వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ కక్ష సాధింపు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ కక్ష సాధింపు

Jun 28 2025 8:15 AM | Updated on Jun 28 2025 8:15 AM

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ కక్ష సాధింపు

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ కక్ష సాధింపు

కడప సెవెన్‌రోడ్స్‌ : బద్వేలు నియోజకవర్గంలోని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ ఆరోపించారు. ఇందులో భాగంగా రెవెన్యూ, ఇరిగేషన్‌, పోలీసు అధికారులను ఉసిగొల్పి వలంటీర్‌ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఇంటిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో విచారించి న్యాయం చేయాలంటూ శుక్రవారం కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరికి వినతిపత్రాన్ని సమర్పించారు.

● ఈ సందర్భంగా డీసీ గోవిందరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు నమోదు, ఇల్లు కూల్చివేత లాంటి సంఘటలకు అధికార పక్షం పాల్పడుతోందని ఆరోపించారు. ఒక దళిత కౌన్సిలర్‌ బంకును ఇటీవల కూల్చివేశారన్నారు. బద్వేలు–కడప రహదారిలో చెరువు బఫర్‌జోన్‌లో నిర్మించుకున్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటిని కూల్చేందుకు అధికారులు యత్నించారన్నారు. అధికారులు చెబుతున్న విధంగా ఆ ఇల్లు చెరువు పోరంబోకులో నిర్మించుకుని ఉంటే డీ–మార్కేషన్‌ చేసి, నోటీసులు జారీ చేసిన అనంతరమే తొలగించాలన్నారు. చట్టబద్దంగా వ్యవహరించకుండా అధికారులు రాత్రివేళ వచ్చి శ్రీకాంత్‌రెడ్డి ఇంటిలోని ఫర్నీచర్‌, ఏసీ, ఫ్రిజ్‌, ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి భయబ్రాంతులకు గురిచేశారని తెలిపారు. ఇటీవల తమ పార్టీ పిలుపు మేరకు కడపలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి బద్వేలు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో యువతను శ్రీకాంత్‌రెడ్డి తరలించారన్న కక్షతోనే అధికార పార్టీ నేతలు ఇలాంటి అరాచకాలకు దిగారని విమర్శించారు. చెరువు పోరంబోకు స్థలంలో చాలామంది ఇళ్లు నిర్మించుకున్నారని, తొలుత వారి ఇళ్లు తొలగించకుండా వైఎస్సార్‌ సీపీ నాయకుని ఇంటిని తొలగించే యత్నం ఎందుకు చేశారో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉండే బద్వేలు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జగనన్న కాలనీల్లోని భూములను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. సుమారు 300 మంది బద్వేలు చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా ఎందుకు తొలగించరని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ స్వగ్రామమైన చెన్నకేశంపల్లెలో వైఎస్సార్‌ సీపీ గణనీయంగా ఓట్లు నమోదయ్యాయన్నారు. దీంతో ఆయకట్టు బంజరు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు నోటీసులు జారీ చేయించడం అన్యాయమన్నారు.

టీడీపీ అరాచకాలు ఎదుర్కొంటాం – ఎమ్మెల్యే

తమ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పాల్పడుతున్న అరాచకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ అన్నారు. చెరువులో నిర్మించుకున్న ఇళ్లను తొలగించకుండా శ్రీకాంత్‌రెడ్డి ఇంటిని తొలగించేందుకు అధికారులు రావడం తగదన్నారు. కనీసం సమయం ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఇంటిని తొలగిస్తామనడం దారుణమని విమర్శించారు. శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారన్న కక్షతోనే ఇంటి కూల్చివేతకు పాల్పడ్డారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏరోజు టీడీపీ వాళ్ల ఇళ్లు కూల్చడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడలేదన్నారు. బి.కోడూరు మండలంలో తమ పార్టీ సానుభూతి పరులు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పంటలను ధ్వంసం చేశారని ఆరోపించారు. నియోజకవర్గంలో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.

● బాధితుడు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ 2017లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే తాను ఇల్లు నిర్మించుకున్నానని తెలిపారు. ఆ స్థలం సుమారు 70 సంవత్సరాలుగా తమ కుటుంబ ఆధీనంలో ఉందని తెలిపారు. ఇల్లు ఖాళీ చేయాలంటే కనీసం రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరినప్పటికీ టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు శుక్రవారం తెల్లవారుజామున కూడా వచ్చారని తెలిపారు. ప్రజలు అఽధికారం ఇచ్చింది కక్ష సాధింపులు తీర్చుకోవడానికి కాదని, సుపరిపాలన అందించేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు.

● ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు పులి సునీల్‌కుమార్‌, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు దేవిరెడ్డి ఆదిత్య, ఎస్సీ సెల్‌ నాయకులు వెంకటేశ్వర్లు, సీహెచ్‌ వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాంత్‌రెడ్డి ఇల్లు కూల్చేయత్నం

డీ–మార్కేషన్‌, ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అధికారుల వీరంగం

ఫర్నీచర్‌, ఇతర సామాగ్రి ధ్వంసం

బద్వేలులో పరాకాష్ఠకు అధికార పక్షం అరాచకాలు

ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement