పులివెందుల ప్రాంతానికి వైఎస్ కుటుంబం ఎనలేని సేవలు
పులివెందుల టౌన్ : పులివెందుల ప్రాంతానికి వైఎస్ కుటుంబం ఎనలేని సేవలు అందించి ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక భాకరాపుంలోని విజేత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో వైఎస్ భారతిరెడ్డి మానసిక దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేందుకు విజేత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలను ఏర్పాటు చేసి ఉచితంగా సేవలందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. వైఎస్ భారతిరెడ్డి ఎంతో గొప్ప మనసున్న మనిషి అని కొనియాడారు. వైఎస్ భారతిరెడ్డి గురించి విమర్శలు చేసేవారు ఒక్కసారి ఇక్కడికి వచ్చి పరిశీలించాలని సూచించారు. అంతేకాకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు చదువు చెప్పిన గురువు వెంకటప్ప పేరుతో పాఠశాల ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. మంచి కార్యక్రమాలు చేసే వైఎస్ కుటుంబానికి ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులు ఎప్పటికి ఉంటాయన్నారు. పులివెందుల చాలా వెనుకబడిన ప్రాంతమని అలాంటి ప్రాంతం నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి గ్రామంలో కూడా రోడ్లు, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారన్నారు. పులివెందుల నియోజకవర్గంలో జేఎన్‌టీయూ కళాశాల, వేంపల్లె వద్ద ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పులివెందులలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని తెలిపారు. వైఎస్సార్ ప్రతి గ్రామంలో ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా జీఎన్‌ఎస్‌ఎస్ ద్వారా గండికోట నుంచి పైడిపాళెం, చిత్రావతికి నీరు తీసుకువచ్చారన్నారు. అనంతరం వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విభిన్న ప్రతిభావంతులు, మానసిక దివ్యాంగులకు బహుమతులను ప్రదానం చేశారు. అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విజయభాస్కర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థులు, దివ్యాంగులపట్ల
వైఎస్ భారతిరెడ్డి ఔదార్యం
విజేత స్కూలులో అంతర్జాతీయ
దివ్యాంగుల దినోత్సవం
విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి


