వాటర్‌ ట్యాంకు ఎక్కి యువకుడి హల్‌చల్‌

Young Man Climbs Water Tank For Justice - Sakshi

కొత్తగూడెంఅర్బన్‌ : ఇందిరమ్మ ఇల్లు, మూడెకరాల పొలం కబ్జాకు గురికావడం మనస్తాపం చెందిన ఓ యువకుడు వాటర్‌ ట్యాంకు ఎక్కి హల్‌చల్‌ చేసిన సంఘటన పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది.   త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తగూడెం బాబుక్యాంపునకు చెందిన సురుగు గౌతమ్‌ శుక్రవారం ఉదయం, స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలోని వాటర్‌ ట్యాంకు ఎక్కాడు.  గౌతమ్‌కు సంబంధించిన ఇల్లు, మూడెకరల స్థలం అధికార పార్టీకి చెందిన నాయకుడు కబ్జా చేశాడని, ఈ విషయమై ఎన్ని సంవత్సరాలుగా అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ వాటర్‌ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  సమాచారం అందుకున్న త్రీటౌన్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీఐ ఆదినారాయణ గౌతమ్‌ను ఫోన్‌లో వివరాలు అడుగగా, తనకు న్యాయం చేసి ఇల్లు, స్థలం ఇప్పించాలని కోరాడు.

సీఐ ఆదినారాయణ పాల్వంచ ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ కిషోర్‌కు   ఫోన్‌ చేసి సంఘటన స్థలానికి పిలిపించారు.  తహసీల్దారు చేరుకున్న అనంతరం గౌతమ్‌ను కిందికి దిగి రావాలని, న్యాయం చేయడానికి తహసీల్దారు కూడా వచ్చారని సీఐ కోరారు. గౌతమ్‌ మాట్లాడుతూ తనపై ఎటువంటి కేసు నమోదు చేయవద్దని, తనకు న్యాయం చేయాలని అప్పడే కిందికి దిగి వస్తానని  చెప్పడంతో తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు. ఈ తతంగం అంతా దాదాపు రెండు గంటల పాటు జరిగింది. గౌతమ్‌ కిందకు దిగడంతో అక్కడకు చేరుకున్న ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.  అనంతరం గౌతమ్‌తో పాటుగా తహసీల్దార్‌ కిషోర్‌ పాల్వంచ కిన్నెరసాని ఏరియాలో ఇల్లు, స్థలాన్ని పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ పూర్తయిన తరువాత వివరాలు వెల్లడిస్తామని తహసీల్దారు తెలిపారు. సంఘటనపై త్రీటౌన్‌ పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top