వెలిసిపోయిన రంగుల స్వప్నాలు

Review On Andrea Hirata The Rainbow Troops Novel - Sakshi

కొత్త బంగారం  

యేండ్రియా హిరాటా తొలి నవల, ‘ద రెయిన్‌బో ట్రూప్స్‌’–బహాసా ఇండోనేసియాలో రాసినది. 1970ల నేపథ్యం. కథకుడు–కుర్రాడైన ఇకాల్‌.

ఇకాల్‌– బెలిటన్‌ ద్వీపంలో ఉన్న ‘ఆవేశమెత్తిన మేక ఒక్క తోపు తోస్తే పడిపోయే’ ‘ముహమ్మదీయా ఎలిమెంటరీ స్కూల్‌’లో చేరతాడు. ధనిక ద్వీపమది. అక్కడి బీద విద్యార్థులకు చదువందించే ఆశయంతో– జూనియర్‌ హైస్కూల్‌ పాస్‌ అయిన, 15 ఏళ్ళ ఇబూ మూ(ఇబూ ముస్లీమా) ఆ పేద బడి ప్రారంభిస్తుంది. దాని ప్రిన్సిపాల్‌ హాఫన్‌. ఆ ప్రాంతంలోజాతీయ గనుల తవ్వకపు కంపెనీ అధికారమే చెల్లుతుంది. పాఠశాల మూతపడకుండా ఉండాలంటే, పదిమంది విద్యార్థులైనా ఉండాలన్నది ప్రభుత్వ నియమం. సరిగ్గా పదే మందున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందోమోనని ఉపాధ్యాయులిద్దరూ బెంగటిల్లుతుంటారు.

పిల్లలకు–అబూ మూ, ‘రెయిన్బో ట్రూప్స్‌’ అన్న పేరు పెడుతుంది. వారికి జీవితంపై ఆశ కలిగిస్తుంది. తన జీవిక కోసమూ, స్కూల్‌ ఖర్చుల కోసమూ రాత్రిళ్ళు కుట్టుపని చేస్తుంది. విద్యార్థుల్లోఒకడైన లింగ్టంగ్, మొసళ్ళుండే చిత్తడి నేలను తప్పించుకుంటూ, రానూ పోనూ రోజూ 80 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతాడు. గణితంలో దిట్ట. ఈ పేద పిల్లలు– ఆడంబరమైన పీఎన్‌ స్కూలు విద్యార్థులను స్థానిక పోటీల్లో ఓడిస్తూ పోతారు. రెండు పాఠశాలలకీ మధ్యనుండే తేడా, ఊరి సామాజిక అసమానతను కనబరుస్తుంది.

చాక్‌పీసుల కోసం దుకాణానికి వెళ్ళిన ఇకాల్‌ అక్కడ ‘ఎ లింగ్‌’ అనే చైనీస్‌ అమ్మాయి ‘నెలవంక చంద్రుని ఆకారంలో ఉన్న వేళ్ళ గోళ్ళని’ చూసి ఆకర్షితుడవుతాడు. అయితే, ఆమె తల్లిదండ్రులు ఆమెను ‘మంచి చదువు’ కోసం జకార్తా పంపిన తరువాత, ‘480 గంటల 37 నిమిషాల 12 సెకన్ల పిమ్మట, నా నష్టం గురించి దుఃఖించడం మానాను. నామీద నేను సానుభూతి కురిపించుకోవడం ఆపేశాను’ అంటాడు. అయితే, అప్పటి ఇకాల్‌ వయస్సు గురించిన స్పష్టత ఉండదు. 

హాఫన్‌ మరణిస్తాడు. ‘మనం చదువు కొనసాగించాలి. మనకింక అన్యాయం జరగదు’ అంటుండే లింగ్టంగ్‌– దురదృష్టవశాత్తూ జాలరైన తండ్రి చనిపోవడంతో, చదువాపేసి, కుటుంబ బాధ్యత తలకెత్తుకోవాల్సి వస్తుంది. పిల్లలందరి తండ్రులూ చితకాముతకా పనులు చేసేవారే. ఉపాధ్యాయులూ, విద్యార్థులూ– బడి నిలపడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ, పరిస్థితులు వారి అదుపులో ఉండవు. పిల్లలు తమకున్న వనరులని ఉపయోగించుకోవడంలో ఏ అవకాశమూ వదలరు కానీ వారి ప్రా«థమిక అవసరాలే వారి చదువు మానిపించేస్తాయి.

‘12 ఏళ్ళ పిమ్మటి’కి (చివరి 40 పేజీల వద్దకు) చేరిన తరువాత, విధివాదాన్ని సమర్థిస్తారు రచయిత హిరాటా. ‘రోజువారీ జీవితాల్లో మమ్మల్ని ఊపిరాడకుండా చేసిన ఆర్థిక ఇబ్బందులని తట్టుకున్నాం... విద్యావ్యవస్థకి అతి క్రూరమైన, దృఢమైన, అదృశ్య శత్రువు– భౌతికవాదం. అదే మమ్మల్ని అణచివేసి, మోకాళ్ళమీద కుదేసింది’ అంటాడు ఎదిగిన ఇకాల్‌. ఆ పదిమందిలో– పైకొచ్చినది అతనొక్కడే. విద్యార్థి వేతనంతో చదువుకొని పారిస్‌లో  ఉద్యోగం సంపాదించుకుంటాడు. ‘ఎంత సాధ్యమైతే అంత తీసుకోకుండా, ఎంత వీలయితే అంత ఇవ్వడం నేర్చుకున్నాం. ఆ మనస్తత్వం వల్ల పేదరికం అనుభవిస్తూ కూడా, కృతజ్ఞతగా ఉండటం అలవాటయింది’ అంటాడు.

కాలక్రమం లేని నవల్లో– ఎప్పుడు, ఎన్నేళ్ళు గడిచిపోయాయో సులభంగా అర్థం కాదు. సంభాషణా శైలిలో ఉన్న వచనం సరళమైనది. ఇది నవలనిపించదు. కొన్ని సంఘటనలు, పిట్టకథలు, సూక్తులు కలిపి అల్లినట్టనిపిస్తుంది. యేంజీ కిల్బనె ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఈ రచయిత స్వీయచరిత్రను, హార్పర్‌ కాలిన్స్‌ 2013లో ప్రచురించింది. హిరాటా దీన్ని ‘ఇబూ మూ’కే అంకితం ఇచ్చారు. ఈ నవల ఆధారంగా, ఇండోనేసియాలో ఇదే పేరుతో వచ్చిన సినిమా బాగా ఆదరణ పొందింది.
కృష్ణ వేణి
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top