
‘ప్రచారం’ చేస్తున్నా పడని ఓట్లు
నూరు శాతం పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందుకోసం సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్
సాక్షి, కాకినాడ :నూరు శాతం పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందుకోసం సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ (ఎస్‌వీఈఈపీ) అనే కార్యక్రమం చేపట్టింది. ఉన్నత విద్యాలయాల్లో ఓటు హక్కుపై సదస్సులు, సమావేశాలు నిర్వహించింది. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని చాటుతూ ఊరూరా ర్యాలీలు, ఫ్లెక్సీలతో ప్రచారం చేసింది. అయినా ఇంకా లక్షలాది మంది పోలింగ్ బూత్‌ల వైపు తొంగి చూడడం లేదు. ఇటీవల జరిగిన మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా ఇంకా ఓటు వేయడంపై లక్షలాదిమందిలో నిరాసక్తత ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ఓటర్లే తమ హక్కు వినియోగంపై అలసత్వం వహిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
రెండు విడతలుగా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈసారి 81.05 శాతం పోలింగ్ నమోదైంది. తొలివిడతలో 12,81,692 మంది ఓటర్లకు 10,63,697 మంది, రెండో విడతలో 13,44,001 మంది ఓటర్లకు 10,63,356 మంది ఓటేశారు. తొలి విడతలో 2,17,995 మంది, రెండో విడతలో 2,80,645 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఎన్నికల సంఘం ఎంత ప్రచారం చేసినా గ్రామీణ ఓటర్లలో 4,98,640 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలను పరిశీలిస్తే ఈసారి 74.38 శాతం పోలింగ్ నమోదైంది. 2005లో ఇది 65 శాతానికి మించలేదు. అయితే ఈసారి 25.62 శాతం మంది ఓటర్లు ఓటేయలేదు. రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల పరిధిలో 5,38,548 మంది ఓటర్లుంటే 4,00,558 మంది మాత్రమే ఓటేశారు. 1,37,990 మంది ఎన్నికలపై ఆసక్తిని కనబరచలేదు. మొత్తమ్మీద రెండు ఎన్నికలను పరిశీలిస్తే గ్రామాల్లో కంటే పట్టణాల్లో అదనంగా 7.67 శాతం మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. రెండు ఎన్నికల్లో 31,64,241 మంది ఓటర్లుండగా 25,27,611 మంది ఓటేశారు. 6,36,630 మంది ఓటేయడానికి ఆసక్తి చూపలేదు.
నిర్లిప్తతను వీడాలి..
ఐదేళ్లకోసారి ఒక్క గంట కేటాయిస్తే చాలు.. తమ తలరాతలు మార్చే ప్రతినిధిని ఎన్నుకోవచ్చన్న వాస్తవాన్ని ఓటర్లు గుర్తించాలి. ఓటేసినప్పుడే ప్రజాప్రతినిధిని, ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంటుందని తెలుసుకోవాలి. ఒకవేళ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే.. ఇప్పుడు ప్రవేశపెడుతున్న ‘నోటా’ బటన్ నొక్కినా ఓటు హక్కు వినియోగించుకున్నట్టే. ‘నేను ఒక్కడినే ఓటేయకపోతే మన తలరాతలు మారవు కదా!’ అన్న నిర్లిప్తతను వీడాలి.
ఓటర్లను తరలించే బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోవాలి
ఓటు హక్కు ప్రాధాన్యాన్ని చెబుతూ ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఓటర్‌ను పోలింగ్ కేంద్రానికి రప్పించడమే అసలైన పని. వాహన సదుపాయం కల్పించి బూత్‌లకు రప్పించడంలో రాజకీయ పార్టీలే ఇప్పటికీ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలా వాహనాలు ఏర్పాటు చేయడంపై ఆంక్షలు విధించిన ఎన్నికల కమిషన్ వృద్ధులు, మహిళలు, అస్వస్థులను పోలింగ్ కేంద్రాలకు రప్పించే ఏర్పాట్లపై దృష్టి పెట్టలేదు. జిల్లాలో ఏజెన్సీతో పాటు లంక గ్రామాల్లో వాగులు, వంకలు, కాలువలు దాటి బూత్‌లకు వెళ్లాల్సి ఉంది. ఇలాంటి చోట సరైన వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. పోలింగ్ రోజుతో పాటు ముందు రోజు, మర్నాడు కూడా ప్రభుత్వపరంగా సెలవు ప్రకటిస్తే దూరప్రాంతాల్లో ఉండే ఓటర్లు స్వస్థలాలకు వచ్చి ఓటేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారిలో యువతే అధికం. వారు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలి. పోల్ స్లిప్‌లను కూడా రెండు రోజులు ముందే పంపిణీ చేయాలి.