి నుంచి అడక్కుండానే వచ్చే కూర సువాసనను, శుక్రవారం పూట కలిసి నడిచి పంచుకున్న అత్తరు పరిమళాన్ని, అంత వరకూ బతికిన బతుకును, అంతవరకూ పెంచుకున్న పాశాన్ని, అంత వరకూ ముద్దాడిన మట్టిని, అంతవరకూ నీడనిచ్చిన మబ్బు తుంటని వదిలి పెట్టి కదలాలి. ఎక్కడికి?
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ అగమ్యంగా  అగోచరంగా పర దేశానికి. తల్లి తండ్రులు లేనివాడు అనాథే. కాని మాతృదేశం కోల్పోయినవాడు నిజమైన అనాథ. ఇవాళ ఏడు లక్షల మంది రోహింగ్యాలు అనాథలయ్యారు. నేలను రుద్ది రుద్ది వేసే అడుగులు, ఛాతీలోకి పీల్చి పీల్చి  అందుకునే శ్వాస, అశ్రువులను జార్చి జార్చి కార్చే కన్నీరు, వెనక్కు తిరిగి తిరిగి చూసే ఆఖరి చూపులు... వీటితో వాళ్లు బిడారులుగా నడిచి, కఠినమైన నీటి కత్తుల మీద నడిచి, ఛిద్రం చేసే బుల్లెట్ల వానకు దడిచి, దురదృష్టవశాత్తు బతికి, అంతం లేని  వేదనను భుజాన మూటగా మోస్తూ తమ పొరుగు దేశం బంగ్లాదేశ్‌ చేరుకున్నారు. ఆగస్టు 2017 నుంచి సాగుతున్న ఈ ఉప్పు కన్నీటి వలస సాగుతోంది  సాగుతూనే ఉంది... బహుశా మయన్మార్‌ తన సైనిక హింసను చివరి రోహింగ్యాను మట్టుపెట్టేంత వరకూ కొనసాగిస్తే సాగుతూనే ఉంటుంది.

కంచె చేను మేసింది...
ప్రజలను కాపాడటం ప్రభుత్వాల పని. ప్రజలను రక్షించడం సైనికుల విధి. కాని మయన్మార్‌లో ప్రభుత్వం, సైనికులు రోహింగ్యాలపై పగ పెంచుకున్నాయి. వీరు తమ దేశంవారు, తమ మతం వారు కాదన్న నెపంతో జాతి హననానికి తుపాకులు ఎక్కు పెట్టాయి. ఆడవాళ్లని, పిల్లలని చూడకుండా శవాల వరుసను పరిచాయి. వాన కురుస్తున్నా, రాత్రి మంచు పళ్లతో కరుస్తున్నా, ఎండ మింగుతున్నా ఎక్కడా వాళ్లను నిలువనీయకుండా సరిహద్దులు దాటేంతవరకూ నిర్దాక్షిణ్యంగా నిర్దయగా విష పడగలతో తరిమిపెట్టాయి. కాని ప్రతి మనిషీ జ్ఞాపకాల బందీ. ముఖ్యంగా తన జన్మస్థలానికి, జన్మించిన దేశానికి బందీ. వాటిని తనతో పాటు దాచుకోవాలని ప్రయత్నిస్తాడు. రోహింగ్యాలు కూడా ప్రయత్నించారు. వాళ్లను ఆ సమయంలో ఆదుకన్న ఒకే ఒక్క వస్తువు– సెల్‌ఫోన్‌.

ఫోన్‌లో అపురూపం
రోహింగ్యాలు తీరిగ్గా వలసకు బయల్దేరిన కాందిశీకులు కాదు.  అప్పటికప్పుడు, రాత్రికి రాత్రి, ఎక్కడో పేలిన ఒక తుపాకీ చప్పుడుకు ఉలికి పడి, సైన్యం ఊడిపడి ఇళ్లు తగలబడుతుండగా ఆ మంటల్లో చెల్లాచెదురవుతున్న నల్లటి నీడల మధ్యన చేతికందిన వస్తువు తీసుకుని దేశం విడిచిపెట్టారు. అయితే ఎవరు ఏ వస్తువును మర్చిపోయినా ఎక్కువమంది మర్చిపోని వస్తువు సెల్‌ఫోనే. ఎందుకంటే దేశం విడిచిపెట్టే ముందు ఆఖరుసారిగా వారు తమ ఇంటిని, పరిసరాలను, ఊరిని సెల్‌లో బంధించుకుని అదే పెద్ద పెన్నిధిగా దేశం విడిచారు. ఎన్నో కష్టాలు పడి దేశం దాటారు. బంగ్లాదేశ్‌లో వారికి ఆసరా దొరికింది. కాందిశీకుల శిబిరాల్లో  పట్టెడు అన్నం, పీడకలల నిద్ర మధ్య వారికి కాసింత సెల్‌ఫోనే ఊరట అయ్యింది. చాలామంది ఆ సెల్‌ఫోన్‌లో తమ సొంత ఇంటిని చూసుకుని గాఢమైన ఆలోచనలలో మునిగిపోతుంటారు. కొందరి కంట ఆ సమయంలో ధారాపాతం సంభవిస్తూ ఉంటుంది. ఎవరైనా విషాదంగా ఏదైనా పాట అందుకుంటారా? ఏమో. ఒక మనిషికి ఇంతకు మించిన శాపం వద్దు. ఇంత నాగరిక లోకం అని చెప్పుకుంటున్న ఈ ప్రపంచంలో ఒక జాతి జాతంతా చిన్నబుచ్చుకున్న ముఖాలతో మసలడం ఏం శోభ?

కష్టాల డేగలు
దేశం దాటాక కూడా రోహింగ్యాల కష్టాలు తీరలేదు. శిశు జనానాలూ వారి ఆయుష్షు పెద్ద ప్రశ్నార్థకం. వైద్య సహాయం పెద్ద ప్రశ్నార్థకం. మూడు పూటలా కడుపు నిండిందనిపించే తిండి ప్రశ్నార్థకం. ఆ తాత్కాలిక గుడారాలూ ఏ ఎండకూ వానకూ పనికి రావు. ఆకలి వారిలోని కొందరిని నిస్సహాయమైన రాక్షసత్వంలోకి, మోసంలోకి, వంచనలోకి, ఏం చేసైనాసరే మనుగడ కాపాడుకోవాలనే అధోస్థితిలోకి జార్చేసింది. దాంతో దొంగలుగా, మోసగాళ్లుగా, తార్పుడుగాళ్లుగా, కాసిన్ని చిల్లర పైసల కోసం మాదకద్రవ్యాలను చేరేవేసే ఏజెంట్లుగా మారిపోయారు. ఆడవాళ్లు అనుక్షణం తమను తాము కాపాడుకోవడానికి ‘రేప్‌ డివైస్‌’లను దగ్గర పెట్టుకోవాల్సి వస్తోంది. ఇంకా మానవ ఊహకు అందని నైచ్యాలు ఎన్ని జరుగుతున్నాయో ఎవరూ చెప్పలేరు. దారి తప్పినవారు ఏదో ఒకరోజు బాగుపడొచ్చు. దేశం తప్పినవారు ఎప్పటికీ మానవ విషాదాన్ని గొంతు నుంచి ఉమ్ముతూనే ఉంటారు. ఆ ఉమ్ము ఒకోసారి నీరు. మరోసారి రక్తం.
 


రోహింగ్యా స్త్రీలు తమ దగ్గర ఉంచుకుంటున్న ‘రేప్‌ డివైజ్‌’. ఎవరైనా అత్యాచారం చేయబోయినప్పుడు దీన్ని నొక్కితే సైరన్‌ లాగా మోగి నలుగురికీ తెలియజేస్తుంది.

బంగ్లాదేశ్‌ సహాయ శిబిరంలో సెల్‌ఫోన్‌లో తన మయన్మార్‌  ఇంటిని చూసుకుంటున్న రోహింగ్యా 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top