
విలేజ్ క్లినిక్స్‌కు తాళం.. ఫ్యామిలీ డాక్టర్ నిర్వీర్యం..
జ్వరం, దగ్గు, జలుబు బాధితులు పీహెచ్‌సీలకు పరుగు తీయాల్సిందే
అల్లాడుతున్న బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల రోగులు
పల్లెల్లో కానరాని వైద్యులు... బాబు పాలనలో ప్రజారోగ్యం అస్తవ్యస్తం
తాళం వేసి ఉన్న ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని సోమవారప్పాడు విలేజ్ క్లినిక్ ఇది. సుమారు 6 వేల మంది ప్రజలకు వైద్య సేవలు అందించేది. 340 మంది బీపీ బాధితులు, 420 మంది షుగర్ పీడితులు, మంచానికే పరిమితం అయిన ఆరుగురు రోగులు ఈ గ్రామంలో ఉన్నారు. అనారోగ్య సమస్యలతో నిత్యం 20 మంది ఈ క్లినిక్‌కు వస్తుంటారు. కొన్నాళ్లుగా మూతబడటంతో జ్వరం, దగ్గు, బీపీ, షుగర్ సమస్యలకు మాత్రల కోసం వచ్చిన వారంతా ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు.
ఏలూరు జిల్లా టి.నరసాపురం 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) గత నెలలో మొరాయించడంతో పీహెచ్‌సీలో పార్కింగ్‌కే పరిమితం అయింది. షెడ్యూల్ ప్రకారం అది రోజూ ఒక గ్రామానికి వెళ్లాలి. పీహెచ్‌సీ వైద్యుడు రోజంతా గ్రామంలోనే గడిపి ప్రజలకు వైద్య సేవలు అందించాలి. వైద్యుడు వెళ్లేందుకు వాహనం లేకపోవడంతో పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిలిచిపోయింది.
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యం పట్ల అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ప్రభుత్వ వైద్య రంగాన్ని అస్తవ్యస్తం చేసి పేదలకు సేవలను దూరం చేస్తోంది. ‘పీపీపీ’ పేరుతో ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం దగ్గర నుంచి ఆరోగ్యశ్రీని బీమా విధానం అంటూ దళారుల చేతిలో పెట్టడం దాకా ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో పేదలకు వైద్య చికిత్సలు పొందడం పెనుభారంగా మారుతోంది.
గత ప్రభుత్వంలో ఠంఛన్‌గా పీహెచ్‌సీ వైద్యులతో గ్రామాలకు వెళ్లిన 104 ఎంఎంయూలు మూలనపడ్డాయి. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నీరుగారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విలేజ్ క్లినిక్స్‌కు తాళాలు వేసి ఉండటం దయనీయ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.
మొక్కుబడిగా ఫ్యామిలీ డాక్టర్..
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా డాక్టర్లు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు సర్కారు ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని మొక్కుబడి తంతులా నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాటి నుంచి 104 వాహనాల నిర్వహణను గాలికి వదిలేసింది. మందుల సరఫరా నిలిపేసింది. వాస్తవానికి పీహెచ్‌సీ పరిధిలోని అన్ని విలేజ్ క్లినిక్‌లను వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శించాలి.
రోజంతా గ్రామంలోనే అందుబాటులో ఉండాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓపీలు చూసి, మధ్యాహ్నం నుంచి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జి అయిన రోగులు, మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఇళ్లకు వెళ్లి ఆరోగ్యంపై వాకబు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలను సందర్శించి పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలి.
గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ స్థాయి ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వారం వారం సమీక్షలు నిర్వహించేవారు ఇప్పుడా పరిస్థితులు లేవు. ప్రభుత్వమే ప్రజారోగ్యాన్ని తేలిగ్గా తీసుకోవడంతో జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
బీపీ పరిశీలించే దిక్కులేదు..
ఒకవైపు పీహెచ్‌సీ వైద్యులు గ్రామాలకు రాకపోవడం.. మరోవైపు విలేజ్ క్లినిక్స్‌లో ఉండే వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో పల్లెల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. విలేజ్ క్లినిక్స్‌లో సేవలు అందించడం కోసం ప్రత్యేకంగా నియమితులైన ఈ వైద్యులు కొద్ది వారాలుగా సమ్మె బాట పట్టడంతో బీపీ, షుగర్ బాధితులు 5–10 కి.మీ. దూరంలో ఉండే పీహెచ్‌సీలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రివెంటివ్ కేర్‌లో అత్యంత కీలకమైన సిబ్బంది విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నా సర్కారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
మందులు నిల్.. జబ్బులపై ఆరా లేదు
బీపీ, షుగర్, ఊబకాయం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. లేదంటే గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. గత ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సచివాలయాలవారీగా బీపీ, షుగర్, ఇతర జబ్బుల బాధితుల వివరాలను నమోదు చేసి ఫ్యామిలీ డాక్టర్ యాప్‌లో అందుబాటులోకి తెచ్చింది.
వైద్యుడు గ్రామానికి వెళ్లగానే యాప్‌లోని వివరాల ఆధారంగా వాకబు చేసేవారు. ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యను గుర్తిస్తే వెంటనే పెద్దాసుపత్రికి రెఫర్ చేసి వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ విధానం అస్తవ్యస్తంగా మారడంతో జబ్బుల గురించి వాకబు చేసే దిక్కు లేకుండా పోయింది. బీపీ, షుగర్, గుండె, మెదడు సంబంధిత కాంబినేషన్ మందులు 104లో అందుబాటులో ఉండటం లేదు. చిన్న చిన్న సమస్యలకు మందులతో పాటు దగ్గు, జలుబు, జ్వరం సిరప్‌లు ఎంఎంయూల్లో లభించడం లేదు.
గత ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి విలేజ్ క్లినిక్స్‌కు 105 రకాల మందులు, 14 రకాల టెస్టింగ్ కిట్స్‌ను సరఫరా చేసింది. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా స్పెషలిస్ట్ వైద్యులే గ్రామాలు, వార్డు స్థాయిలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంది. కూటమి సర్కారు పాలనలో స్పెషలిస్ట్ వైద్య సేవల ఊసే లేకుండా పోయింది.
భరోసా కరువు...
గత ప్రభుత్వం ‘ఆరోగ్య సురక్ష’లో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను సచివాలయాలవారీగా ఆన్‌లైన్‌లో పొందుపరిచింది. దాని ఆధారంగా విలేజ్ క్లినిక్‌లోని వైద్యులు ప్రతి నెలా క్యాన్సర్, గుండె, మెదడు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు అవసరమయ్యే ఖరీదైన మందులను ఆన్‌లైన్‌లో ఇండెంట్ పెట్టేవారు. ఏపీఎంఎస్‌ఐడీసీ వాటిని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పోస్టల్ ద్వారా గ్రామాలకు చేరవేసేది. సీహెచ్‌వో/ఏఎన్‌ఎంలు ఆ మందుల పార్శిళ్లను బాధితుల ఇంటి వద్దకు చేరవేసి ఎలా వాడాలో వివరించేవారు.
జూన్‌లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మందులను గ్రామాలకు పంపడం లేదు. దీంతో వ్యాధిగ్రస్తులకు భరోసా కరువైంది. బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్, కిడ్నీ, క్యాన్సర్ జబ్బుల బాధితులు ఖరీదైన మందులు కొనాలంటే ప్రతి నెలా రూ.వేలల్లో ఖర్చు అవుతుంది. పేద కుటుంబాలకు ఇది పెనుభారమే. మోతాదు ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడకుంటే జబ్బు ముదిరి, తిరగబెట్టి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతుంటాయి.
తాళం వేశారు..
నాకు బీపీ, షుగర్ సమస్యలున్నాయి. ఇంటి పక్కనే ఆస్పత్రి (విలేజ్ క్లినిక్) ఉండటంతో క్రమం తప్పకుండా చెకప్ చేయించుకుని మందులు వాడే దాన్ని. ఇప్పుడు విలేజ్ క్లినిక్‌కు తాళం వేశారు. – సావిత్రి, వృద్ధురాలు, సోమవారప్పాడు, ఏలూరు జిల్లా
ఇప్పుడే చూస్తున్నాం..
మా వీధిలో ఉండే విలేజ్ క్లినిక్‌కు తాళం వేయడంతో బీపీ చెక్ చేయించుకోవాలన్నా పీహెచ్‌సీ వరకూ వెళ్లాల్సి వస్తోంది. గతంలో ఎప్పుడూ విలేజ్ క్లినిక్‌కు తాళం వేసిన దాఖలాలు లేవు. ఇప్పుడే చూస్తున్నాం. –వెంకాయమ్మ, సోమవారప్పాడు, ఏలూరు జిల్లా
ఆ పద్ధతి బాగుంది...
గత ప్రభుత్వంలో డాక్టర్లు ఇంటివద్దకే వచ్చి మంచం నుంచి లేవలేని వాళ్లకు పరీక్షలు చేసి మందులు ఇచ్చేవారు. ఆ పద్ధతి బాగుంది. ఇప్పుడు ఆ విధానం సరిగా నడవడం లేదు. 104లో మందులు ఉండటం లేదు. ఆస్పత్రులకు వెళ్లి రావాలంటే ఇబ్బంది పడుతున్నాం. డెంగీ, మలేరియా, విష జ్వరాలు సోకుతున్నా పట్టించుకోవడం లేదు. – పెద్దన్న, కోటపాడు, నంద్యాల జిల్లా