శివార్లలో ‘డ్రగ్‌’ ఇండస్ట్రీస్‌!

Drugs manufacturing in Hyderabad - Sakshi

నగర పరిసరాల్లో జోరుగా మాదకద్రవ్యాల తయారీ

ఖాయిలాపడ్డ పరిశ్రమల్లోనే అత్యధికం?

అంబోలీ ఉదంతంతో మరోసారి ఉలికిపాటు

కీలక విభాగాల ఉమ్మడి కృషితోనే కట్టడి

సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు శివారు జిల్లాలు నియంత్రణ పదార్థాల జాబితాలోకి వచ్చే ఇంటర్మీడియరీ ప్రొడక్ట్‌ ఎఫిడ్రిన్, యాంఫెటామిన్‌ ఉత్పత్తి, స్మగ్లింగ్‌కు అడ్డాగా మారుతున్నాయా... ? ఔననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గత వారం ముంబైలోని అంబోలీ పోలీసులు 200 కేజీల ఎఫిడ్రిన్‌ను తీసుకువెళ్లిన చింతల్‌ ప్రాంతానికి చెందిన గులాం హుస్సేన్‌తో పాటు మరొకరిని పట్టుకోవడం కలకలం రేపింది. ఇదే తరహాకు చెందిన మరో మాదకద్రవ్యం యాం ఫెటామిన్‌ ఇప్పటికే అనేకసార్లు ఎన్సీబీ, డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగర శివార్లలోని బల్క డ్రగ్‌ ఇండస్ట్రీస్, ఖాయిలా పడిన పరిశ్రమల కేంద్రంగా సాగుతున్న ఈ దందాను అడ్డుకోవడానికి అనేక విభాగాలు ఉమ్మడిగా పని చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

సముద్రమార్గంలో సరఫరా...
ఎఫిడ్రిన్, యాంఫెటామిన్‌ మాదకద్రవ్యాలు విదేశాలకు సముద్ర మార్గం ద్వారానే ఎక్కువగా అక్రమ రవాణా అవుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇతర మార్గాల్లో పంపాలంటే ఇబ్బందులు ఉంటున్న నేపథ్యంలో... కంటైనర్లలో ఇతర సరుకుల మధ్య దాచి, దేశం దాటిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ కర్ణాటకలో తయారైన ఎఫిడ్రిన్‌ హైదరాబాద్‌ మీదుగా ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆటోనగర్‌లో డీఆర్‌ఐ పట్టుకున్న కేసులోనూ ‘సరుకు’ చెన్నైకి చేరాల్సి ఉంది. 2016లో దొరికిన యాంఫెటామిన్‌ను సైతం కర్ణాటక, తమిళనాడులకు పంపిస్తున్నారు. అంబోలీలో దొరికిన సరుకు హైదరాబాద్‌ శివార్లలో తయారైనట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. వివిధ ప్రాంతాల్లో తయారైన ఎఫిడ్రిన్, యాంఫెటామిన్‌లను ఓడ రేవులు ఉన్న ప్రాంతాలకు తరలించి, కంటైనర్ల ద్వారా బయటికి తరలించేందుకు అనేక ముఠాలు వ్యవస్థీకృతంగా పని చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు ఇతర మెట్రో నగరాల్లో సందర్భాలను బట్టి విక్రయిస్తున్నారు. 

ఆద్యంతం లింక్‌ సిస్టమ్‌లో...
ఆగ్నేయాసియా, సౌదీ దేశాల్లో మంచి డిమాండ్‌ ఉన్న ఎఫిడ్రిన్‌ను తయారు చేయడం, అక్రమరవాణా చేయడం, విక్రయించడం ఇలా అంతా లింక్‌ సిస్టమ్‌లో జరిగిపోతోంది. తమకు ‘సరుకు’ ఇచ్చిన వారి వివరాలు కానీ, తాము ఇవ్వబోతున్న వారి వివరాలు కానీ మధ్యలో పని చేస్తున్న దళారులకు తెలీదు. వీరెవ్వరికీ అసలు ఈ మాదకద్రవ్యాలు ఎక్కడ తయారవుతున్నాయి? ఎక్కడికి చేరుతున్నాయి? అనే అంశాలు తెలియకుండా సూత్రధారులు జాగ్రత్తపడతారు. కేవలం ‘పై నుంచి’ వచ్చే ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా ఏజెంట్లు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలా లింక్‌ సిస్టంలో దందా చేయడం ద్వారా ఎవరు పట్టుబడినా... చైన్‌ అక్కడితో తెగిపోయి సూత్రధారులు సేఫ్‌గా ఉండిపోతున్నారని  అధికారులు చెబుతున్నారు. 

‘అంతా కలిసి’ పని చేస్తేనే...
వ్యవస్థీకృత ముఠాలు నగర శివార్లలోని అనేక దివాళా తీసిన, సెకండ్‌ గ్రేడ్, లైసెన్స్‌లేని బల్క్‌ డ్రగ్‌ కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. ఈ మాదకద్రవ్యాలను రాష్ట్రంలో వినియోగించిన దాఖలాలు అధికారికంగా లేనప్పటికీ...  ఆగ్నే యాసియా, సౌదీ దేశాలకు అక్రమంగా పెద్ద ఎత్తు న రవాణా అవుతోంది. వీటి తయారీని అడ్డుకోవాలంటే డీఆర్‌ఐ, ఎన్సీబీలతో పాటు స్థానిక పోలీసులు, విద్యుత్, నీటి సరఫరా తదితర విభాగాల న్నీ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేగాక ఆయా పరిశ్రమల్లో పని చేస్తున్న వారికి నిషేధిత, నియంత్రిత పదార్థాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలని, అప్పుడే వారి నుంచి సమాచారం అందుతుందని పేర్కొన్నారు.

గతంలో చిక్కిన కేసులివీ...
2009లో డీఆర్‌ఐ అధికారులు హైదరాబాద్‌తో పాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఏకకాలంలో దాడులు చేసి 400 కేజీల ఎఫిడ్రిన్‌ను పట్టుకున్నారు.  
సైబరాబాద్‌ పోలీసులు 2010లో ఓ సినీ నిర్మాతతో పాటు అతడి అనుచరుడినీ అరెస్టు చేశారు. వీరి నుంచి 25 కేజీల ఎఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నారు.  
డీఆర్‌ఐ అధికారులు 2012లో ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరి నుంచి 65 కేజీల ఎఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నారు.  
2014లో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, సైబరాబాద్‌ పోలీసులు చౌటుప్పల్, హయత్‌నగర్‌ల్లో జరిపిన సంయుక్త సోదాల్లో 300 కేజీల ఎఫిడ్రిన్‌ స్వాధీనమైంది.  
2015లో దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసు బృందం లిబర్టీ చౌరస్తా వద్ద పట్టుకున్న ముఠా నుంచి ఎల్‌ఎస్‌డీతో పాటు ఎఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నారు.  
 2016లో రెండు నెలల వ్యవధిలోనే డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ఆటోనగర్‌లో ని ఓ లాడ్జిపై దాడి చేసి రూ.5 కోట్ల విలువైన 50 కేజీల ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై శంషాబాద్‌ విమానాశ్రయంలో హైదరాబాద్‌ నుంచి దక్షిణాఫ్రికా వెళ్తున్న ఓ యువకుడి నుంచి 12 కేజీలు పట్టుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top