
ఎడిటర్ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి సోదాలా?
సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఆగ్రహం
ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే
నోటీసుల్లేకుండా భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు
సాక్షి, అమరావతి: ఎలాంటి నోటీసులు లేకుండా ఓ పత్రిక ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం దేశ చరిత్రలో ముందెన్నడూ జరగలేదని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా.. అని సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా, ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగానే భావిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ రాజకీయ కుట్రలో భాగంగా సోదాల పేరిట పోలీసులు వ్యవహరించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని తన నివాసంలో గురువారం పోలీసుల సోదాల ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, విద్యుత్ స్కామ్‌లతో పాటు విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట, సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం వంటి వరుస వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి గొంతునొక్కాలనే యత్నమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల మూడ్‌ను రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నంలో సాక్షి తన బాధ్యతను నిర్వర్తిస్తోందని చెప్పారు. దాన్ని ఓర్వలేకనే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారని, దీనిని ఖండించకపోతే ఎవరింట్లోకైనా సరే ఇలాగే చొరబడతారన్నారు.
సరైన ఆధారాలు లేకుండా ఎవరి మీదా కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. పోలీసులకు చట్టం, న్యాయం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేనట్టుగా కన్పిస్తోందని చెప్పారు. ‘ఉదయం ఉన్న ఫళంగా పది మంది పోలీసులు ఇంట్లోకి చొర బడ్డారు. ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఒక డీఎస్పీ, సీఐలతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వచ్చి, ఇల్లు సెర్చ్ చేస్తాం.. ఇది ఓపెన్ చేయండి.. అది ఓపెన్‌చేయండి.. ఇంట్లో ఉన్న వాళ్లను వాళ్లెవరు.. వీళ్లెవరు.. అంటూ ఆరాలు తీయడం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే..
నాపై ఇప్పటికే 3–4 కేసులు పెట్టారు
ఇప్పటికే నాపై మూడు నాలుగు కేసులు పెట్టారు. ఒకటి సభా హక్కుల ఉల్లంఘన కేసు అన్నారు. ఒక వార్త రాస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి కాటమనేని భాస్కర్ ద్వారా ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి జారీ చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ, ఏపీ ఎడిషన్‌లో ఒకే వార్త వేర్వేరుగా రిపోర్టు అయ్యిందని మరో కేసు పెట్టారు.
జర్నలిజం మౌలిక నియమాలు, ఓనమాలు తెలిసిన వారెవరికైనా ఇదేంటని తెలుసు. ఎక్కడన్నా ఒక ఘటన జరిగితే ఆ ప్రాంత రిపోర్టర్ స్పాట్ రాస్తారు. సొంత ఊళ్లో ఉన్న రిపోర్టర్‌కు మరిన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి మరింత లోతుగా ప్రజంట్ చేస్తారు. దాన్ని అడ్డం పెట్టుకొని నాపై కేసు పెట్టారు. కొంత మంది సాక్షి పాత్రికేయులపై కూడా కేసులు పెట్టారు. ఇదంతా సాక్షి గొంతునొక్కే ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది.
రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాలు
ఎందుకొచ్చారు.. సెర్చ్ నోటీసు ఉందా? దాంట్లో నా పేరు ఏమైనా ఉందా? అని సోదాలకు వచ్చిన పోలీసు అధికారులను చాలా స్పష్టంగా అడిగాను. ‘లేదు సర్.. ఇన్ అండ్ అరౌండ్ సెర్చ్ చేస్తున్నాం.. జస్ట్ ఊరికే మీ ఇల్లు చూసేసి పోతాం’ అని చెప్పారు. కానీ వాళ్లు వ్యవహరించిన తీరు చూస్తుంటే రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాల పేరిట వచ్చారని స్పష్టంగా కన్పించింది. నా కార్ నంబర్, నా ఫోన్ నంబర్లు తీసుకున్నారు.
వారు స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశంతోనే వచ్చినట్టుగా స్పష్టమైంది. వారు చెబుతున్న లిక్కర్ కేసులో నిందితులు నా ఇంట్లో ఎందుకు ఉంటారు? వారికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడకు ఎందుకు వస్తారు? ఏమైనా అడిగితే పై నుంచి ప్రెజర్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా పొలిటికల్ మోటివేషన్‌తో జరుగుతోందని అర్థమవుతోంది.