ఓటు వినియోగించుకోని వారు 9,51,374 | voting percentage decreased in district | Sakshi
Sakshi News home page

ఓటు వినియోగించుకోని వారు 9,51,374

May 5 2014 1:47 AM | Updated on Sep 17 2018 6:08 PM

జిల్లా ఎన్నికల అధికారులు ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ శాతాన్ని అధికారికంగా విడుదల చేశారు.

ఆదిలాబాద్/మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : జిల్లా ఎన్నికల అధికారులు ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ శాతాన్ని అధికారికంగా విడుదల చేశారు. గత నెల 30న సార్వత్రిక ఎన్నికలు జరగ్గా ఆ రోజు 77.90 శాతం పోలింగ్ జరిగినట్లు వెల్లడించారు. అయితే పోలింగ్ శాతంలో తారతమ్యం చోటు చేసుకొని మరుసటి రోజు పోలింగ్ శాతం కేవలం 72 శాతమే నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. తీరా అదికూడా సరికాదని చెప్పడంతో పోలింగ్ శాతం వివరాల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలోని పది నియోజకవర్గాల పోలింగ్ శాతాన్ని కచ్చితంగా తెలుసుకోవడంలో అధికారులు విఫలం అయ్యారు. ఎట్టకేలకు శనివారం రాత్రి పోలింగ్ శాతం వివరాలు వెల్లడించారు. 2009లో 74.56 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 73.70 శాతం నమోదైంది. ఈసారి 0.86 శాతం పోలింగ్ తక్కువగా నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు విస్తృతంగా ప్రచారం చేసినా ప్రభావం కనిపించలేదు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తక్కువ నమోదు కావడం గమనార్హం.

 గిరి‘జన’మే నయం
 జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలకు రిజర్వుడ్ ఎస్టీ, ఎస్సీ స్థానాల్లో భారీ పోలింగ్ శాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల వంటి జనరల్ రిజర్వ్ స్థానాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. గిరి జనం ఓటు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. రిజర్వ్ స్థానం అయినటువంటి బోథ్‌లో అత్యధికంగా 79.96 శాతం పో లింగ్ నమోదైంది. జనరల్ స్థానం అయినటువంటి ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 63.91 శాతం మాత్రమే నమోదైంది.

 ఓటింగ్‌లోనూ సగం
 జిల్లాలో 19,59,660 మంది ఓటర్లు ఉండగా, అందులో 14,44,280 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 9,80,897 మంది పురుషులు ఉండగా, 7,25,267 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 73.94 శాతం పురుషుల ఓటింగ్ నమోదైంది. మహిళలు 9,78,561 మంది ఉండగా 7,19,001 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 73.48 శాతం మహిళల పోలింగ్ నమోదైంది. జిల్లాలో ఈ ఎన్నికల్లో మొదటిసారి ఇతరుల కేటగిరీలో ఓటు పొందిన 202 మందిలో కేవలం 12 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేవలం 5.94 శాతం మాత్రమే వారి ఓటింగ్ నమోదైంది.

 పార్లమెంట్ సెగ్మెంట్‌లవారీగా..
 ఆదిలాబాద్ పార్లమెంట్‌సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా 13,85,559 మంది ఓటర్లుకు 10,44,162 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 75.36 శాతం పోలింగ్ నమోదైంది. పెద్దపెల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో జిల్లాలోని మూడు నియోజకవర్గాలు ఉండగా అందులో 5,74,101 ఓటర్లకు 4,00,118 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 69.69 పోలింగ్ శాతం నమోదైంది.

 మూడు ఎన్నికల్లో ఓటు వినియోగించుకోని వారు 9,51,374
 ఇటీవల జరిగిన మున్సిపల్, స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో 9,51,374 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదు. మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 3,52,310 మందికి 2,34,985 మంది ఓటు వేయగా, 1,17,325 మంది ఓటు వేయలేక పోయారు. ప్రాదేశిక ఎన్నికలు రెండు దశలుగా జరిగాయి. ఏప్రిల్ 6, 11 తేదీల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో 15,21,330 మంది ఓటర్లకు 12,02,661 మంది ఓటు వేయగా, 3,18,669 మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. కాగా, ఏప్రిల్ 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 19,59,660 మంది ఓటర్లకు 14,44,280 ఓటు వేయగా, 5,15,380 మంది ఓటర్లు ఓటు వేయలేదు. ఇందులో 2,55,630 మంది పురుషులు, 2,59,560  మహిళలు ఉన్నారు. ఇతరులు 190 మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement