
ఉత్తరప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ సహాయ మంత్రి నరేంద్ర కశ్యప్
కాంగ్రెస్ వల్లే ఇన్నేళ్లు కులగణన జరగలేదు: ఎంపీ కె.లక్ష్మణ్
కులగణనతో ఎవరి వాటా ఎంతో తేలుతుంది: ఆర్ కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: దేశంలోని బీసీల్లో చైతన్యం లేకపోవడం వల్లే కులగణన ఇంతకాలం జరగలేదని ఉత్తరప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ సహాయ మంత్రి నరేంద్ర కశ్యప్ అన్నారు. విద్య, రాజకీ య రంగాల్లో బీసీలు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభు త్వం జనగణనలో భాగంగా కులగణన కచ్చితంగా చేసి తీరుతుందని స్పష్టంచేశారు. ఈ ప్ర క్రియ పూర్తయితే బీసీలకు అన్ని రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
బ్యాక్‌వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ (బీసీసీఈ) ఆధ్వర్యంలో శనివారం సో మాజిగూడలోని ఓ హోటల్‌లో కులగణన అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీ ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కశ్యప్ మాట్లాడుతూ.. ఓబీసీల్లో నకిలీ ఠాకూర్, నకిలీ బ్రాహ్మణులు ఉన్నారని సైమన్ కమిషన్ చెప్పిందని, ఆర్టికల్ 340 లేకుంటే ఇప్పటి వరకు ఓబీసీ కేటగిరీ ఉండేదే కాదని అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్‌ను చేర్చడం వల్లే బీసీలకు ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు దక్కాయని తెలిపారు.
కాంగ్రెస్ వల్లే కులగణన ఆగింది
దేశంలో జనగణనలో భాగంగా చేపట్టాల్సిన కులగణన కాంగ్రెస్ వల్లే ఆగిపోయిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనగణనలో కులగణన అవసరం లేదని ఆ కాలమ్‌ను తొలగించారని, అప్పటి నుంచి కులగణన ఆగిపోయిందని తెలిపారు.
ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ప్రధానమంత్రులుగా పనిచేసినా కులగణన ఊసే ఎత్తలేదని, ఇప్పుడు రాహుల్‌గాంధీ కులగణన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే చేసి మతప్రాతిపదికన లెక్కలు చెప్పిందని ఆరోపించారు.
ఎవరివాటా ఎంతో తేలుతుంది
జనగణనతో పాటే కులగణన చేపడితే దేశ జనాభాలో ఎవరి వాటా ఎంతనేది స్పష్టత వస్తుందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అన్ని వర్గాలకు అందుతాయని, అత్యంత అల్పసంఖ్యాక కులం నుంచి కూడా ఐఏఎస్ అధికారి అయ్యే వీలుంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. కులగణన పూర్తయిన తర్వాత బీసీల బతుకులు కచ్చితంగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.