సీమకు నీళ్లివ్వండి బాబూ! | - | Sakshi
Sakshi News home page

సీమకు నీళ్లివ్వండి బాబూ!

Jul 3 2025 5:22 AM | Updated on Jul 3 2025 5:22 AM

సీమకు

సీమకు నీళ్లివ్వండి బాబూ!

‘కరెంట్‌’ టాపిక్‌..

శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పాదన...రైతుల్లో గుబులు

సీమ ప్రాజెక్టులకు నీటి విడుదలపై నీలి నీడలు!

కూటమి ఎమ్మెల్యేలపై సర్వత్రా విమర్శలు

కూటమి నేతల నిర్లక్ష్యం

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు శ్రీశైలం జలాలను విడుదల చేసే విషయంలో సీమకు చెందిన కూటమి నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు విద్యుత ఉత్పాదన చేపట్టారు. వరద ప్రభావం కూడా బాగా తగ్గుముఖం పట్టింది. ఇందువల్ల శ్రీశైలంలో నీటి మట్టం క్రమేపీ తగ్గిపోతే కేసీ కెనాల్‌, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. –సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు, కడప

కనీస నీటిమట్టం నిర్వహించాలి

శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 854 అడుగులను నిర్వహించాలి. ఆపై వచ్చే వరద ప్రవాహాన్ని అనుసరించి రాయలసీమ ప్రాజెక్టులైన తెలుగుగంగ, కేసీ కెనాల్‌, ఎస్‌ఆర్‌బీసీలకు సాగునీరు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలి. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పాదన చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమ నీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి.

– దస్తగిరిరెడ్డి, జిల్లా ప్రధాన

కార్యదర్శి, ఏపీ రైతుసంఘం,కడప

కడప సెవెన్‌రోడ్స్‌: శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీటి విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పలు రిజర్వాయర్లు బోసిపోయినట్లు అగుపిస్తున్నాయి. వరద ప్రవాహం బాగా ఉన్నప్పుడు నీరు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందంటూ రైతులు మండిపడుతున్నారు. ప్రాజెక్టుల పరిధిలోని ఎమ్మెల్యేలంతా అధికార టీడీపీకి చెందిన వారైనప్పటికీ పట్టించుకోలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీశైలం జలాశయం కుడి, ఎడమ గట్టు వద్ద విద్యుత్‌ ఉత్పాదన ప్రారంభించారు. ఆ మేరకు నీరు దిగువనున్న నాగార్జున సాగర్‌ జలాశయానికి వెళుతోంది. దీంతో శ్రీశైలానికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రభావం ఒక్కసారిగా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. సీమకు నీటి విడుదలపై ప్రభు త్వం నుంచి ఇప్పటివరకు ప్రకటన వెలువడని నేపథ్యంలో బుధవారం రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు కర్నూలులోని చీఫ్‌ ఇంజనీరు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.

● ఇన్నాళ్లూ ఎగువన కురిసిన వర్షాల వల్ల శ్రీశైలానికి వరద ప్రభావం భారీగా వచ్చి చేరడం, విద్యుత్‌ ఉత్పాదన చేపట్టకపోవడం వంటి కారణాలతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 874 అడుగులకు చేరడంతో రాయలసీమ రైతుల్లో ఆశలు మొలకెత్తాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా నీరందితే సకాలంలో పంటలు సాగు చేసుకోవడానికి వీలవుతుందని భావించారు. శ్రీశైలం జలాశయంలో మంగళవారం విద్యుత్‌ ఉత్పాదన ప్రారంభం కావడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఉన్న సమాచారం మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం కుడిగట్టు కాలు వ వద్ద విద్యుత్‌ ఉత్పాదన ద్వారా 27,708 క్యూసెక్కుల నీరు దిగువనున్న కృష్ణానదిలోకి వదులుతోంది. ఎడమగట్టు కాలువ వద్ద తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పాదన ద్వారా 35,315 క్యూసెక్కులు దిగువనున్న నాగార్జున సాగర్‌ జలాశయంలోకి విడుదల చేస్తోంది. ఇలా శ్రీశైలం జలాశయం రెండు వైపుల నుంచి 63,023 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. బుధవారం జలాశయంలోకి వస్తున్న వరద ప్రవాహం 64097 క్యూసెక్కులుగా నమోదైంది. విద్యుత్‌ ఉత్పాదన వల్ల కొంత నీరు పోయినా ఇన్‌ఫ్లో ద్వారా 1074 క్యూసెక్కుల నీరు మిగులు ఉన్నట్లే కదా అని ఇంజనీరింగ్‌ అధికారులు అంటున్నారు. అయితే వరద ప్రవాహం స్థిరంగా ఉండదనే విషయాన్ని విస్మరిస్తున్నారు. అధికార గణాంకాల ప్రకారమే సోమవారం సుమారు లక్షా 50 వేల క్యూసెక్కులు ఉన్న శ్రీశైలం ఇన్‌ఫ్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి 64,097 క్యూసెక్కులకు పడిపోయింది. మధ్యాహ్నం 3.00 గంటల సమయానికి శ్రీశైలం నీటిమట్టం 875.40 అడుగులుగా ఉంది. ప్రస్తుతం డ్యాంలో 165 టీఎంసీలు ఉన్నాయి.

● తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 16.95 టీఎంసీలకుగాను ప్రస్తుతం 1.83 టీఎంసీ మాత్రమే ఉన్నాయి. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే ఇంకా 15.12 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. కానీ, ఇన్‌ఫ్లో జీరోగా ఉంది. ఔట్‌ఫ్లో 80 క్యూసెక్కులు ఉంది. బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 17.74 టీంఎసీలు కాగా, ప్రస్తుతం 6.24 టీఎంసీ(35.17 శాతం) ఉన్నాయి. ఇన్‌ఫ్లో జీరో..అవుట్‌ ఫ్లో 132 క్యూసెక్కులు ఉన్నాయి.

● గోరకల్లు రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 12.44 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.13 టీఎంసీ (25.16 శాతం) ఉన్నాయి. ఇన్‌ఫ్లో జీరో, అవుట్‌ ఫ్లో 70 క్యూసెక్కులు ఉన్నాయి. అవుకు కాంప్లెక్స్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 4.15 టీఎంసీకిగాను ప్రస్తుతం 1.68 టీఎంసీ (40.53 శాతం) ఉన్నాయి. గండికోట సామర్థ్యం 26.85 టీంఎసీకిగాను ప్రస్తుతం 14.77 టీఎంసీ (54.99 శాతం) ఉన్నాయి. ఇన్‌ఫ్లో 0, అవుట్‌ఫ్లో 470 క్యూసెక్కులు. మైలవరం సామర్థ్యం 9.98 టీఎంసీకిగాను 2.57 టీఎంసీ గా ఉండగా, ఇన్‌ఫ్లో 0, అవుట్‌ ఫ్లో 131 క్యూసెక్కులు. పైడిపాలెం సామర్థ్యం 6 టీఎంసీలకుగాను ప్రస్తుతం 4.46 టీఎంసీ ఉన్నా యి. ఇన్‌ఫ్లో 0, అవుట్‌ఫ్లో 10 క్యూసెక్కులుగా ఉంది. సర్వరాయ సాగర్‌ సామర్థ్యం 3.06 టీఎంసీకిగాను ప్రస్తుతం 0.89 టీఎంసీలు ఉండగా, ఇన్‌ఫ్లో 70, అవుట్‌ ఫ్లో 48 క్యూసెక్కులు ఉన్నాయి.

నోరు మెదపని ప్రజాప్రతినిధులు

తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌ ఆయకట్టు పరిధిలోని శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూ రు, కడప అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతి నిద్యం వహిస్తున్న శాసనసభ్యులందరూ అధికార కూటమికి చెందిన వారే. వీరిలో ఒకరు బీజేపీకి చెందిన వారు కాగా, మిగతా వారంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి రాయలసీమ జిల్లాల్లో ప్రజలు మెజార్టీని కట్టబెట్టారు. అయితే, ఈ ప్రాంత సాగునీటి విషయంపై వారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఆయకట్టు రైతుల్లో వినిపిస్తున్నాయి. వరద ప్రభావం బాగా వస్తున్న రోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా జలాశయాలను నింపేందుకు చర్యలు తీసుకుని ఉండాల్సిందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పాదన ద్వారా నీటిని సాగర్‌కు విడుదల చేస్తూపోతే తమ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కూటమి ఎమ్మెల్యేలు స్పందిస్తారో లేదో చూడాలి.

సీమకు నీళ్లివ్వండి బాబూ! 1
1/2

సీమకు నీళ్లివ్వండి బాబూ!

సీమకు నీళ్లివ్వండి బాబూ! 2
2/2

సీమకు నీళ్లివ్వండి బాబూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement