రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల భద్రతపై సర్కారు దృష్టిసారించింది. వాటి రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ అవసరమైన చోట పూర్తిస్థాయి మరమ్మతులు చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం నూతన సాంకేతిక పరిజ్ఞానం సాయం తీసుకోనుంది. ప్రాజెక్టుల భూగర్భ స్థితిగతులు, పునాదుల అంచనా, గేట్ల పరిస్థితి, లీకేజీల గుర్తింపు సహా ప్రాజెక్టుల లోపలి ప్రాంతాల నిశిత అధ్యయనానికి ‘ద్రోన్’ కెమెరాలతో సర్వే చేయించాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణలో భాగంగా పైప్‌లైన్ లీకేజీలు, పగుళ్లను ‘ద్రోన్’ కెమెరాలతో గుర్తిస్తున్న తరహాలోనే ప్రాజెక్టుల్లో ‘అండర్ వాటర్ సర్వే’ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తొలి దశలో జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో ఈ తరహా సర్వే చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఫలితాలకు అనుగుణంగా రక్షణ చర్యలు చేపట్టాలని భావిస్తోంది. గతంలోనే సూచించిన కేంద్రం... కృష్ణా నదీ పరీవాహకంలో వరదను ఎదుర్కొనే కసరత్తు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. మునుపటి భయానక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టుల భద్రతకు పెద్దపీట వేయాలని రాష్ట్రాలను గతంలోనే ఆదేశించింది. ఇందులో భాగంగా డ్యామ్‌ల పునాదుల నిర్మాణ పరిస్థితులను తొలుత అంచనా వేయాలని, గరిష్ట నీటి ప్రవాహాలు వచ్చినప్పుడు అక్కడున్న పరిస్థితులను అధ్యయనం (హైడ్రాలిక్ మోడల్ సర్వే) చేయాలని సూచించింది. డ్యామ్‌ల నిర్వహణ, భద్రతకు ప్రాధాన్యమిస్తూ నీటిని కిందకు వద లడంలో కీలకమైన క్రస్ట్‌గే ట్లు, వాటిని పైకి, కిందకు లాగేందుకు ఉపయోగించే వైర్ రోప్స్‌ల నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించింది. రోప్‌వైర్లు బలం గా ఉంటేనే గేట్లను ఎత్తిదించడం సాధ్యమవుతుంది. లేదంటే గేట్లు తెరుచుకోవడం కష్టం. దీంతోపాటే గేట్లకు ఎప్పటికప్పుడు పెయింటింగ్ వేయడం సైతం ముఖ్యం. పెయింటింగ్ వేయకుంటే అవి తుప్పుపట్టి గేట్లకు రంధ్రాలు ఏర్పడి డ్యామ్‌ల నుంచి లీకేజీలు జరిగే అవకాశం ఉంది. ఇది మొత్తంగా డ్యామ్‌ల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. ప్రాజెక్టుల వాస్తవ కెపాసిటీని దాటి వరద వచ్చిన సందర్భాల్లో డ్యామ్‌ల క్రస్ట్‌గేట్ల నిర్వహణ సరిగా లేకున్నా, లీకేజీలు ఉన్నా ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్రాలపైఉందని కేంద్రం స్పష్టం చేసింది.