మెరిట్‌పైనా ఒత్తిడి | stress on students going to suicide | Sakshi
Sakshi News home page

మెరిట్‌పైనా ఒత్తిడి

Oct 17 2017 9:44 AM | Updated on Nov 6 2018 8:08 PM

stress on students going to suicide - Sakshi

ఒత్తిడి.. ఒత్తిడి.. ప్రస్తుతం విద్యార్థులను వెంటాడుతోంది. కెరీర్‌ లక్ష్యంగా సాగుతున్న చదువులు.. బిజీబిజీగా మారుతున్న లైఫ్‌స్టైల్స్‌తో మానసిక ఎదుగులపై ప్రభావం.. బోధనలో సరియైన విధానం లేకపోవడం.. వంటి సమస్యలతో ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు.

నూజివీడు: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యనందించడమే ట్రిపుల్‌ఐటీల లక్ష్యం. కాని లక్ష్యానికి దూరంగా సాగుతూ విద్యార్థుల ప్రాణాలతో  చెలగాటమాడే పరిస్థితి నెలకొంది. అందుకు విద్యార్థిని రమాదేవి మృతే సాక్షి.

సిలబస్‌ రూపకలప్పనలోనూ..
పీయూసీ ప్రథమ ఏడాదికి సంబంధించిన సిలబస్‌ రూపకల్పన, బోధన పద్ధతుల్లో లోపాలు బహిర్గతమయ్యాయి. బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌(బీవోఎస్‌) రూపొందించిన సిలబస్‌ అమలు లేదు. ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చాలా కఠినంగా ఉన్నాయి.

తరగతి గది వైపు ఆకర్షణ ఏది..?
ట్రిపుల్‌ఐటీలో చేరే వారిలో 80 శాతం మంది గ్రామీణ పాంతాలకు చెందిన తెలుగు మీడియం విద్యార్థులే అధికం. వీరిని తరగతిగదిలో ఆకర్షించే విధంగా బోధన సాగాలి. కాని తరగతికి వచ్చామా.. వెళ్లామా.. అని తప్పితే బోధన సాగడం లేదనే వాదన వినిపిస్తోంది. కొంతమంది మెంటార్లు అయితే ఆలస్యంగా క్లాసు రావడం, ముందుగా వెళ్లడం చేస్తుండడంతో విద్యార్థులకు పాఠాలు అర్థంకాక టెన్షన్‌కు గురవుతున్నారు.

రెండు మీడియాల్లో బోధన లేదు.
తెలుగు మీడియం నుంచి 80శాతం మంది విద్యార్థులు వచ్చిన వారు కాబట్టి మొదటి సెమిస్టర్‌ పూర్తయ్యే వరకు తెలుగు, ఇంగ్లిష్‌ మీడియాల్లో బోధన చేయాలి. ట్రిపుల్‌ఐటీ ప్రారంభం నుంచి అధికారులు బోధన సిబ్బందికి చెబుతున్నారు. అయితే కొందరు మెంటార్లు ఇంగ్లిష్‌లో మాత్రమే బోధిస్తుండటంతో తెలుగు మీడియం విద్యార్థులు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇంగ్లిష్‌తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు అర్థంకావడం లేదని  లబోదిబోమంటున్నారు. సిలబస్‌ పూర్తవుతున్న కొద్దీ వారిపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది.

పరీక్షలకు సమయం లేదు..
ప్రతినెలా చివరిలో మిడ్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సమయమే ఇవ్వడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నా ఈ రోజు వరకు సిలబస్‌ బోధిస్తూనే ఉంటారు. దీంతో తాము రాత్రి పూట రెండు గంటల వరకు చదువుకోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

సందేహాల నివృత్తి శూన్యం..
విద్యార్థులకు సందేహాలను నివృత్తి అనేది కూడా అసలు లేదు. మెంటార్లు పట్టించుకోవడం లేదు.    గతంలో రాత్రిపూట స్టడీ తరగతులు నిర్వహించేవారు. ఆ తరగతులలో హోంరూమ్‌ ట్యూటర్స్‌ (హెచ్‌ఆర్‌టీ)లు విద్యార్థుల సందేహాలను కొంత మేరకు నివృత్తి చేసేవారు. ప్రస్తుతం ఇంకా స్టడీ తరగతులను నిర్వహించకపోగా, హెచ్‌ఆర్‌టీలను గతంలోనే ఐటీ మెంటార్స్‌గా మార్చేశారు.

కఠినంగా ఇంగ్లిష్‌ సబ్జెక్టు...
బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ సమావేశమై సిలబస్‌ను నిర్ణయించారు. అందుకు భిన్నంగా చాన్సలర్‌ చెప్పారంటూ కొత్త విధానం అమలు చేస్తున్నారు.  అమెరికా నుంచి ఆన్‌లైన్‌లో వచ్చే సిలబస్‌ బోధిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ఇంగ్లిష్‌ క్లాసులో అమెరికాలోని ప్రముఖ పత్రికలైన న్యూయార్స్‌ టైమ్స్, లండన్‌ టైమ్స్‌ పత్రికల్లో వచ్చిన వ్యాసాలను ఆన్‌లైన్‌లో పంపి వాటిని చదివిన తరువాత ఆ వ్యాసంలోని అంశాలపై ఇచ్చే ప్రశ్నలకు  జవాబులు రాయిస్తున్నారు. ఆ తరువాత బీబీసీ, సీఎన్‌ఎన్, ఐబీఎన్, ఏఎక్స్‌ఎన్‌ చానళ్లలో చదివి న్యూస్‌ క్లిప్పింగ్‌లను విద్యార్థులు విని వాటికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. విద్యార్థులకు అక్కడి పరిస్థితులు తెలియక, అమెరికన్‌ లాంగ్వేజ్‌ అర్థంకాక పరీక్షలో సరిగా రాయకపోతే మార్కులు రావేమోనని చాలా ఒత్తిడికి గురవుతున్నారు.

సైకాలజిస్టులు లేక..
సంస్థలో కనీసం ఒకరిద్దరు సైకాలజిస్టులు ఉండి వారికి నిత్యం మోటివేషన్‌ తరగతులు నిర్వహించినట్లయితే డిప్రెషన్‌లోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. అసలు ఆ దిశగా యాజమాన్యం ఆలోచన చేస్తున్న దాఖలాలే లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు మూల కారణాలను తెలుసుకుని వాటిని సరిచేసుకుంటే ట్రిపుల్‌ఐటీలకు పేరుప్రతిష్టలు పెరుగుతాయనేది సర్వత్రా అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement