
ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు షురూ
వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాయలం పరిధిలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో సోమవారం విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలన అధికారి రవికుమార్, డీన్ అకడమిక్ రమేష్ కైలాస్ ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం పెద్దవీడు గ్రామానికి చెందిన బి.మేఘన తొలి అడ్మిషన్ పొందగా.. సత్యసాయి జిల్లా బుక్కపట్నం గ్రామానికి చెందిన బి.హరీష్ రెండవ అడ్మిషన్, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అలారుదిన్నె గ్రామానికి చెందిన బి.మహేశ్వరి మూడవ అడ్మిషన్ పొందారు. మొదటి, మూడు ర్యాంకుల విద్యార్థులకు ప్రవేశ పత్రాలతోపాటు బహుమతులు ప్రదానం చేశారు.
8 కౌంటర్లు.. ఉదయం 6 గంటలకే ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ ఎంట్రెన్స్ విభాగంలో ఉన్న రాజీవ్ సర్కిల్ వద్ద ముందుగా వచ్చిన విద్యార్థులకు టోకన్లను అందజేశారు. వివిధ దశలలో స్క్రీనింగ్ చేయడానికి 8 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
● తొలి రోజు 538 మందికి అడ్మిషన్లు పిలవగా, 481 మంది హాజరై అడ్మిషన్లను పొందారు. ట్రిపుల్ ఐటీ పరిపాలన అధికారి రవికుమార్, ఫైనాన్స్ అధికారి కోటేశ్వరి, అధికారులు లింగమూర్తి, రాఘవరెడ్డి, తిరుపతిరెడ్డి, రఫి, జ్ఞాన వెంకట్, నవీన్, పవన్ కుమార్, ఆనంద్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.
● మంగళవారం రోజు మరో 500 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జూలై 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని డైరెక్టర్ తెలిపారు.
తొలి రోజు 481 మందికి అడ్మిషన్లు