ఆటోను ఢీకొన్న ఇన్నోవా
● పది మందికి గాయాలు
● మైదుకూరు వద్ద రోడ్డు ప్రమాదం
మైదుకూరు : మైదుకూరు – ఖాజీపేట రహదారిలో కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. కడప వైపు నుంచి మైదుకూరుకు వస్తున్న ఇన్నోవా ముందువైపు వెళుతున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనలో మున్సిపాలిటీ పరిధిలోని సరస్వతిపేటకు చెందిన పది మంది వ్యవసాయ కూలీలు గాయపడగా అందులో చెన్నం లక్షుమ్మ అనే మహిళ తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లింది. ఆమెను కడప రిమ్స్‌కు, అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సరస్వతి పేటకు చెందిన 12 మంది, ఖాజీపేట మండలం కుమ్మరికొట్టాలుకు చెందిన 10 మంది వ్యవసాయ కూలీలు బుధవారం చాపాడు మండలం వెదురూరు రాజుపాళెం గ్రామానికి వేరుశనగ పంట పీకేందుకు సరస్వతీపేటకు చెందిన చీపాటి రమణారెడ్డి అనే వ్యక్తికి చెందిన ఆటోలో వెళ్లారు. మధ్యాహ్నం పొలం వద్ద నుంచి భూమాయపల్లె మీదుగా వచ్చి ఆటోలో ఉన్న వారిలో 10 మందిని కుమ్మరికొట్టాలులో దించి ఆటో సరస్వతి పేటకు బయల్దేరింది. ఆటో గ్రామానికి పరుగు దూరంలో ఉండగా జాతీయ రహదారిపై వెనుక వైపు నుంచి ఇన్నోవా కారు ఢీకొంది. ఆటో పల్టీలు కొట్టి రహదారి పక్కన పడిపోయింది. ఆటోలో ఉన్న వ్యవసాయ కూలీలు తీవ్ర గాయాలతో హాహాకారాలు చేశారు. సంఘటనలో ఆటో డ్రైవర్ చీపాటి రమణారెడ్డి, చాగంరెడ్డి నాగలక్షుమ్మ, చెన్నం లక్షుమ్మ, మూలె ఓబుళమ్మ, మూలె నారాయణమ్మ, బొగ్గుల వీరమ్మ, చీపాటి లక్ష్మి, చాగంరెడ్డి వెంకటసుబ్బమ్మ, మందిరెడ్డి నారాయణమ్మ, చాగంరెడ్డి లక్షుమ్మ అనే వారు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన చాగంరెడ్డి నాగలక్షుమ్మ, చెన్నం లక్ష్మమ్మ, మూల ఓబుళమ్మ అనే వారిని కడప రిమ్స్‌కు, మందిరెడ్డి నారాయణమ్మను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారిని మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆటోలో వెనుకవైపు కూర్చుని ఉండటంతో చెన్నం లక్షుమ్మ రెండు కాళ్లు విరగడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె కోమాలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆమెను రిమ్స్ నుంచి తిరుపతికి తరలించారు. మైదుకూరు అర్బన్ ఏఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
గాయపడిన వారిని అంబులెన్స్‌లోకి
ఎక్కించిన సీఐ, కమిషనర్
మైదుకూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగి కళ్ల ముందే క్షతగాత్రులు రోడ్డు పక్కన పడిపోయి ఉండటంతో కడప వైపు నుంచి మైదుకూరుకు వస్తున్న మైదుకూరు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వై.రంగస్వామి వెంటనే స్పందించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే క్షణాల్లో సంఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్‌లోకి సీఐ, కమిషనర్ క్షతగాత్రులను ఎక్కించడంలో నిమగ్నమయ్యారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న పరిసరాల్లో ఉన్న వారు అధికారుల మానవత్వంపై ప్రశంసలు కురిపించారు.
ఆటోను ఢీకొన్న ఇన్నోవా


