
తొలి అడుగు కాదు.. చివరి అడుగు
ప్రొద్దుటూరు : ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనకు తొలి అడుగు కాదని, చివరి అడుగేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. 1978లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ప్రారంభమైన చంద్రబాబు రాజకీయ జీవితం 2028కి జగన్‌తో సమాప్తం కానుందని అన్నారు. ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాదరెడ్డి గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం ఇంటింటా తిరుగుతూ గొప్పలు చెప్పుకొంటూ తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు దొరసానిపల్లెలోని శేగిరెడ్డి కాటిరెడ్డి కల్యాణ మండపంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డితోపాటు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హాజరవుతారన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్ అభిమానులందరూ సమావేశానికి తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఎన్నికల సందర్భంగా అలివిగాని హామీలు ఇచ్చారని రాచమల్లు వ్యాఖ్యానించారు. సుమారు 143 హామీలు ఇచ్చినా కేవలం నాలుగైదు మాత్రమే అరకొరగా అమలు చేశారని తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కూటమి నేతలు బాండ్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈ బాండ్లు ప్రామిసరి నోట్‌తో సమానమని, వీటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునన్నారు.
ఎమ్మెల్యే వరద సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి
గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకుని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వచ్చి ప్రజలకు సేవ చేయాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. అస్వస్థతకు గురైన ఆయనకు బైపాస్ సర్జరీ చేసినట్లు ఆయన కుమారుడు కొండారెడ్డి తెలిపారన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్లు రాగుల శాంతి, చింపిరి అనిల్ కుమార్, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సత్యం, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, గోపవరం ఉపసర్పంచ్ రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాజుపాళెం మండల కన్వీనర్ బాణా కొండారెడ్డి, వెంకటేష్, రామమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి