కాలువ శివారు ప్రాంతాల్లో 45వేల ఎకరాలకు దాళ్వా పంట సాగు చేసుకునేందుకు సాగునీరు విడుదల చేస్తామని సూచనప్రాయంగా పాలకులు ప్రకటించారు.
- 45 వేల ఎకరాలకు నీరిస్తామని సూచనప్రాయంగా ప్రకటన
- వెదజల్లే పద్ధతిలో నాట్లు పూర్తిచేసిన రైతులు
- నీరందక రైతుల ఇక్కట్లు
- ఎండిపోతున్న వరిపైరు
మచిలీపట్నం : జిల్లాలో రబీ సీజన్లో దాళ్వా సాగుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కాలువ శివారు ప్రాంతాల్లో 45వేల ఎకరాలకు దాళ్వా పంట సాగు చేసుకునేందుకు సాగునీరు విడుదల చేస్తామని సూచనప్రాయంగా పాలకులు ప్రకటించారు. బంటుమిల్లి, కృత్తివెన్ను, బందరు, పెడన మండలాల్లో రైతులు దాళ్వా పంటను సాగు చేశారు. బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన మండలాల్లో అధికశాతం రైతులు వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తి చేశారు. అయితే శివారు ప్రాంతాలకు సక్రమంగా సాగునీరు అందకపోవడంతో రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు.
ప్రధాన కాలువల్లో పొలాల్లోకి నీరు పారేంతగా నీటిమట్టం పెరగకపోవడంతో ఆయిల్ ఇంజన్ల ద్వారా కాలువల్లో ఉన్న నీటిని పొలాల్లోకి మళ్లిస్తున్నారు. అధికారులు తాగునీటి అవసరాలకే కాలువలకు నీటిని విడుదల చేస్తున్నామని రైతులు సాగునీరు వస్తుందనే ఆశతో నాట్లు వేశారని చెప్పడం గమనార్హం. కాలువ ఎగువన ఉన్న భూముల రైతులు మినుము పంట సాగు చేయడంతో కాలువలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కాలువల ద్వారా కొసరి కొసరి నీటిని విడుదల చేస్తుండటంతో శివారు భూములకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది.
ఎండిపోతున్న వరి పైరు...
బంటుమిల్లి మండలంలోని ముంజులూరు, బర్రిపాడు, మణిమేశ్వరం, కంచడం తదితర ప్రాంతాల్లో సుమారు 10వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తి చేశారు. కృత్తివెన్ను మండలం మునిపెడ, దోమలగొంది, నీలిపూడి, కొమాళ్లపూడి తదితర ప్రాంతాల్లో 7,500 ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారాా వరినాట్లు వేశారు. బందరు, పెడన మండలాల్లో మరో 15వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారానే వరినాట్లు వేశారు.
విత్తనాలు చల్లి 10 నుంచి 15 రోజులయ్యింది. విత్తనాలు చల్లిన వారం రోజుల అనంతరం పైరుకు మొదటి తడుపు ఇవ్వాల్సి ఉంది. కాలువల ద్వారా సకాలంలో సాగునీరు అందకపోవడంతో శివారు భూములు ఉప్పు సాంధ్రత ఎక్కువగా ఉండడంతో మొక్కలు నీరు అందక చనిపోతున్నాయి. చేసేది లేక రైతులు ప్రధాన కాలువ వద్ద ఒక ఇంజన్ పెట్టి బ్రాంచి కాలువలను నింపి అక్కడి నుంచి పొలం వద్ద రెండో ఇంజన్ ద్వారా నీటిని తోడుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
రెండు ఇంజన్లు పెట్టి ఎకరం పొలాన్ని తడపాలంటే ఒక తడుపునకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. లక్ష్మీపురం లాకుల వద్ద 4.5 అడుగుల నీటిమట్టం ఉంటేనే శివారు ప్రాంతాల్లోని భూములకు సాగునీరు అందే అవకాశం ఉంది. శనివారం 3.5 అడుగులు మాత్రమే నీటిమట్టం ఈ లాకుల వద్ద ఉందని రైతులు చెబుతున్నారు. వెదజల్లే పద్ధతిలో వరినాట్లు పూర్తి చేయని పొలాల్లో నీరు పెట్టి దమ్ము చేశారు. సకాలంలో నీరు అందకపోవడంతో దమ్ము ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు.
వరినాట్లు పూర్తి చేసిన పొలంలో సకాలంలో సాగునీటిని పెట్టకుంటే కలుపు బెడద అధికమవుతుందని రైతులు అంటున్నారు. అధికారుల తీరుతో దాళ్వా పంట సాగు చేసిన రైతుల్లో ప్రారంభంలోనే అయోమయం నెలకొంది. పంట పూర్తయ్యే వరకు సాగునీటిని విడుదల చేస్తారా, ఇక్కట్ల పాలు చేస్తారా అని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వరినాట్లు పూర్తయిన పొలాలకైనా పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.