ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు 740 మంది ఉద్యోగులు, సిబ్బంది సామూహిక సెలవులు పెట్టి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
విజయనగరంలో ఉపాధ్యాయుల శాంతి ర్యాలీ
Sep 6 2013 3:54 AM | Updated on Sep 27 2018 5:56 PM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు 740 మంది ఉద్యోగులు, సిబ్బంది సామూహిక సెలవులు పెట్టి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాల నేతృత్వంలో జిల్లా నలుమూలల్లో ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి.
విజయనగరంలో సమైక్య విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్ల మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేయగా... ఉపాధ్యాయుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించి నిరాహార దీక్షలు, శాంతి యాత్రలు నిర్వహించారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ర్యాలీ నిర్వహించగా... కేంద్రాస్పత్రిలో వైద్య ఉద్యోగుల ధర్నా చేశారు. విజయనగరంలో సమైక్య జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో తుఫాన్ సినిమా వాల్‌పోస్టర్లను, కేంద్ర మంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దహనం చేశారు. చిరంజీవి సమైక్య ఉద్యమంలోకి వచ్చిన తరువాతే ఆయన కుటుంబ సభ్యుల చిత్రాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీమాంధ్రలో చిరంజీవి కుటుంబ సభ్యుల చిత్రాల ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక మెసానిక్ టెంపుల్ వద్ద శ్రీకృష్ణా కమిటీ నివేదికను ప్రదర్శించగా... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబీ పువ్వులిచ్చి నిరసన చేశారు. ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
నెల్లిమర్లలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అదేవిధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నెల్లిమర్ల మండల కేంద్రంలో మొయిద జంక్షన్ నుంచి రామతీర్థం జంక్షన్ వరకు సుమారు ఏడు వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీశయన కులానికి చెందిన సుమారు వేయి మంది సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించడంతో పాటు వంటా-వార్పు, ప్రధాన రహదారిపై సహపంక్తి భోజనాలు చేశారు. చీపురుపల్లిలో దర్జీలు సమైక్యాంధ్రను కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించి మూడు రోడ్ల జంక్షన్ వద్ద దుస్తులు కుడుతూ నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రను కోరుతూ మహిళా ఉపాధ్యాయులు ప్రధాన రహదారిపై వంటా-వార్పుతో నిరసన చేశారు. ఎస్.కోటలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పీసీసీ చీఫ్ బొత్స దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం రహదారిపై వంటా-వార్పు చేశారు. ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేయగా.. పలువురు సమైక్యవాదులు సూర్య నమస్కారాలు చేసి సమైక్యవాదాన్ని చాటారు. దత్తిరాజేరు మండలం మానాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేయగా...గజపతినగరం జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు రాస్తారోకో చేసి రాష్ట్ర విభజనను వ్యతిరేకించాయి.
బొబ్బిలిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించిన ఉపాధ్యాయులు నల్లగొడుగులతో రోడ్డుపై రెండు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా కాంగ్రెస్ అధిష్టానానికి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి వినతిపత్రం అందజేశారు. పలువురు మహిళా ఉపాధ్యాయినులు నల్ల చీరలతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ టీచర్లకు బదులుగా సమైక్యాంధ్ర ద్రోహులైన బొత్స, చిరంజీవి, ద్విగ్విజయ్‌సింగ్‌లకు సత్కారం అనే హాస్యనాటిక ప్రదర్శించారు. పారాదిలో ఉపాధ్యాయులు జన చైతన్య ర్యాలీ నిర్వహించగా... 500 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. తెర్లాం జేఏసీ ఆధ్వర్యంలో 500 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీలో వైఎస్‌ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణారంగారావు పాల్గొన్నారు.
బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం మండలాల్లో 70 మంది వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్షలు చేశారు. తాండ్రపాపారాయ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించి ర్యాలీ, మానవహారం నిర్వహించిన అనంతరం గాంధీబొమ్మ వద్ద కేక్ కట్ చేసి నిరసన చేశారు. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషిస్తున్న సమైక్య ద్రోహులకు పార్వతీపురంలో బడితపూజ చేసి వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. బెల గాంలో ఉపాధ్యాయులు మౌన ప్రదర్శన చేయగా... న్యాయవాదులు కబడ్డీ ఆడారు. ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో సాష్టాంగ నమస్కారం చేస్తూ నిరసన తెలిపారు. సీతానగరంలో హనుమాన్ జంక్షన్ వద్ద ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు కురుపాంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో సన్మానం చేసి నిరసన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement