
త్రిశంకు స్వర్గంలో భాషా పండితులు
బద్వేలు: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు’ సాధారణ బదిలీలు జరిగినప్పుడల్లా.. భాషా పండితులకు స్థానచలనం కలుగుతోంది. రెండేళ్లకోసారి జరిగే బదిలీల్లో భాషా పండితులే సమిధలవుతున్నారు. ఏదో ఒక చోట నాలుగైదేళ్లు కూడా ఉంచడం లేదు. కనీసం సమీప ప్రాంతాలకు కూడా బదిలీ చేయడం లేదు. మహిళలను కూడా అడవి ప్రాంతాలు, రవాణా సౌకర్యం సరిగా లేని గ్రామాలకు బదిలీ చేస్తుండటంతో.. వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న మండలం (వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం) నుంచి చిత్తూరు జిల్లా సరిహద్దులోని (అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం) మారుమూల గ్రామానికి (దాదాపు 190 కిలోమీటర్ల దూరం) రవాణా సౌకర్యం బొత్తిగా లేని గ్రామానికి బదిలీ చేశారు. అలాగే అదే కలసపాడు మండలానికి చెందిన మరో ఉపాధ్యాయుడిని నెల్లూరు సరిహద్దు మండలమైన చిట్వేలి (160 కిలో మీటర్ల దూరం)కి బదిలీ చేశారు. పులివెందుల దగ్గర పని చేస్తున్న ఉపాధ్యాయుడిని (107 కిలోమీటర్ల దూరం) సంబేపల్లె మండలానికి బదిలీ చేశారు. అదే విధంగా ప్రొద్దుటూరు మండలానికి చెందిన మహిళా ఉపాధ్యాయురాలిని 123 కిలో మీటర్ల దూరంలో ఉన్న పెనగలూరు మండలానికి బదిలీ చేశారు. పోరుమామిళ్ల మండల మహిళా ఉపాధ్యాయురాలిని 153 కిలో మీటర్ల దూరంలో నెల్లూరు సరిహద్దున ఉన్న చిట్వేలి మండలం పోలుపల్లికి బదిలీ చేశారు. ఇలా వందల కిలో మీటర్ల దూరానికి అధిక సంఖ్యలో మహిళలను బదిలీ చేయడంతో.. వారి బాధలు వర్ణనాతీతంగా తయారయ్యాయి.
జీవో 77 తెచ్చిన తంటా
2008, 2012లలో మెగా డీఎస్సీ ద్వారా తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళం, సంస్కృతం భాషల ద్వారా ఎంపికై న భాషోపాధ్యాయుల్లో ఎక్కువ మందికి గ్రేడ్–1 పండిట్లుగా పదోన్నతి లభించింది. 2019లో ప్రభుత్వం జీవో ఎంఎస్: 91 ద్వారా భాషోపాధ్యాయులందరికీ గ్రేడ్ 1 ఉన్నతీకరణకు శ్రీకారం చుట్టింది. అయితే ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు(ఎస్‌జీటీ)తమకు భాషో పాధ్యాయుల కేడర్ కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో చేసేదేమీ లేక అప్పటి ప్రభుత్వం జీవో ఎంఎస్ 77 ద్వారా గ్రేడ్ 2 కేడర్‌ను రద్దు చేసింది. ఫలితంగా ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లాలో 113 మంది డీఈవో పూల్‌లోకి వెళ్లారు. అందులో 68 మంది తెలుగు భాషా పండితులు మిగిలిపోయారు. కేడర్ రద్దు చేసినప్పుడు ఆ పోస్టుల్లో ఉన్న వారందరికీ పదోన్నతి కల్పిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో గడిచిన ఆరేళ్లలో నాలుగు సార్లు బదిలీలకు గురయ్యారు. నిబంధనల మేరకు ఒక ఉపాధ్యాయుడు బదిలీ అయిన పాఠశాలలో ఎనిమిదేళ్లు పని చేయవచ్చు. దానికి భిన్నంగా పండిట్లను ఎప్పుడు పడితే అప్పుడు బదిలీ చేయడం పరిపాటిగా మారింది.
భాషోపాధ్యాయుల పోస్టులన్నీ మాయం
ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో తెలుగు, ఉర్దూ, సంస్కృతం, కన్నడ, తమిళం తదితర భాషా పండితులు 113 మంది ఉన్నారు. అందులో తెలుగు పండితులు 68 మంది ఉండగా, తెలుగు పండిట్ పోస్టుల ఖాళీలు 79 చూపించారు. అందులో వైఎస్సార్ కడప జిల్లాలో 11 ఖాళీలు చూపించి.. మొత్తం ఖాళీలన్నీ (68 ఖాళీలు) అన్నమయ్య జిల్లాలో చూపించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని 36 మండలాల్లో 11 ఖాళీలు మాత్రమే చూపించి.. అన్నమయ్య జిల్లాలో 4 మండలాల్లో (చిట్వేలి, ఓబులవారిపల్లె, గాలి వీడు, పెనగలూరు) 39 ఖాళీలు చూపించారు. మరో 4 మండలాల్లో (టి.సుండుపల్లె, వీరబల్లి, సంబేపల్లి, రైల్వేకోడూరు) మండలాల్లో 21 ఖాళీలు చూపించారు. ఇవ్వన్నీ కూడా వైఎస్సార్ కడప జిల్లా నుంచి 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం పైమాటే. ఇలా అన్నమయ్య జిల్లాలో ఖాళీలన్నింటిలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన దాదాపు 50 మంది భాషా పండితులతో భర్తీ చేశారు. మరి వైఎస్‌ఆర్ కడప జిల్లాలో భాషా పండితుల ఖాళీలు ఏమైనట్లో విద్యాశాఖాధికారులు చెప్పాల్సి ఉంది.
ప్రాథమిక పాఠశాలల్లో మిగిలిపోయిన పోస్టులు
ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో ఎస్‌జీటీ ఉపాధ్యాయులు ఎక్కువ శాతం మంది పట్టణాలు, మండల కేంద్రాలు కోరుకోవడంతో.. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 700 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు.. విద్యార్థులు రాక మూతపడే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
హైకోర్టు ఉత్తర్వులూ అమలు కాని వైనం
వైఎస్సార్ కడప జిల్లాలోని 113 మందితో సహా రాష్ట్రంలోని 1199 మంది భాషా పండితులు హైకోర్టును ఆశ్రయించారు. భాషా పండితుల బాధలను క్షుణంగా పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ గౌరవ జస్టిస్ మన్మధరావు 2024 డిసెంబర్ 20న భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని కూటమి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా 2019 నుంచి భాషాపండితులకు ఇవ్వాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి 3 నెలల గడువులో పదోన్నతులు కల్పించాలని కూడా ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వులిచ్చి ఆరు నెలలు కావస్తున్నా.. కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. హైకోర్టు ఉత్తర్వులను కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులు బేఖాతరు చేస్తూ ఖాళీలు లేవని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రభుత్వం తాత్సారం చేయడంతో తమకు కూడా భాషోపాధ్యాయులుగా పదోన్నతులు కావాలని సెకండ్ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా కోర్టు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. దీంతో తమకు న్యాయం చేయాలని భాషాపండితులు మరల కోర్టుకు విన్నవించుకోగా.. జూలై 15వ తేదీకి కేసు వాయిదా ఇచ్చినట్లు సమాచారం.
గ్రేడ్ 2 కేడర్ రద్దుతో ఇబ్బందులు
డీఈవో పూల్‌లో కొనసాగుతున్న వైనం
ఆరేళ్లలో నాలుగోసారి బదిలీ
హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్
సెలవుల వైపు.. చూపు
రెండేళ్లకోసారి డీఈవో పూల్ ఉపాధ్యాయులు బదిలీకి బలి అవుతున్నారు. దీంతో పిల్లల చదువులు సక్రమంగా ముందుకు సాగడం లేదు. సంసారం మొత్తం అక్కడికి మార్చడం కుదరక.. తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ హక్కుగా ఉన్న వివిధ రకాల సెలవులపై దృష్టి పెట్టారు. ఎక్కువ రోజులు ఇంటి దగ్గర ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో అధిక శాతం పాఠశాలల్లో తెలుగు భాషా పండితుల కొరత ఏర్పడే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని సమాచారం.
న్యాయం జరుగుతుంది
జిల్లాలో డీఈవో పూల్‌లో ఉన్న భాషా పండితులకు న్యాయం జరుగుతుంది. విద్యా శాఖ కమిషనర్ కూడా వారికి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్‌జీటీ ఉపాధ్యాయ ఖాళీలు 700 వరకు ఉన్నాయి. అందులో నూతనంగా జరిగిన డీఎస్సీకి 217 ఖాళీలు భర్తీ చేస్తారు. మిగిలిన ఖాళీలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఎవరికీ అన్యాయం జరగకుండా చట్ట ప్రకారం నడుచుకుంటాం.
– షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖాధికారి, కడప

త్రిశంకు స్వర్గంలో భాషా పండితులు

త్రిశంకు స్వర్గంలో భాషా పండితులు

త్రిశంకు స్వర్గంలో భాషా పండితులు