
పేద విద్యార్థులకు వరం.. గురుకులం
బ్రహ్మంగారిమఠం: నాణ్యమైన విద్య, అధునాతన వసతులతో రూపుదిద్దుకున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (బాలుర) మహా గురుకులం విద్యాలయం పేద విద్యార్థుల పాలిట వరం అని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. బుధవారం బి.మఠం మండలంలో నూతనంగా ఏర్పాటైన మహా గురుకులం (బాలుర) విద్యాలయంలో అకడమిక్ భవనాల్లో తరగతులు, వసతి గృహ భవనాలను కలెక్టర్, మైదుకురు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ లతో కలిసి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బి.మఠం మండల కేంద్రానికి సమీపంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వసతులతో సువిశాల ప్రాంగణంలో గురు కులం రూపుదిద్దుకుందన్నారు. దాదాపు వెయ్యి మంది విద్యార్థులకు విద్యా వసతులు కల్పించగల సామ ర్థ్యం ఉన్న ఈ బాలుర మహా గురుకులంలో.. ఈ విద్యా సంవత్సరానికి గాను 640 మంది విద్యార్థులతో అడ్మిషన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఈ మహా గురుకులం కీర్తి రాష్ట్ర స్థాయిలో రెపరెపలాడించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ 21 కోట్ల వ్యయంతో మహా గురుకులం నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందన్నారు. మైదుకురు నియోజకవర్గ అభివృధ్ధి కోసం కలెక్టర్ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అన్నింటికీ మూలం ఒక్క విద్యనే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు. గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్ ఉషశ్రీ మాట్లాడారు. అనంతరం అధికారులు తరగతి , హాస్టల్ గదులు.. వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్, డీఈవో షంషుద్దీన్, ఎస్‌ఎస్‌ఏ ఏసీపీ నిత్యానందరాజు,సోషల్ వెల్ఫర్ డీడీ సరస్వతి, డ్వామా పీడీ ఆది శేషారెడ్డి, ఎంపీపీ వీర నారాయణరెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
మహా గురుకుల విద్యాలయంలో తరగతుల ప్రారంభోత్సవం