ఆర్కే వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ వర్క్‌షాప్
వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో క్వాంటం కంప్యూటింగ్ వర్క్ షాప్ ప్రారంభమైనట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐబీఎం గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటివి క్వాంటం కంప్యూటర్లను తయారు చేయడానికి కావలసిన ఉద్యోగాలను కల్పించేందుకు ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుందన్నారు. ఆరు రోజులపాటు వివిధ ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్లు, ఐబీఎం సైంటిస్టులు, ఇండస్ట్రీ నిపుణులు ఇచ్చే ట్రైనింగ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీ థార్వాడ్ నుంచి ప్రొఫెసర్ అశ్వత్ బాబు, ఐబీఎం రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ రీతజిత్ ముజుందార్ ప్రసంగించారు. ఆర్గనైజర్లుగా పరిపాలన అధికారి రవికుమార్, అకడమిక్ డీన్ రమేష్ కై లాష్, డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ సుధాకర్ రె డ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రమోషన్లలో సమన్యాయ సూత్రం పాటించాలి
ప్రొద్దుటూరు రూరల్ : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రమోషన్లలో సమన్యాయ సూత్రం పాటించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జిల్లా జేఏసీ కన్వీనర్ మస్తాన్ కోరారు. బుధవారం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, మండలంలో విధులు నిర్వహించే సచివాలయ ఉద్యోగులు గాంధీరోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియామక సమయంలో 10 శాఖలకు చెందిన ఉద్యోగులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేశారన్నారు. అయితే ప్రమోషన్ల ప్రక్రియలో మాత్రం కొన్ని శాఖలకు ప్రమోషన్ల ఊసే లేకుండా ఉండటం అన్యాయమని తెలిపారు. ప్రమోషన్ ఛానల్ ఉన్న డిపార్ట్‌మెంట్లకు సీనియారిటీ జాబితా విడుదల చేయలేదని, వీరి కోసం మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ రిపోర్టు ఇవ్వకముందే కొన్ని డిపార్ట్‌మెంట్లకు ప్రమోషన్లు ప్రకటించడం, మరికొన్నింటికి మంత్రుల కమిటీ అని సాకు చెప్పడం అన్యాయమని తెలిపారు. జేఏసీ పట్టణ కన్వీనర్ నాగార్జున, సురేష్, రఫీ, శివశంకర్‌రెడ్డి, సుదర్శన్, ఓంకార్ పాల్గొన్నారు.
ఈనెల 6 నుంచి బ్రౌన్ గ్రంథాలయ వారోత్సవాలు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో సి.పి.బ్రౌన్ 142వ వర్ధంతి (డిసెంబర్ 12)ని పురస్కరించుకుని ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, బాధ్య కులసచివులు ఆచార్య పుత్తా పద్మ పర్యవేక్షణలో ఈనెల 6 నుంచి 12 వరకు ‘బ్రౌన్ గ్రంథాలయ వారోత్సవాలు’ నిర్వహించనున్నట్లు సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి తెలిపారు. 6వ తేదీ ఉదయం 9 గంటలకు 6,7,8 తరగతుల విద్యార్థులకు పద్య పఠనం, (వేమన, సుమతి శతకాలలోని 6 పద్యాలు) (ప్రతి శతకం నుండి మూడు పద్యాలు ఉండాలి), 7వ తేదీ ఉదయం 9 గంటలకు 9,10 తరగతుల విద్యార్థులకు ’సి.పి.బ్రౌన్ జీవితం – సాహిత్యం’ అనే అంశంపై వక్తృత్వం, 8వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు 3,4,5 తరగతుల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు ఉంటాయన్నారు. తమకు నచ్చిన చిత్రం గీయవచ్చన్నారు. 9వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు డిగ్రీ కళాశాల విద్యార్థులకు రామాయణ, భారత, భాగవతాలలోని విషయాలపై ధారణ పరీక్ష ఉంటుందన్నారు. 10వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు 8,9,10 తరగతుల విద్యార్థులకు కథా పూరణం, 11వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు 8,9,10 తరగతుల విద్యార్థులకు జిల్లాకు సంబంధించిన వైజ్ఞానిక అంశాలపై పోటీలు ఉంటాయన్నారు. 12వ తేదీ శుక్రవారం ముగింపు సమావేశం ఉంటుందన్నారు.


