గవర్నర్ల వ్యవస్థపై ఎన్డీయే ప్రభుత్వానిది పాత బాటేనని కొన్ని రోజు లుగా జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి.
గవర్నర్ల వ్యవస్థపై ఎన్డీయే ప్రభుత్వానిది పాత బాటేనని కొన్ని రోజు లుగా జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. యూపీఏ పాల కులు నియమించిన గవర్నర్లందరూ వైదొలగాలని అధికారానికొచ్చిన నెల్లాళ్లలోపే ఎన్డీయే సర్కారు హుకుం జారీచేసినప్పుడు ఈ వ్యవస్థను బాగుజేయడానికి ప్రయత్నిస్తున్నదేమోనని కొందరిలోనైనా ఆశపు ట్టింది. రాజ్‌భవన్‌లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన దౌర్భాగ్యస్థితి ఇక అంతరిస్తుందని అలాంటివారనుకున్నారు. కానీ, కొత్త గవర్నర్ల నియామకం కోసం ఎన్డీయే సర్కారు జరిపిన కసరత్తు అలాంటి ఆశలన్నిటినీ ఆవిరిచేసింది. కేవలం రాజకీయ కారణాలతో పాత గవర్నర్లను పంపించాలనుకున్నాం తప్ప, కొత్త ఒరవడిని సృష్టించే ఉద్దేశం తమకు లేదుగాక లేదని ప్రభుత్వం తన ఆచరణ ద్వారా తెలియజెప్పింది. అయిదు రాష్ట్రాలకు ఇప్పుడు గవర్నర్లు కాబో తున్నవారంతా బీజేపీ సీనియర్ నేతలు. కేంద్ర మాజీ మంత్రి రాం నాయక్, యూపీ బీజేపీ నేత కేసరీనాథ్ త్రిపాఠి, ఢిల్లీ బీజేపీ నేత విజయ్‌కుమార్ మల్హోత్రా, మధ్యప్రదేశ్ మాజీ ఎంపీ కైలాస్ జోషి, పంజాబ్‌కు చెందిన బలరాం దాస్ టాండన్‌లు రేపో మాపో రాజ్‌భవన్ లను అలంకరించబోతున్నారు. మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ కూడా గవర్నర్ కాబోతున్నారని కథనాలొచ్చినా ఆయన పేరు ప్రస్తుత జాబితాలో లేదు. ఏదైనా వ్యవస్థ సక్రమంగా లేదనుకుంటే దాన్ని సవరించవచ్చు లేదా పూర్తిగా ప్రక్షాళన చేయొచ్చు. అలాంటి చర్యను ఎవరూ తప్పుబట్టరు. కానీ, ఎన్డీయే చేసింది వేరు. ముందు ‘యూపీఏ’ గవర్నర్లను వైదొలగమని కబురంపింది. పదవీకాలం ముగి సిన హెచ్‌ఆర్ భరద్వాజ్(కర్ణాటక), దేవానంద్ కన్వర్(త్రిపుర) ‘గౌర వం’గా తప్పుకున్నారు. ఎం.కె. నారాయణన్(పశ్చిమబెంగాల్), బీవీ వాంచూ(గోవా)వంటివారు అగస్టా హెలికాప్టర్ల స్కాంలో సీబీఐ ప్రశ్నించాక వైదొలిగారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గవర్నర్‌గా వ్యవహరించి ఆయనను ఇబ్బందిపెట్టిన కమలా బేణీవాల్ ను మిజోరం రాష్ట్రానికి బదిలీచేశారు. మిజోరంనుంచి నాగాలాండ్‌కు బదిలీ అయిన గవర్నర్ పురుషోత్తమన్ మాత్రం తమను సాధారణ ప్రభుత్వోద్యోగులుగా పరిగణించి బదిలీచేయడాన్ని జీర్ణించుకోలేక రాజీనామాచేశారు. యూపీ గవర్నర్ బీఎల్ జోషి నిష్ర్క మించమని సందేశం వచ్చిన వెంటనే వైదొలగారు. ఇంకా రాజ్‌భవన్ లను అంటిపెట్టుకుని ఉన్న షీలా దీక్షిత్(కేరళ), శంకర్‌నారాయణ్ (మహారాష్ట్ర), జగన్నాథ్ పహాడియా(హర్యానా)తదితరులను కూడా బదిలీ చేసే ఉద్దేశంలో కేంద్రం ఉంది.
గవర్నర్ పదవి రాజ్యాంగం రీత్యా చూస్తే చాలా ఉన్నతమై నది.రాజ్యాంగంలోని 157. 158 అధికరణలు ఎలాంటివారిని ఆ పదవుల్లో నియమించాలో చెబుతాయి. కానీ, ఆచరణలోకొచ్చేసరికి ఆ పదవులు సీఎంలుగా, కేంద్రమంత్రులుగా విఫలమైనవారికో... ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్టు లభించనివారికో దక్కుతున్నాయి. ఒక్కోసారి పార్టీలో ఏ బాధ్యతనూ సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహించలేని వృద్ధ నేతలు కూడా గవర్నర్ పదవులకు అర్హులవుతున్నారు. ఉన్నతా ధికారులుగా ఉన్నప్పుడు తాము చెప్పినట్టల్లా నడుచుకున్నవారికి రిటైరయ్యాక పదవులిచ్చి యూపీఏ ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరతీసింది. మరోవిధంగా చెప్పాలంటే కేంద్రంలో పాలన సాగిస్తున్న వారు ఉన్నతమైన రాజ్యాంగ పదవిని తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు. గవర్నర్ల నియామకాలు రాజకీయ నిర్ణయం అయినప్పుడు రాజీనామా కోరడంలో తప్పేమున్న దని వాదించిన బీజేపీ నేతలు చివరకు తామూ ఆ బాటనే ఎంచుకు న్నారు. ఇంతకూ దారికి రాని గవర్నర్లను ఈశాన్య ప్రాంతానికే బదిలీచే యడంలోని ఆంతర్యమేమిటి? ఇది ఆ గవర్నర్లను తక్కువచేయడమా? ఈశాన్య ప్రాంతాన్ని చులకనచేయడమా?
మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు గవర్నర్ల వ్యవస్థను ఆరో వేలితో పోల్చారు. ప్రజామోదం పొందిన రాష్ట్ర ప్రభుత్వాలను అణచివేసేందుకు, గుప్పెట్లో పెట్టుకునేందుకు ఈ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపిం చారు. ఇందులో నూటికి నూరుపాళ్లూ నిజముంది. కేంద్రంలో పాలన సాగించే పక్షం అవతలిపక్షానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు గవర్నర్‌ను ప్రయోగిస్తుంది. గవర్నర్ తల్చుకుంటే చేయలేనిదంటూ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం సంతకం కోసం పంపిన బిల్లును నిరవధికంగా పెండింగ్‌లో ఉంచొచ్చు. శాంతిభద్రతలు క్షీణించాయన్న నివేదికను కేంద్రానికి పంపి ప్రభు త్వాన్ని బర్తరఫ్ చేయించవచ్చు. రాష్ట్రపతి పాలన విధించి తాను ఆడింది ఆటగా చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల బర్తరఫ్ విషయంలో సుప్రీంకోర్టు ఒకటికి రెండు సందర్భాల్లో మందలించి ఉన్నది కనుక అలాంటి ధోరణి ఈమధ్య తగ్గినా... ఏమాత్రం అవకాశమున్నా దాన్ని వినియోగించుకోవడానికి కేంద్రంలోని పాలకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అందువల్లే ఆమధ్య సుప్రీంకోర్టు సైతం గవర్నర్ల నియామకంలో రాజకీయ నీడ పడకుండా చూడాలని హితవు చెప్పింది. ఇలాంటి హితవచనాలు మన పాలకుల తలకెక్కలేదని ఎన్డీయే ప్రభుత్వ తాజా ఆలోచనలు స్పష్టంచేస్తున్నాయి. ఇప్పుడు ఎన్డీయే తీరును తప్పుబడుతున్న కాంగ్రెస్ పదేళ్లక్రితం తాను సైతం ఇదే తప్పు చేసింది. ఆనాడు యూపీఏ సర్కారును తప్పుబట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు అధికారంలోకొచ్చి తామూ అదేవిధంగా వ్యవ హరిస్తున్నారు. ఇప్పటికైనా దీనికి ఫుల్‌స్టాప్ పడుతుందని ఆశిం చినవారికి కొత్త గవర్నర్ల నియామకం నిరాశ కలిగించిందనడంలో సందేహంలేదు.